దుర్గాదేవి సప్తమ రూపం కాళరాత్రీ నామంతో ప్రఖ్యాతి చెందింది. శరీరం గాఢాంధకార సమంగా పూర్తి కాలవర్ణంలో ఉంటుంది. శిరోజాలు చెల్లాచెదురై ఉంటాయి. గళసీమలో విద్యుత్‌సమంగా భాసిల్లే హారం ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలూ బ్రహ్మాండసమంగా గోళాకారంలో ఉంటాయి. ఈమె నుంచి విద్యుత్ సమంగా భాసిల్లే కిరణాలు బహిర్గతమవుతుంటాయి. నాసిక నుంచి ఉఛ్చ్వాసనిశ్వాసల ద్వారా భయంకర ప్రజ్వలితాగ్ని జ్వాలలు బహిర్గతమవుతుంటాయి. గార్ధభం వాహనం. పైకి లేచి ఉన్న దక్షిణ హస్తం వరద హస్తం ద్వారా సర్వులకూ వరాలను ప్రసాదిస్తుంటుంది. దక్షిణంగా క్రిందిభాగంలో ఉండే హస్తం అభయముద్రలో ఉంది.
వామభాగంలో పైకి లేచిన హస్తంలో లోహకంటము, క్రింది చేతిలో ఖడ్గమూ ఉన్నాయి. కాళరాత్రీదేవి స్వరూపం చూడ అత్యంత భయంకరంగా ఉన్నా ఈ తల్లి సర్వదా శుభఫలాలనే ప్రసాదిస్తుంది. ఈ కారణం వల్లనే ఈమెకు ‘శుభంకరీ’ అన్న నామం కూడా ఏర్పడి ఉంది. కనుక భక్తులు ఎంతమాత్రం ఈమెకు భయపడడం కానీ, ఆమె వల్ల విపత్తులు ఉంటాయని భావించడం కానీ చేయకూడదు. దుర్గాపూజలో ఏడవనాడు కాళరాత్రీదేవిని ఆరాధించే విధానం ఉంది. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమై ఉంటుంది. సాధకునకై బ్రహ్మాండంలో ఉన్న సిద్ధిద్వారాలన్నీ తెరచుకొని ఉంటాయి. ఈ చక్రస్థితుడై ఉన్న సాధకుని మనస్సు పరిపూర్ణంగా కాళరాత్రీ దేవి స్వరూపంలో లయమై ఉంటుంది. జనని సాక్షాత్కారం వల్ల ప్రాప్తమగునట్టి పుణ్యసర్వస్వాన్ని పొందగలుగుతాడు.
భక్తుడి పాపవిఘ్న సర్వస్వం నశిస్తుంది. అక్షయ పుణ్యలోకాలు లభిస్తాయి. కాళరాత్రీదేవి దుష్టులను నాశనం చేస్తుంది. దానవ, రాక్షస భూత ప్రేతాదులు ఈ జనని స్మరణ మాత్రం చేతనే భయపడిపోతాయి. జంతుభయం, శత్రుభయం, రాత్రిభయం అనేవి ఉండవు. కాళరాత్రీదేవి కృప వల్ల ఆ తల్లి భక్తుడు సర్వభయాలకూ దూరమవుతాడు. కాళరాత్రీదేవి స్వరూప విగ్రహాన్ని తన హృదయంలో ఉంచుకొని సాధకుడు ఏకగ్రతాభావంతో ఆమెను ఉపాసించాలి. యమనియమ సంయమాలను పరిపూర్ణంగా పాటించాలి. మనోవాక్కార్మభి పవిత్రుడై భక్తుడు వ్యవహరించాలి. శుభకరీదేవిని ఉపాసించడం వల్ల లభించే శుభాలను వర్ణించలేం.
సేకరణ: సూర్య దినపత్రిక 2011
http://www.suryaa.com/features/article.asp?subCategory=3&ContentId=49658
No comments:
Post a Comment