Sunday 4 October 2015

హిందూ ధర్మం - 178 (నిరుక్తము - 1)

నిరుక్తము - ఈ వేదాంగము వేదానికి చెవి వంటిది. ఇది వైదిక పదాల యొక్క ఆవిర్భావం గురించి వివరిస్తుంది. నిరుక్తం అనేది కఠినమీన వైదిక పదాల సమాహారమైన నిఘంటువుగా భాష్యం వంటిది. వేదాన్ని యధార్ధంగా అర్దం చేసుకోవడానికి నిరుక్తం ఉపయోగపడుతుంది. వేదం ఈశ్వరీయము. మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది. అలా అని కేవలం సంస్కృతం నేర్చుకున్నంత మాత్రాన వేదానికి సరైన అర్దం చెప్పలేరు. ఎందుకంటే వైదిక సంస్కృతం వేరు, వ్యావహారిక సంస్కృతం వేరు. వేదం ఉన్నది వైదిక సంస్కృతంలో. ఇది చాలా పైస్థాయి పదజాలం, ఎంతో లోతైన, గంభీరమైన అర్దంతో కూడిన పరిభాష. వ్యవహారంలో వాడేది వ్యావహారిక సంస్కృతం. ఇది మామూలు స్థాయిది. ఈ రెండిటిని కలిపి, వైదిక సంస్కృతంలో ఉన్న వేదానికి, వ్యావహారిక సంస్కృతంలో అర్దం చెప్తే, అది దోషభూయిష్టంగానే ఉంటుంది. అందువలన సంస్కృతంలో పాండిత్యం వలన వేదానికి అర్దం చెప్పచ్చు అనడం తప్పే అవుతుంది. అంతేగాక, వేదంలో చెప్పబడ్డ ఏ పదానికైనా ఒకే అర్దం ఉండదు. ఒకే పదానికి నానార్దాలు ఉంటాయి. మంత్రక్రమాన్ని అనుసరించి, సమయసందర్భాలను అనుసరించి, ఆయా పదాలకు అర్దలాను అన్వయం చేయాల్సి ఉంటుంది. అందుకోసమే నిరుక్తమ్ను ఏర్పరిచారు ఋషులు. ఇది వేదానికి నిఘంటువు వంటిది.

ఎప్పుడు ఏ అర్ధాన్ని స్వీకరించాలనే దానికి ఆర్యసమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతీ గారు సత్యార్ధ ప్రకాశ్‌లో చెప్పిన ఉదాహరణ చూడండి. ఎక్కడ ఏదీ ప్రకరణమో, అక్కడ దాన్ని గ్రహించటం ఉచితము. ఎట్లనగా, ఒకడు ఒక వ్యక్తితో 'హేభృత్య! త్వం సైంధవమానయ' అన్నాడు, అనగా ఓ సేవకుడా! నీవు సైంధవం తీసుకురా అని అర్దం. అప్పుడు ఆ సేవకుడు సమయము, ప్రకరణము (సందర్భము) గురించి ఆలోచించటం అవశ్యకం. ఎందుకంటే సైంధవం అనే పదానికి రెండు అర్దాలున్నాయి. ఒకటి గుఱ్ఱము, రెండవది లవణము (ఉప్పు). అతని యజమానికి అది బయటకు వెళ్ళే సమయం అయితే, అతడు గుఱ్ఱాన్ని తీసుకువెళ్ళాలి, భోజన సమయం అయితే ఉప్పు తీసుకువెళ్ళడం సరైన పద్ధతి. అలా కాక భోజన సమయంలో గుఱ్ఱాన్ని, గమన సమయంలో ఉప్పుని తీసుకువెళితే, అది యజమానికి ఆగ్రహాన్ని కలిగించి, సమయం, సందర్భం తెలియనివాడు తనకెందుకు అనుకోవచ్చు. అప్పుడు అతడి ఉద్యోగానికే ముప్పు వాటిల్లవచ్చు. అదే విధంగా వేదం విషయంలో అర్దాలను అన్వయం చేసేటప్పుడు ప్రకరణము - సమయము గురించి తప్పక ఆలోచించాలి. దానికి నిరుక్తం సహాయపడుతుంది.

నిఘంటువు మీద అనేక భాష్యలున్నా, యాస్కుడు రాసిన భాష్యాన్నే వేదాంగాల్లో ఒకటిగా స్వీకరించారు. ఇది కేవలం వైదిక పదాల గురించే కాక, వాటి ధాతువుల గురించి, ఒకే ధాతువును నుంచి ఉద్భవించిన సారూప్యత కలిగిన అనేక ఇతర పదాల గురించి వివరిస్తుంది.

To be continued ..............

No comments:

Post a Comment