Sunday, 18 October 2015

కాత్యాయిని మాత

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూల వరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

దుర్గామాత యొక్క ఆరవ రూపం కాత్యాయినీ దేవి. ఆమెకు ఆ పేరు రావడానికి కారణమిలా ఉంది. కతుడనే ప్రఖ్యాతి చెందిన మహర్షి ఒకడుండేవాడు. ఆ మహర్షి పుత్రుడి పేరు కాత్యుడు. ఈ కాత్య మహర్షి గోత్రంలోనే విశ్వవిఖ్యాతుడైన కాత్యాయన మహర్షి ఉద్భవించాడు. ఈ మహర్షి పరాంబను ఉపాసిస్తూ అనేక సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. పరమేశ్వరి తన సదనంలో పుత్రికగా ఆవిర్భవించాలన్నది ఆ మహర్షి అభిలాష.

పరమేశ్వరి అతని అభీష్టాన్ని నెరవేర్చింది. కొంత కాలం తరువాత మహిషాసురుడి అత్యాచారాలతో తల్లడిల్లిన భూభారాన్ని దూరం చేయాలని త్రిమూర్తులు తమ తేజోంశాలను అర్పించి మహిషాసుర వినాశనార్థం ఓ దేవిని ప్రభవింపజేశారు. సర్వప్రథమంగా కాత్యాయ మహర్షి ఆ దేవిని ఆరాధించడం వల్ల ఆమె కాత్యాయిని అని పిలువబడింది. మరో కథ కూడా వినిపిస్తుంది. ఈ దేవియే కాత్యాయనుని సదనంలో పుత్రికగా అవతరిస్తుంది. ఆశ్వీజ కృష్ణ శుక్ల చతుర్దశి నాడు జన్మించి శుక్ల సప్తమి, అష్టమి, నవమి పర్యంతం మూడు ఆ దేవి కాత్యాయన రుషి పూజలు గ్రహించి దశమి నాడు మహిషాసురుడిని వధించింది.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. శ్రీకృష్ణ భగవానుడిని భర్తగా పొందేందుకు గోపికలు యమునాతీరంలో ఈ దేవినే ఆరాధించారు. పూజ మండలంలో అధిషాత్రీదేవిరూపంలో ప్రతిష్టించబడి విరాజిల్లుతూ ఉంటుంది. ఆ తల్లి స్వరూపం అత్యంత భవ్యమైనది. ఆమె వర్ణం స్వర్ణసమంగా భాసిల్లుతూ ఉంటుంది. దేవి చతుర్భుజాలలో అలరారుతుంటుంది. దక్షిణ హస్తం పైన ఉన్నది అభయముద్రలోనూ. క్రింది చేయి వరద ముద్రలోనూ ఉంటుంది. ఎడమవైపు పై చేతిలో ఖడ్గమూ, క్రింది హస్తంలో పద్మమూ విరాజిల్లుతుంటాయి. ఆమె వాహనం సింహం. భక్తులు దుర్గాపూజలో ఆరవ నాడు ఈ దేవి స్వరూపాన్నే ఉపాసిస్తూ ఉంటారు. ఆ రోజున సాధకుడి మనస్సు ఆజ్ఞాచక్రంలో లయమై ఉంటుంది. యోగసాధనలో దీనికి అత్యంత మహత్వపూర్ణ స్థానముంది. ఈ చక్రంలో స్థితుడై ఉన్న సాధకుడు తన సర్వస్వాన్ని కాత్యాయనీదేవి చరణ కమలాలలో అర్పించి పరిపూర్ణంగా ఆత్మసమర్పణ చేస్తాడు. దేవీ కటాక్షంతో చతుర్విధ పురుషార్థ ఫలాలు లభిస్తాయి. తేజోసంపన్నులై భాసిల్లుతుంటారు.

సేకరణ : సూర్య దినపత్రిక 2011

No comments:

Post a Comment