Wednesday 21 October 2015

ఆధ్యాత్మిక విజయానిచ్చే అమరిక

సాధకుడి ఆధ్యాత్మిక ఎదుగుదలకు, ఈ నవరాత్రుల ఆరాధనా అమరికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇది ప్రతి సాధకుడు అవశ్యకంగా దాటవలసిన పరిణామ దశలను సూచిస్తోంది. ఒక దశ సహజంగానే తర్వాతి దశకు తీసుకువెళుతుంది, కానీ తద్విరుద్ధంగా వెళితే, అది పతనానికి కారణమవుతుంది. ఈ కాలంలో అనేకమంది సాధకులు అజ్ఞానంతో తమలో మాలిన్యాలను తొలగించుకుని, శుద్ధి చేసుకుని, దైవీసంపత్తిని పొందే ప్రయత్నం చేయకుండా నేరుగా జ్ఞాన సముపార్జన చేయాలని ప్రయత్నించి, ఆ మార్గంలో విఫలమై ఫిర్యాదు చేస్తున్నారు. వారు ఎలా ముందుకెళ్ళగలరు? మాలిన్యాలు తొలగిపోయేవరకు, శుద్ధ గుణాలు పెంపొందేవరకు జ్ఞానం లభించదు. సాత్త్వికమనే మొక్క మాలిన్యమైన మట్టి యందు పెరగదు.

ఈ అమరికను అనుసరిస్తూ మీ ప్రయత్నం సాగిస్తే, మీరు తప్పక విజయం సాధిస్తారు. ఇదే మీ మార్గం. మోక్షానికి వేరొక మార్గం లేదు. దుర్గుణాలన్నిటిని నశింపజేసుకుని, వాటి విరుద్ధమైన సద్గుణాలను పెంపొందించుకోండి. ఈ ప్రక్రియ ద్వారా మీరు త్వరగా పరిపూర్ణతను సాధించి, మీ గమ్యమైన పరబ్రహ్మంతో ఏకమవుతారు. అప్పుడు మీకు పూర్ణ జ్ఞానం లభిస్తుంది, మీరు సర్వజ్ఞులు, సర్వశక్తివంతులై, సర్వత్రా వ్యాపించిన ఆత్మతత్త్వాన్ని అనుభూతి చెందగలుగుతారు. అందరిలో మిమ్మల్నే చూసుకోగలుగుతారు. జీవన్ముక్తులవుతారు. జననమరణ చక్రం మీద, సంసారనమనే అసురుడి  మీద శాశ్వతమైన విజయం పొందుతారు. ఇక మీకు ఏ మాత్రం బాధ ఉండదు, లేమి ఉండదు, పుట్టుక ఉండదు, చావు ఉండదు, విజయం మీదే అవుతుంది.

జగజ్జననికి విజయమగుగాకా! ఆమె మిమ్మల్ని ఆధ్యాత్మిక నిచ్చెనలో ఒక్కో మెట్టు ఎక్కించి, అత్యున్నత శిఖరమందున్న పరమాత్మ యందు లీనం చేయుగాకా !

- స్వామి శివానంద

No comments:

Post a Comment