Sunday 11 October 2015

హిందూ ధర్మం - 179 (నిరుక్తము - 2)

వేదాలకు అనేక విధాలుగా అర్దాలను అన్వయం చేయవచ్చని యాస్కాచార్యులు చెప్పారు. ప్రధానంగా వేదాలకు 6 పద్ధతుల్లో అర్దం చెప్తారు. ఈ విషయాన్ని ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద్ సరస్వతీగారు తమ ఋగ్వేద్ భాష్యభూమికలో వివరించారు.

1. నిరుక్తం ఆధారంగా చెప్పేది మొదటి విధానం. ఇది ప్రధానంగా పదాల ఆవిర్భావం, ధాతువులు (మూలశబ్దాలను) అన్వయించి చెప్పేది. వైదిక వాఙ్మయాన్ని అనుసరించి ఉంటుంది. ఇది సులభంగానే అనిపించినా, అత్యంత క్లిష్టమైనది, పరిపూర్ణంగా విశ్లేషించి చెప్పేది. ఇది యాస్కుడి నిరుక్తం ఆధారంగా వచ్చింది. ఈ పద్ధతి దోషరహితంగా, ఎంతో మేధస్సును ఉపయోగించేదిగా ఉంటుంది.

2. ఐతిహాసిక పద్ధతి. దీన్నే చారిత్రిక విధానం అని కూడా అంటారని యాస్కుడు చెప్పారు. ఇందులో చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ప్రత్యేక సంఘటనల ఆధారంగా వేదమంత్రాలకు అర్దాలను అన్వయం చేస్తారు. భారతదేశంలో పూర్వం నుంచి జీవించిన రాజులు, మహానుభావుల పేర్లను వైదిక మంత్రాలకు అన్వయం చేసి అర్దం చెప్తారు. ఇలా అర్దాలు వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే వేదాల్లో ఉన్న అనేక పదాలను అనేకులు ఇంతకముందు పేర్లుగా పెట్టుకుని ఉంటారు. వారిని ఆయా మంత్రాలకు అన్వయం చేసి, ఉదాహరణలు చెప్పడం, వేదాన్ని వివరించడం సులభమే. కానీ కాలక్రమంలో ఈ పద్ధతి ప్రాభవాన్ని కోల్పోయింది. ఎందుకంటే ప్రజలు వైదిక సత్యాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సింది పోయి, ఆయా పాత్రలకు, వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు.

3. పౌరాణిక పద్ధతి - ఇందులో వేదానికి పురాణాల్లోని సంఘటనల ఆధారంగా అర్దాలు చెప్తారు. ప్రతి మంత్రానికి లేదా సూక్తానికి ఒక కధను ఉదాహరణగా చెప్తారు. ఈ పద్ధతి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పద్ధతిలో వేదమంత్రాలను వివరించని సందర్భం ఉండదు. యాస్కుడు దీన్ని కూడా ఐతిహాసిక పద్ధతి అనే అన్నారు.

4. శాస్త్రీయ (Scientific) పద్ధతి - నిరుక్తం తర్వాత ఇదే అత్యంత కష్టమైన పద్ధతి. ఇందులో వైదిక సత్యాలను భౌతిక శాస్త్ర సూత్రాలు, సహజంగా ప్రకృతిలో జరిగే చర్యల రూపంగా వివరిస్తారు. ఇది కష్టమైన పద్ధతియే అయినా, సరైన అర్దాలను ఇవ్వగలుగుతుంది కనుక పండితులు ఈ పద్ధతినే ఎంచుకుంటారు.

5. గూఢార్ధాలు, యోగపద్ధతి - ఇది ఎంతో క్లిష్టమైన పద్ధతి. కఠినమైన యోగపరమైన జీవితం గడిపేవారు మాత్రమే వేదమంత్రాలకు ఈ విధమైన అర్ధాలను దర్శించగలుగుతారు. ఈ పద్ధతిలో వేదం మొత్తం పరబ్రహ్మం, ఆత్మ, మానవశరీరం గురించి, బహిర్దృష్టి, అంతర్దృష్టిల గురించి వివరిస్తుంది. యాస్కాచార్యులు ఈ పద్ధతిని తన గ్రంధంలో 14 వ అధ్యాయంలో ఉపయోగించారు. వేదంలోని కొన్ని మంత్రాలకు యోగపరమైన అర్దాలు మాత్రమే చెప్పవలసి ఉంటుంది. మరే ఇతర అర్దాలు చెప్పినా, దుష్ఫలితాలు కలుగుతాయి.

6. కర్మకాండకు సంబంధించిన పద్ధతి. వైదిక అర్దాలను చెప్పడంలో ఇది చాలా సులువైన మరియు ప్రత్యక్ష పద్ధతి. ఉదాహరణకు ఏదైనా ఒక సూక్తం జగత్తుకు సంబంధించిన సత్యాన్ని చెప్పేది అవచ్చు, లేదా ఈశ్వర ప్రార్ధన కావచ్చు. కానీ అది పుట్టువెంట్రుకలు తీసే సమయంలో పఠించవలసి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఈ పద్ధతి ప్రకారం అర్దాన్ని చెప్తే, దాన్ని అసలు అర్దాన్ని పక్కనబెట్టి, కేవలం పుట్టువెంట్రుకలు తీసే సమయంలో మాత్రమే చదువుతారు. అనగా కేవలం కర్మకు మాత్రమే ఉపయోగిస్తారు.

అన్ని పద్ధతులను గమనిస్తే, ఐతిహాసిక, పౌరాణిక, కర్మకాండకు చెందిన పద్ధతులు కాలక్రమంలో వచ్చినవే తప్పించి, వాటి మీద ఆధారపడకూడదు. ఏదో తాత్కాలికంగా, సమయానుకూలంగా చెప్పుకోదగ్గవి మాత్రమే. అవి ఎల్లప్పుడూ సత్యాలను వ్యక్తపరుస్తాయని చెప్పలేము.

To be continued .................

No comments:

Post a Comment