Sunday 29 March 2015

హిందూ ధర్మం - 152 (వేదాలు, వ్యాసమహర్షి)

వేదమనగా జ్ఞానం. జ్ఞానానికి పరిధి ఉండదు. అందునా వేదములు ఈశ్వరీయములు. అంటే భగవంతునిచే ఇవ్వబడినవి. మానవులు రాసిన విషయాలు కొంత పరిధి ఉంటుంది, కానీ అనంతుడైన భగవంతునిచే చెప్పబడిన విషయాలకు పరిధులను ఎవరు నిర్ణయించగలరు. ఇంతకముందు చెప్పుకున్నట్టుగా వేదం అనగా జ్ఞానం అని అర్దం. విశ్వానికి, విశ్వకర్తకు సంబంధించిన అపర, పర జ్ఞాన భాగమే వేదం.
-------------------------------------------------------------------------

వేదం యొక్క విస్తృతి తెలియపరచే ఒక సంఘటన ఉంది. పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి, బ్రహ్మచర్యం  అవలంబించి, బ్రహ్మదేవునితో మూడుసార్లు ధీర్ఘాయువు పొందారు. నాలుగు యుగాలు (43,20,000 సంవత్సరాలు) వేయి సార్లు పునారవృతమైతే బ్రహ్మకు ఒక పగలు, ఇంకో వేయి మహాయుగాలు (అంటే 1,000*43,20,000 = 4,32,00,00,000 సంవత్సరాలు) బ్రహ్మకు ఒక రాత్రి. 8,64,00,00,000 సంవత్సరములు బ్రహ్మ దేవుడికి ఒక రోజు. అటువంటి మూడు బ్రహ్మదివసాలను (25,92,00,00,000 సంవస్తరములు) గురువు వద్ద వేదం నేర్వడానికి సరిపోక తపస్సు చేస్తే, బ్రహ్మ సాక్షాత్కరించి, 'వేదం పూర్తిగా నాకే తెలియదు. నీకు వేదరాశిని చూపుతాను, చూడు!' అని చెప్పి కోటి సూర్య్ల కాంతితో వెలిగిపోతున్న మేరుపర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు. భరద్వాజుడిది చూసి భయపడి, 'అయ్యో! నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో పిడికిడైనా లేదే! వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా?' అని తలిచి, 'నాకవసరమైనది మీరే నిర్ణయించండి' అని బ్రహ్మదేవునితో అంటాడు. అప్పిడి బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశిని మూడు పుడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి, 'ఇదంతా అధ్యయనం చేసేంతవరకూ నీవు జీవింతువు గాక!' అని వరమిచ్చాడు. కానీ ఆ మూడు పిడికిళ్ళ వేదాధ్యయనమే ఇంతవరకు పూర్తికాలేదు అంటూ శ్రీ నృసింహ సరస్వతీ స్వామి గురుచరిత్రలో శిష్యులకు వివరిస్తారు.
---------------------------------------------------------------------------

ఇంత విస్తారమైన వేదాన్ని గ్రంధస్థం చేయడం పెద్ద సాహసోపేతమైన చర్య. అటువంటిది ఇంత విస్తారమైన వేదాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఔపోసన పట్టినవాడు మాత్రమే వాటిని గ్రంధస్థం చేయగలడు. అతడు మేధావి, అపర ప్రజ్ఞావంతుడై ఉండాలి, వేదం మొత్తం అర్ధం చేసుకున్నవాడై ఉండాలి. అటువంటి వాడు, వేదాలను గ్రంధస్థం చేయుట కొరకు జన్మించిన కారణజన్ముడు వ్యాసమహర్షేనని ఋషిమండలి గుర్తించి, వేదాలను గ్రంధస్థం చేసే కర్తవ్యాన్ని వ్యాసమహర్షికి అందిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

To be continued .................

No comments:

Post a Comment