Monday 5 February 2024

శ్రీ గరుడ పురాణము (81)

 


గాయత్రి మంత్ర ప్రథమ పాదాన్ని, అనగా, తత్సవితుర్వరేణ్యంను కవచంలోనూ, రెండవ పాదం భర్గోదేవస్య ధీమహిని నేత్రాలలోనూ, మూడవ పాదం థియోయోనః ప్రచోదయాత్ ను చేతులలోనూ, నాలుగవ పాదమైన పరోరజసేఽసావదోం ను సర్వాంగాల లోనూ న్యాసంచేయాలి. విధంగా సంధ్యావందనముచేసేవారికి సర్వశుభాలూ ప్రాప్తిస్తాయి.

 

గాయత్రి యొక్క మొదటి మూడు పాదాలూ బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలు. ఋషినీ, ఛందాన్నీ స్మరిస్తూ మంత్రజపం చేసేవారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.

 

'పరోరజసేఽసావదోమ్'ని గాయత్రి తురీయ (శ్రేష్ఠ) పాదమంటారు. దీనికి ఋషి నిర్మలుడు, ఛందం గాయత్రి, దేవత పరమాత్మ.

 

ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలలో 1008 లేదా 108 మార్లు గాయత్రి మంత్రాన్ని పఠించేవారు బ్రహ్మలోకానికి వెళ్ళే అధికారాన్ని పొందుతారు. (అధ్యాయాలు 35-37)

 

దుర్గాదేవి స్వరూపం సూర్యధ్యానం మరియు మాహేశ్వరీ పూజన విధి

 

మహాదేవా! నవమి మున్నగు తిథులలో 'ఓం హ్రీం దుర్గే రక్షిణి' అనే మంత్రంతో పూజించాలి. మార్గశిర తదియనాడు మొదలు పెట్టి క్రమగా నామాలతో రోజుకొక్క స్వరూపంతో అమ్మవారిని పూజించాలి. నామరూపాలేవనగా గౌరీ, కాళీ, ఉమా, దుర్గా, భద్రా, కాంతీ, సరస్వతీ, మంగళా, విజయా, లక్ష్మీ, శివా, నారాయణీశక్తులు. నామ, రూప, శక్తులు గల దేవిని పూజించువానికి ఇష్టవస్తు, ప్రియజన వియోగముండదు.

 

దుర్గాదేవికి పదునెనిమిది హస్తాలుంటాయి. వాటిలో ఖేటక, ఘంట, దర్పణ, ధను, ధ్వజ, డమరు, పరశు, పాశ, శక్తి, ముద్గర, శూల, కపాల, బాణ, అంకుశ, వజ్ర, చక్ర, శలాకలుండగా ఒకే చేయి తర్జనీ ముద్రలో వుంటుంది. అష్టాదశ భుజియైన దేవి స్వరూపాన్ని స్మరించిన వారికి అప్లైశ్వర్యాలూ అబ్బుతాయి. మహిషాసుర మర్దినియైన దేవి సింహంపై వుంటుంది.

 

శివదేవా! సూర్యార్చన విధిలో సూర్యభగవానుని తేజః స్వరూపాన్ని, రక్త వర్ణ కాంతి రూపాన్ని, శ్వేతపద్మంపై స్థితుని, ఏకచక్ర రథంపై ఆసీనుని, ద్విభుజయుక్తుని, కమలధరుని ధ్యానించాలి. (అనుబంధం-7లో చూడండి) మాహేశ్వరి పూజను వర్ణిస్తాను వినండి. ముందుగా స్నానం, ఆచమనం నిర్వర్తించి ఆసనంపై కూర్చుని న్యాసం చేసి ఒక మండలంలో మహేశ్వరుని చిత్రించి పూజించాలి. హరపూజను వీలైనంత ఎక్కువగా హరుని పరివారమంతటితో సహా చేయాలి.


No comments:

Post a Comment