Tuesday 17 February 2015

శివరాత్రి కధ - 4 (విజ్ఞానం)

శివరాత్రి కధ- 4 (విజ్ఞానం)

త్రిమూర్తులకు భేధం లేదని చెప్పి మహాశివుడు అదృశ్యమవుతాడు. అప్పుడు ఆ శివలింగం అనంతమైన ఆ శూన్యంలో, జలంలో అండంగా మారుతుంది. ఆ అండం నుంచి సృష్టి జరగాలనీ చేయాలని బ్రహ్మ తపస్సు చేస్తాడు. ఈలోగా ఆ అండంలోనికి విష్ణువు ప్రవేశిస్తాడు. విష్ణువంటే ప్రాణశక్తి కనుక విష్ణువు ప్రవేశంతో సృష్టి మొదలవుతుంది. కర్దమ, దక్ష, మరీచి మొదలైన ప్రజాపతులను బ్రహ్మ సృష్టి చేస్తాడు. ఆ తరువాత జను, పక్షి, క్రిమి, కిటక, రాక్షస, దేవ, మానవ మొదలైన సంతతి పెరిగిందని పురాణం చెప్తున్నది.

పురాణం ఒట్టి కధ కాదు, అందులో చాలా విజ్ఞానం, నీతి, జీవన విధానం, ధర్మం ఇమిడి ఉంటాయి. ఈ శివరాత్రి కధలో అటువంటి ఆశ్చర్యకరమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

శూన్యం తప్ప ఏమి లేదు అని పురాణం అంటుంది. అవును, ఈ విశ్వం శూన్యం నుంచి వచ్చి, తిరిగి శూన్యంలోనే లయమవుతుందని ఆధునిక సైసు ఒప్పుకుంది. ఒక శూన్యమంతా నీటితో నిండి ఉంది అన్నది పురాణం. అంతరిక్షంలో ఈ భూమిని ముంచెత్తగల స్థాయిలో నీరు ఉన్నదని, అది ఈ భూమికి చాలా దూరంగా ఉందని ఈ నాటి అంతరిక్ష శాస్త్రవేత్తలు నొక్కి చెబుతున్నారు, అంగీకరిస్తున్నారు.

మనకు కనిపించే ఈ విశ్వమే కాదు, వందల కోట్ల విశ్వాలు భగవంతుని సృష్టిలో ఉన్నాయని భారతీయ గ్రంధాలు చెప్తున్నాయి. ఈ విశ్వమంటే ఒక బ్రహ్మాండం. మనకు అనేక బ్రహ్మాండాలు ఉన్నాయని, వాటికి అనేక బ్రహ్మలు ఉన్నారని పురాణాల్లో కనిపిస్తుంది. బ్రహ్మ విష్ణువు యొక్క నాభి కమలం నుంచి పైకి రావడం అంటే, అనంతమైన భగవత్ సృష్టిలో ఒక బ్రహ్మాండం యొక్క ఆవిర్భావం జరగడమని అర్దం. ఇటువంటి అనేక బ్రహ్మాండాలు, ప్రతి క్షణం ఉద్భవిస్తుంటాయి, నశిస్తుంటాయి. సముద్రపుఅలలపై వచ్చే నీటి బుడగలవలే అనేక బ్రహ్మాండాలు ప్రతిక్షణం విష్ణువులో ఐక్యం అవుతాయని, కొత్తవి వస్తుంటాయని మన వాళ్ళు చెప్పారు. అదే విషయాన్ని ఈ నాటి శాస్త్రవేత్తలు అంగీకరించారు. ఈ గెలాక్సికి అవతల, భూమిని పోలిన అనేక గ్రహాలు ఉన్నాయని ఈ రోజు చెప్తున్నారు. బ్రహ్మ తన ఉనికిని గురించి తాను బయట శోధించి విఫలం కావడం, తరువాత తపస్సు ఒక సందేశం. విశ్వమంతా వెతికినా, మానవుడి ఉనికి యొక్క రహస్యం బాహ్యప్రపంచంలో దొరకదు, తన ఉనికిని గురించి తెలుసుకోవాలంటే అంతర్ముఖత చెందాలి, అంటే లోపలికి చూడాలి, తనలో ఉన్న ఆత్మను చూడాలి. అప్పుడే తన ఉనికి గురించి సమస్తము తెలుస్తుంది. ఒక రకంగా అష్టాంగయోగంగా అర్ధం చేసుకోవచ్చు.

ఇక శివుడు లింగరూపంలో రావడం అన్నది పెద్ద వైజ్ఞానికి సత్యం. దీన్ని ఆధునిక కాస్మాలజిస్ట్‌లు ఒప్పుకున్నారు.

ఈశా ఫౌండేషన్ స్థాఫుకులు జగ్గీవాసుదేవ్ గారు శివలింగం గురించి ఈ విధంగా చెప్పారు. 'శివలింగం ellipsoid అంటే 3-Dimensional ellipse ఆకారంలో ఉంటుంది. Modern cosmologistsలు galaxy ల మధ్యభాగాన్ని(core) ఫొటొ తీసినప్పుడు ప్రతి galaxy core కూడా ellipsoid  ఆకారంలోనే ఉంది. నిరాకారమైన (unmanifest) శక్తి (energy) ఒక సాకార (manifest) రూపాన్ని సంతరించుకునే క్రమంలో, రూపాంతరం చెందే క్రమంలో, అది మొట్టమొదటగా ellipsoid అంటే లింగాకారాన్ని సంతరించుకుంటుంది అని పురాణం, ఆధునిక సైన్సు చెప్తున్నాయి'. ఈ బ్రహ్మాండమే లింగము, శివలింగం బ్రహ్మాండానికి సంకేతం అంటాయి శివ, లింగ పురాణాలు. ఎప్పుడైన పిల్లలు శివలింగం అంటే ఏంటీ అని అడిగినప్పుడు ఈ విషయాన్ని నిర్భయంగా, గర్వంగా చెప్పండి.

ఈ లింగం ఆద్యంతాలు లేకుండా పెరగడం అంటే, ఈ బ్రహ్మాండం నిత్యం వ్యాపిస్తూ ఉంటుందనడానికి సంకేతం. బ్రహ్మ, విష్ణువులు కొన్ని కోట్ల సంవత్సరములు ప్రయాణం చేసినా, లింగం యొక్క ఆది, అంతాలను తెలుసుకోలేకపొవడం, ఈ బ్రహ్మాండాన్ని, విశ్వాన్ని దాటి వెళ్ళాలంటే కొన్ని కోట్ల కాంతి సంవత్సరములు పడుతుందని, అది సాధ్యం కాని విషయమని, ఈ బ్రహ్మాండం ఎంత మేర వ్యాపించి ఉన్నదో చెప్పడం కష్టమని తెలియజేయడమే. దీన్నే ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరించలేదా?

లింగపురాణం అంతరిక్షం గురించి, దాని వయసు గురించి ఏ విషయాలైతే స్పష్టం చేసిందో, సరిగ్గా అవే విషయాలను ఆధునిక శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.

ఇవన్నీ మన ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెందిన తరువాత చెప్తున్న విషయాలు కాదు, మన పురాణాలు ఏవైతే చెప్పాయి వాటినే చెప్పుకుంటున్నాం. ఒకప్పుడు మనవన్నీ పుక్కిటి పురాణాలు అని వెక్కిరించిన పాశ్చ్యాతులే ఈ రోజు ఇవన్నీ సత్యాలని అంగీకరిస్తున్నారు, కొత్త కనుగొన్నామని చంకలు గుద్దుకుంటున్నారు. అంతే. కానీ మనం మాత్రం ఇవన్నీ పాతకాలపు మాటలని పక్కనపడేస్తున్నాం.

ఓం నమః శివాయ

Originally published : 27-Feb-2014 (Mahasiva ratri)
Republished 1st time: 17-Feb-2015 (MahaSiva ratri)
శివలింగం దేనికి సంకేతం? Published:  18-Nov-2012
http://ecoganesha.blogspot.in/2012/11/blog-post_18.html

No comments:

Post a Comment