Thursday, 30 May 2024

శ్రీ గరుడ పురాణము (190)

 


గయాశిర తీర్ధంలో శ్రాద్ధమును పెట్టడాన్ని మించిన పుణ్యకర్మలేదేమో! ఎందుకంటే విత్త పరిపూర్ణ సమస్త పృథ్విని మూడుమార్లు దానం చేస్తే వచ్చే పుణ్యం ఈ శ్రాద్ధకర్మ వల్ల లభిస్తుంది. ఇక్కడ శమీపత్ర పరిమాణంలో పిండాలను తయారుచేసి పెట్టాలి. దాని వల్ల పితృగణాల వారు దేవగణాల వారై పోతారు. ఈ విషయంలో ఎటువంటి అనుమానమూ అవసరం లేదు.


త్రిర్వేత్తపూర్ణ పృథివీం దత్త్వా యత్ ఫలమాప్నుయాత్ । 

సతత్ఫల మవాప్నోతి కృత్వాశ్రాద్ధం గయా శిరే ॥ 

శమీపత్ర ప్రమానేన పిండం దద్యాడ్ గయాశరే ॥ 

పితరోయాంతి దేవత్వం నాత్ర కార్యా విచారణా


(ఆచార...84/26-28)


ముండపృష్ఠ తీర్ధంపై పరమేశ్వరుడు తన పాదాలను మోపి విశ్రమించాడు. అందుచేత ఈ తీర్థంలో స్వల్పమాత్రం చేసినా ఘన తపశ్శక్తి, అత్యధిక ఫలాలూ కలుగుతాయి.  


గయాశీర్ష తీర్థంలో పేరు పేరునా ఎవరెవరికైతే పిండాలు పెట్టబడతాయో వారిలో నరకంలో వున్నవారు స్వర్గానికి పోగా, స్వర్గంలో నున్నవారు మోక్షాన్ని పొందుతారు. 


ముండపృష్ఠే పదంన్యస్తం మహాదేవేన ధీమతా ॥ 

అల్పేన తపసాతత్ర మహాపుణ్యమవాప్నుయాత్ । 

గయాశీషేతుయః పిండాన్నామ్నా యేషాంతు నిర్వపేత్ ॥ 

నరకస్థా దివం యాంతి స్వర్ణస్థా మోక్షమాప్నుయుః (ఆచార... 84/28-30)


అయిదవ రోజు గదాలోల తీర్ధంలోస్నానం చేసి అక్కడి అక్షయపటం క్రింద పిండదానం చేసిన వారు తమ కుటుంబం సమస్తాన్నీ ఉద్దరించగలరు. అక్షయ వట మూలం వద్ద శాక, ఉష్ణోదక సహితమైన భోజనాన్ని పెడితే కోటిమంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలం లభిస్తుంది. ఆ తరువాత బ్రహ్మదేవుని పూజించి, దర్శించి అక్షయ లోకాలను పొందవచ్చు. ఈ మొత్తం కార్యక్రమాన్ని వేరే ఆలోచన లేకుండా భక్తిశ్రద్ధలతో గావించిన వారి నూరుతరాలు ఉద్దరింపబడతాయి.


ఏష్టవ్యా జపానః పుత్రాయ చ్యేకోఽ పి గయాంప్రజేత్ (ఆచార... 84/33)


Wednesday, 29 May 2024

శ్రీ గరుడ పురాణము (189)

 


ఇలా ప్రార్ధించి ఫల్గుతీర్థంలో పిండం పెట్టి పితామహుడైన బ్రహ్మదేవునీ, గదాధరుడైన మహావిష్ణువునీ దర్శించిన వానికి పితృణం పూర్తిగా తీరుతుంది. అలా చేసిన వ్యక్తి తరువాత ఫల్గు తీర్థంలో మరల స్నానం చేసి గదాధరుని దర్శనం చేసుకుంటే అతడు ఉద్దరింపబడుటే గాక తన తండ్రితో తనతో సహా ఆపై పదితరాల వారిని కూడా సముద్ధరించగలడు. తన తరువాతి పది తరాల వారిని కూడా ఉద్దరించగలడు.


భక్తుడు, సంప్రదాయ విధేయుడునైన మహావ్యక్తి గయాక్షేత్రాన్ని చేరుకున్నాక మొదటి రోజే చేయవలసినది పైన చెప్పబడింది.


ద్వితీయ దినం నాడు ధర్మారణ్యం చేరుకొని అక్కడి మతంగవాపిలో శ్రాద్ధకర్మం, పిండప్రదానం చేయాలి. ధర్మారణ్యంలోకి వెళ్లడం వల్ల మనుష్యునికి వాజపేయ యజ్ఞ ఫలమూ, ఆ తరువాత బ్రహ్మ తీర్థం వెళ్ళడం వల్ల రాజసూయ, అశ్వమేధ యజ్ఞాల ఫలాలూ దక్కుతాయి. తరువాత కూప, యూప నామక తీర్థాల మధ్య శ్రాద్ధ, పిండోదక కృత్యాలను గావించాలి. కూపోదకం ద్వారా చేసే శ్రాద్ధాది కార్యాలకు అక్షయ ఫలాలు లభిస్తాయి.


మూడవరోజు బ్రహ్మసద తీర్థానికి పోయి అక్కడస్నానం చేసి తర్పణాలిచ్చి వెంటనే యూప, కూప తీర్థాల మధ్య శ్రాద్ధాన్నీ పిండప్రదానాన్నీ చేయాలి. తరువాత గో ప్రచార తీర్థానికి పోవాలి. అక్కడ బ్రహ్మచేత కల్పింపబడిన బ్రాహ్మలుంటారు. వారిని పూజించి, సేవించినంత మాత్రాన ఆ మనుజుని పితృజనులు మోక్షాన్ని పొందుతారు. యూపతీర్ధానికి భక్తిగా ప్రదక్షిణ చేస్తే వాజపేయ యజ్ఞఫలం సిద్ధిస్తుంది.


నాలుగవ రోజు ఫల్గుతీర్థంలో స్నానం చేసి దేవతలకూ పితరులకు తర్పణాలిచ్చి గయాశీర్షానికి పోయి అక్కడి రుద్రపదాది తీర్థాలలో పితరులకు శ్రాద్ధాలు పెట్టాలి. ఆ తరువాత వ్యాస, దేహిముఖ, పంచాగ్ని, పదత్రయ నామక తీర్థాలలో పిండదానాలనిచ్చి, సూర్య, సోమ, కార్తికేయ తీర్థాలకు పోయి అక్కడ చేయు శ్రాద్ధ కర్మలకు అక్షయ ఫలాలుంటాయి.


నవదైవత్వ, ద్వాదశ దైవత్యములను పేర్లతో రెండు రకాల శ్రాద్ధాలున్నాయి. వీటిని గయలోనే పెట్టాలి. అన్వష్టక అనగా పుష్ప, మాఘ, ఫాల్గున మాసాల్లో నవమీ తిథినాడు, వృద్ధి చంద్ర నవమీ తిథులలోనూ లేదా తల్లి మృతి చెందిన తిథినాడు ఈ క్షేత్రంలో తల్లికి శ్రాద్ధకర్మను చేయవచ్చును. మిగతా చోట్ల తండ్రి కర్మతో కలిపే తల్లిది కూడా చేయాలి.


శ్రాద్ధంతు నవదైవత్వం మర్యాద్ ద్వాదశ దైవతం । 

అన్వష్టకాసు వృద్ధౌ చ గయా యాం మృతవాసరే || 

అత్ర మాతు: పృథక్ శ్రాద్ధ మన్యత్ర పతినా సహ ! (ఆచార... 84/24,25)


దశాశ్వమేధ తీర్ధంలో స్నానం చేసి బ్రహ్మదేవుని దర్శనం చేసుకొని రుద్రపాదాలను స్పృశించిన వానికి పునర్జన్మ వుండదు.


Tuesday, 28 May 2024

శ్రీ గరుడ పురాణము (188)

 


గయ, గయా శీర్ష మహిమ విశాలుని కథ


వ్యాసునికి బ్రహ్మదేవుడు చెప్పిన దానిని సూతమహర్షి నైమిషారణ్యంలో శౌనకాది మహామునులకు ఇలా చెప్పసాగాడు.


"మహామునులారా! గయకు బయలుదేరదలచుకున్న వ్యక్తి ముందుగా తన గ్రామంలో శ్రాద్ధకర్మను గావించి సన్యాసి వేషాన్ని ధరించి గ్రామానికి ప్రదక్షిణచేయాలి. తరువాత పొరుగు గ్రామంలో కూడా సన్యాసిగానే తిరిగి శ్రాద్ధ ప్రసాదాన్ని మాత్రమే భుజించాలి. గయాక్షేత్రానికి వెళుతున్నారు కదా అని ఎవరైనా ఎటువంటి దానాన్నిచ్చినా పుచ్చుకోరాదు. గయ వైపు యాత్రికుడు వేసే అడుగూ వాని పితరుల స్వర్గారోహణకు మెట్టుగా ఉపయోగపడుతుంది.


గృహాచ్చలిత మాత్రస్య గయాయాం గమనం ప్రతి |

స్వర్గారోహణ సోపానం పితృణాంతు పదే పదే || (ఆచార ...84/3)


కురుక్షేత్రం, విశాల (బదరీక్షేత్రం), విరజా (జగన్నాథక్షేత్రం), గయాక్షేత్రాలలో తప్ప మిగతా అన్ని క్షేత్రాలలోనూ శిరోముండనం, ఉపవాస నియమాలు ఉంటాయి. 


గయలో కనఖల నామక త్రైలోక్య ప్రసిద్ధి గాంచిన తీర్థమొకటుంది. ఇక్కడికి దేవతలు, మహర్షులు, సిద్ధులు వచ్చి సేవించుకుంటారు. మనసులోగాని స్వీయజీవిత చరిత్రలో గాని పాపమున్నవారు ఇక్కడ వుండలేరు. ఎందుకంటే పరమ విపరీత భయోత్పాదకములై నాలుకలతో విషాగ్నిని వర్షించే మహాసర్పాలిక్కడ నిత్యమూ తిరుగుతుంటాయి. అవి పాపాత్ములను రానీయవు.


ఉదీచి తీర్థంలో దేవర్షి సేవితమైన ముండపృష్ఠ తీర్థముంది. అక్కడ స్నానం చేసిన వారికి స్వర్గ ప్రాప్తి ఉంటుంది. అక్కడ పెట్టబడే శ్రాద్ధం అక్షయఫలాలనిస్తుంది. అక్కడ సూర్యదేవునికి నమస్కరించి పిండదానాది సత్క్రియలను చేయాలి.


మన పితృగణాలు, కవ్యవాహ, సోమ, యమ, అర్యమ, అగ్నిష్వాత్త, బర్హిషత్, సోమప నామధేయులు. శ్రాద్ధం ఏ పేరిట పెట్టినా ఈ దేవతలందరినీ పేరు పేరునా ఇలా ప్రార్థించాలి.


కవ్యవాహస్తథా సోమో యమశ్చై వార్యమాతథా ! 

అగ్నిష్వాత్తా బర్హిషదః సోమపాః పితృదేవతాః ॥ 

ఆగచ్ఛంతు మహాభాగా యుష్మాభిరక్షితా స్త్విహ । 

మదీయాః పితరోయే చకులే జాతాః సనాభయః ॥ 

తేషాం పిండ ప్రదానార్థమాగతో స్మి గయా మిమాం | (ఆచార 84/12-14)


Monday, 27 May 2024

శ్రీ గరుడ పురాణము (187)

 


ఒక వ్యక్తి తన జాతికి చెందిన ఎంతమంది పితరులకైనా బంధుబాంధవులకైనా, మిత్రులకైనా గయాభూమిలో విధిపూర్వకంగా పిండప్రదానాలను చేయవచ్చును.


ఇక్కడి రామతీర్థంలో స్నానం చేసిన మనుష్యునికి నూరుగోదానాల ఫలం దక్కుతుంది. మతంగ వాపిలో స్నానం చేస్తే సహస్ర గోదానాల ఫలం దక్కుతుంది. నిశ్చిరా సంగమంలో స్నానం చేసినవాడు తన పితరులను బ్రహ్మలోకానికి గొనిపోగలడు. వసిష్ఠాశ్రమంలో స్నానం చేసిన వానికి వాజపేయ యజ్ఞఫలం లభిస్తుంది. మహాకౌశికీ తీర్థంలో నివాసముంటే అశ్వమేధ యజ్ఞ ఫలం దక్కుతుంది.


బ్రహ్మ సరోవరానికి దగ్గర్లోనే అగ్నిధారానది ప్రవహిస్తోంది. ఈ ప్రసిద్ధ నది మొత్తం ప్రపంచాన్నే పవిత్రీకరించగలదు. దీనికి కపిలయని మరో పేరు కూడా వుంది. ఇక్కడ స్నానం చేసి, పితరులకు శ్రాద్ధ కర్మలు నిర్వర్తించినవానికి అగ్నిష్టోమయజ్ఞ ఫలం లభిస్తుంది.


కుమారధారలో శ్రాద్ధకర్మ చేసిన వానికి అశ్వమేధయాగ ఫలం దక్కుతుంది. అక్కడ వెలసిన కుమారదేవుని దర్శించి, పూజించి, ప్రణామ నివేదనలు చేసిన వారికి మోక్షం లభిస్తుంది.


సోమకుండ తీర్థంలోస్నానం చేస్తే సోమలోక నివాసం అబ్బుతుంది. సంవర్త వాపియను తీర్థంలో స్నానమాచరించి పిండదానాలు చేసినవారు సర్వసౌభాగ్య ప్రాప్తి నొందుతారు.


ప్రేతకుండ తీర్థంలో పిండప్రదానం చేసిన వారికి అన్ని పాపాల నుండీ విముక్తి కలుగుతుంది. దేవనది, లేలహాన, మథన, జానుగర్త కాది ఇతర గయాంతర్గత తీర్థాలలో పిండ ప్రదానం కూడ పితరులను ప్రీతులను చేస్తుంది. అలాగే ఇక్కడి వసిష్ఠశ్వరాది దేవతలను శాస్త్రోక్తంగా పూజించి ప్రణామం చేసిన ప్రాణుల ఋణాలన్నీ తీరిపోతాయి."


(అధ్యాయాలు 82,83)


Sunday, 26 May 2024

శ్రీ గరుడ పురాణము (186)

 


స్వంతపుత్రులూ, పిండాధికృతులైన వారే కాక అన్య వంశజులు కూడా మృతుల నామ గోత్రాలను చదివి శ్రాద్ధకర్మలను చేయవచ్చును. గయలోని గయాకూపమను పేరు గల పవిత్ర తీర్థంలో ఎవరి పేరిట పిండప్రదానము చేస్తే వారికే అందడమే గాక వారికి శాశ్వత బ్రహ్మగతిని కూడా ప్రాప్తింపజేస్తుంది.


ఆత్మజోవా తథాన్యోవా గయాకూపే |

యదాతదా |

యన్నామ్నా పాతయేత్ పిండం తం

నయేద్ బ్రహ్మ శాశ్వతం ||


(ఆచర ... 83/61)


గయలోని కోటితీర్థాన్ని దర్శించిన వానికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ క్షేత్రంలోనే ముల్లోకాలలోనూ పేరున్న వైతరణి అను నది గలదు. అది గయలో పితరులకు ఉత్తమ గతులను కలిగించడానికే బ్రహ్మచే భూమిపై అవతరించబడింది. శ్రద్ధగా పిండ ప్రదానాన్నీ, గోదానాన్నీ ఇక్కడ చేసినవారు తమతో సహా తమ ఇరువది యొక్క తరాలను ఉద్ధరించగలరు.


యా సా వైతరణీనామ

త్రిషు లోకేషు విశ్రుతా ||

సావతీర్ణా గయా క్షేత్రే

పితృణాం తారణాయ హి |


(ఆచార... 83/62,63)


గయాతీర్థ యాత్రికులు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టదలచుకున్నపుడు అక్కడ ఒకప్పుడు బ్రహ్మయజ్ఞం చేసినపుడు ఋత్విక్కులుగా వరించిన బ్రాహ్మణులకే అనగా, ఆ సంతతి వారికే భోజనాలు పెట్టాలి. ఆ బ్రాహ్మణులు గయలో బ్రహ్మపద, సోమపానక తీర్థాలలో వుంటారు. ఆ తీర్థాలు బ్రహ్మదేవునిచే నిర్మింపబడినవి. ఈ బ్రాహ్మణులను పూజిస్తే పితరులు స్వయంగా తామే పూజింపబడినట్లుగా భావించి తృప్తులౌతారు.


గయా తీర్థంలో హవ్యకవ్యాది పక్వాన్నాల ద్వారా అక్కడి బ్రాహ్మణులను విధ్యుక్తంగా సంతుష్టపఱచాలి. గయలో వృషోత్సర్గం (ఎద్దును స్వేచ్ఛగా వదలివేయుట) చేసిన వారికి నూరు అగ్నిష్టోమయజ్ఞాలు చేసిన ఫలం దక్కుతుంది. ఇక్కడ స్వపిండం వేసుకోవచ్చు. అది తిలరహితంగా వుండాలి. అన్యులకూ వేయవచ్చును.


ఆత్మనోఽపి మహాబుద్ధిర్గయాయాంతు తిలైర్వినా । 

పిండ నిర్వాపణం కుర్యాదన్వేషామపి మానవః ॥


(ఆచార ... 83/69)


Saturday, 25 May 2024

శ్రీ గరుడ పురాణము (185)

 


క్రౌంచపద తీర్థానికి ఉత్తరంలో నిశ్చిరా నామంతో ప్రసిద్ధమైన జలాశయముంది. అక్కడికి వెళ్ళి పిండ ప్రదానం ఒక్కమారు చేసిన వానికి జీవితంలో ఒక దుర్లభమైనదేదీ ఇక వుండదు. ఇక నిత్య నివాసం చేస్తూ అక్కడే వుండే వారెంత పుణ్యశాలులో కదా!


మహానది నీటిని స్పృశిస్తూ పితృదేవతలకి తర్పణాలిచ్చిన వానికి అక్షయలోకాల ప్రాప్తి కలుగుతుంది; కుటుంబమూ ఉద్దరింపబడుతుంది. ఇక సావిత్రి తీర్థంలో ఒకమారు సంధ్యావందనం చేసినవానికి పన్నెండేళ్లు సంధ్యవార్చిన పుణ్యం దక్కుతుంది.

ఒక మాసం అనగా రెండు పక్షాలూ పూర్తిగా గయలో నివసించి పితృకార్యాలను సంపన్నంచేయువాడు తప్పక తనతో బాటు ఏడుతరాల వారినుద్ధరించగలడు. ఇక్కడి ముండపృష్ఠ, అరవిందపర్వత, క్రౌంచపాద తీర్థాలను సేవించిన వారి పాపాలన్నీ నశిస్తాయి.


గ్రహణాలలోనూ మకర సంక్రాంతినాడూ గయలో వుండి పిండప్రదానం చేస్తే వచ్చే ఫలితం ఎంత గొప్పదంటే దానిని మూడు లోకాల్లోనూ ఎవరూ ఎప్పుడూ పొంది వుండరు. అది అతి దుర్లభం.


మహాహ్రదం, కౌశికీ తీర్థం, మూలక్షేత్రం, గృధ్రకూట పర్వత గుహ - ఈ నాలుగు చోట్లా శ్రాద్ధ కర్మ చేసిన వారికి మహా ఫలాలబ్బుతాయి.


గయలోని మాహేశ్వరీలో మహేశ్వరుడైన శివుని యొక్క జటాజూటము నుండి బయలుదేరిన గంగ యొక్క ధార వచ్చి ప్రవహిస్తుంటుంది. ఆ పరమ పవిత్ర మాహేశ్వరీ ధార ప్రవహించే తీర్థంలో పితృకర్మ చేసినవారు ఋణ విముక్తులౌతారు. (విశాల గూర్చి తదుపరి అధ్యాయంలో వుంటుంది)


గయ వెళ్ళి తమకి పిండంపెడతాడనే ఆశయే మానవులను పుత్రసంతానం కోసం, అవసరమైతే యజ్ఞాలైనా చేసి, ప్రయత్నించేలా చేస్తుంది. గయకి వచ్చిన పుత్రుల వైపు లేదా పిండాధికారులవైపు పితరులు గొప్పగా మురిసి చూస్తుంటారు. 'ఇక మనకి నరకభయం లేద'నే ధీమా వారి మనసంతటా నిండి వుంటుంది.


గయాప్రాప్తం సుతందృష్ట్యా పితౄణా ముత్యవోభవేత్ |

పద్భ్యామపి జలం స్పృష్ట్వా అస్మభ్యం కిల దాస్యతి || 


(ఆచార ... 83/60)


Friday, 24 May 2024

శ్రీ గరుడ పురాణము (191)

 


ఒకనాడు గయాక్షేత్రానికి దగ్గరలో విశాలుడనే వణిజునికి ఒక ప్రేతం కనిపించి, 'ఓ వణిజుడా! నీవు గయాశీర్ష తీర్ధంలో నా పేరిట పిండదానాన్ని చేసి పెట్టు. నేను ఈ ప్రేత యోని నుండి విముక్తుడనౌతాను. ఈ పుణ్యానికి ఫలంగా నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది' అని చెప్పగా అతడలాగే చేశాడు. తరువాత విశాలుడు తన తమ్ములతో కలసి గయ అంతా కలయతిరిగి తన పితరులకు పిండప్రదానాలు చేయగా వారంతా, ప్రేతంతో సహా ముక్తులైనారు. గయ నుండి తన వూరికి వచ్చాక విశాలుడు పుత్రవంతుడై సుఖంగా జీవనం, అనాయాసంగా మరణం పొంది స్వర్గానికి చేరుకొని మరల పుడమిపై పుట్టినపుడు విశాలదేశానికి రాజపుత్రునిగా జన్మించాడు. అతడు పెరిగి పెద్దవాడై తన ఆస్థాన బ్రాహ్మణులకు 'ఏయే సత్కార్యాలు చేస్తే మంచి పుత్ర సంతానమూ, సుఖజీవనమూ లభిస్తాయి?" అని అడిగాడు. వారు 'విశాల రాకుమారా! గయాతీర్థంలో పిండ ప్రదానం చేస్తే అన్ని కోరికలూ తీరుతాయి' అని చెప్పారు.


విశాలుడు వెంటనే గయాక్షేత్రాన్ని సంపూర్ణంగా దర్శించి శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు గావించి వచ్చాడు. శీఘ్రమే పుత్రవంతుడైనాడు. ఒకరోజు అతనికి ఆకాశంలో ముగ్గురు పురుషులు దర్శనమిచ్చారు. అతడు వారికి సమస్కరించి 'మహాపురుషులారా! మీరెవరు?' అని అడిగాడు.


వారిలో శ్వేతవర్ణంలో నున్న పురుషుడు' నాయనా విశాలా?నేను నీ తండ్రిని నీ పుణ్యం వల్ల నేను స్వర్గానికి వెళుతున్నాను. ఈ రక్తవర్ణ పురుషుడు నా తండ్రి. ఈయన బ్రహ్మహత్యను చేసి అవీచి నామక నరకంలో పడ్డాడు. ఆ శ్యామల వర్ణంలో నున్నవాడు నా తాత. ఆయన ఒక మహర్షిని చంపి అదే నరకంలో పడ్డాడు. నీవు గయా శీర్షతీర్ధంలో చేసిన పిండప్రదానం వల్ల నేను ప్రేత రూపం నుండీ, వారు నరకకూపం నుండీ విముక్తులపై స్వర్గానికి వెళుతున్నాము. నీకు శుభమగు గాక అని చెప్పి ఇతరులతోపాటు అంతర్జానం చెందాడు.


విశాలుడు సమర్ధవంతంగా రాజ్య పాలనం చేసి సుఖంగా జీవించి దేహాంతంలో స్వర్గలోకాన్ని చేరుకున్నాడు.


గయాతీర్థంలో పిండప్రదానం చేసినప్పుడు ఈ క్రింది మంత్రాలను చదవాలి.


యేఽ స్మత్కు లే తు పితరో లుప్తపించోచక క్రియాః ॥ 

యే చాప్యకృత చూడాస్తు యేచ గర్భాద్విని స్మృతాః | 

యేషాం దాహో న క్రియా చ యేఽ గ్నిదగా స్తథా పరే ||

భూమౌ దత్తేన తృప్యంతు తృప్తా యాంతు పరాంగతిం |

మాతా పితామహశ్చైన తధైన ప్రపితామహః ॥ 

మాతా పితామహీ చైన తధైవ ప్రసితా మహీ । 

తథామాతా మహశ్చైవ ప్రమాతా మహ ఏవచ ॥ 

వృద్ధ ప్రమాతా మహశ్చ తథా మాతా మహీపరం | 

ప్రమాతామహీ తథా వృద్ధా ప్రమాతా మహీతివై ॥ 

అన్యేషాం చైవ పిండోఽయ మక్షయ్య ముపతిష్ఠతాం (ఆచార... 84/43-47)


'మా వంశంలో సరైన సంస్కారాలు జరగకముందే మరణించిన వారికి, మరణానంతర సంస్కారాలు సరిగా జరగని వారికి, నా తండ్రికి ఆయన పితరులైన స్త్రీ పురుషులకి, నా తల్లికి ఆమె పితరులైన స్త్రీ పురుషులకి ఈ నా గయా క్షేత్ర కృత పిండప్రదానాలు అక్షయాలై అందాలి గాక! వారంతా తృప్తులై ముక్తి చెందాలి గాక' అని దీని భావము


(అధ్యాయం - 84)


Thursday, 23 May 2024

శ్రీ గరుడ పురాణము (184)

 


గయాక్షేత్రంలో తీర్థంకాని చోటులేదు. అక్షయ ఫలాలూ బ్రహ్మలోక ప్రాప్తి అడుగడుగునా లభింపజేసే పుణ్యస్థాన సముదాయం గయ.


గయాయాం నహి తత్ స్థానం

యత్ర తీర్థం న విద్యతే |

పంచక్రోశో గయాక్షేత్రే

యత్ర తత్ర తు పిండదః ॥

అక్షయం ఫల మాప్నోతి

బ్రహ్మ లోకం నయేత్ పితౄన్ |


(ఆచార...83/39,40)


స్వపిండాన్ని జనార్దనుని చేతిలో పెడుతూ ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి.


ఏషపిండో మయా దత్త స్తవ హస్తే జనార్దన |

పరలోకం గతే మోక్షమక్షయ్యముపతిష్ఠతాం ॥


(ఆచార...83/41)


గయాక్షేత్రంలో నెలకొనియున్న ధర్మపృష్ఠ, బ్రహ్మసర, గయాశీర్ష, అక్షయ వట తీర్థాలలో పితరుల కోసం చేసే కర్మలన్నీ అక్షయ ఫలదాయకాలవుతాయి. ధర్మారణ్య, ధర్మపృష్ఠ, ధేనుకారణ్య తీర్థాలను దర్శించిన వ్యక్తి తన ఇరవై తరాలను ఉద్ధరించగలడు.


ఇక్కడి మహానది యొక్క పశ్చిమభాగాన్ని బ్రహ్మారణ్యమంటారు. దానికి తూర్పులో బ్రహ్మసనం, నాగాద్రి పర్వతం, భరతాశ్రమం వున్నాయి. భరతాశ్రమంలోనూ, మతంగ పర్వతం పైనా పితృకర్మలను చేయాలి.


గయాశీర్ష తీర్థానికి దక్షిణంలోనూ మహానదీ తీర్ధానికి పశ్చిమంగానూ చంపక వనమొకటుంది. అందులో పాండుశిలయను తీర్థముంది. ఆ తీర్థంలో తదియనాడు పెట్టే శ్రాద్ధం పరమప్రశస్తం. ఆ తీర్థానికి దగ్గర్లో నిశ్చిరా మండల, మహాహ్రద, కౌశికీ ఆశ్రమాలున్నాయి. ఈ పవిత్ర తీర్థాల్లో చేయబడు శ్రాద్ధకర్మలు అక్షయఫలితాలనిస్తాయి.


వైతరణీ నదికి ఉత్తరంలో తృతీయా అను పేరుగల జలాశయమొకటుంది. అక్కడే క్రౌంచపక్షులు నివసిస్తాయి. ఇక్కడ శ్రాద్ధం పెట్టేవానికీ, పితరులకూ స్వర్గం లభిస్తుంది.


Wednesday, 22 May 2024

శ్రీ గరుడ పురాణము (183)

 


దీనికుత్తరాన కనకానది పారుతోంది. దాని మధ్య భాగంలో నున్న నాభి తీర్ధానికి దగ్గరగా బ్రహ్మ సదస్తీర్థం నెలకొనివుంది. అది తనలో భక్తిశ్రద్ధలతో స్నానం చేసిన వారిని బ్రహ్మలోకానికి పంపగలదు. ఆ ప్రాంతంలోనే గల హంస తీర్థస్నానం సర్వపాప వినాశకరం. కోటి తీర్థం, గయాలోలం, వైతరణి ఇంకా గోమక తీర్ధం ఈ తీర్థాలలో పితరులకు తర్పణాలిచ్చి శ్రాద్ధాలు పెట్టినవాడు తనతో బాటు తన ఇరువది యొక్క తరాల వారికి బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించగలడు. బ్రహ్మ తీర్థ, రామతీర్థ, అగ్నితీర్థ (సోమతీర్థ) రామహ్రాదినీ తీర్థాలలో శ్రాద్ధం పెట్టిన వాని పితరులు బ్రహ్మ లోకానికి వెళతారు. ఉత్తరమానసీ తీర్థంలో శ్రాద్ధ కర్మలు చేసిన వారికి పునర్జన్మ వుండదు. దక్షిణ మానసీ తీర్థం బ్రహ్మలోకప్రదాయకం. స్వర్గ ద్వారా తీర్థమూ అంతే. భీష్మ పర్వతంపై శ్రాద్ధ కర్మలను పొందినవారు నరకాన్ని సులభంగా దాటిపోతారు. గృద్ధేశ్వర తీర్థమునందు పెట్టబడు శ్రాద్ధం పితౄణ ముక్తిదం. 


ధేనుకారణ్యంలో శ్రాద్ధం పెట్టి తిలధేనువును దానం చేసి మరల స్నానమాచరించి అక్కడ వెలసిన ధేనుమూర్తిని దర్శించినవాడు నిస్సందేహంగా తన పితృజనులను బ్రహ్మలోకానికి చేర్చగలడు. ఇంద్ర, వాసవ, రామ, వైష్ణవ, మహానదీ తీర్థాలలో శ్రాద్ధానికీ అదే ఫలము. సూర్యోత్పన్న శక్తులైన గాయత్రి, సావిత్రి, సరస్వతుల పేరిట వెలసిన తీర్థాలలో స్నానాలు, తర్పణాలు, శ్రాద్ధకర్మలు, సంధ్యావందనాలు చేసినవాడు తన నూటొక్క తరాల పితరులను బ్రహ్మ లోకానికి గొనిపోగలడు.


ఇక్కడి బ్రహ్మ యోని తీర్థం మిక్కిలి ప్రత్యేకత గలది. ప్రశాంతమనస్కులై పితరులనే ఏకాగ్రచిత్తంతో ధ్యానిస్తూ ఈ తీర్థాన్ని నియమానుసారం దాటి పితృగణాలకూ దేవతలకూ తర్పణలిచ్చిన వారికి పునర్జన్మ వుండదు.


కాకజంఘా తీర్థంలో తర్పణలందుకొన్న పితరులకు అక్షయ తృప్తి కలుగుతుంది. ధర్మారణ్య, మతంగవాపీ తీర్థాలలో శ్రాద్ధాలు పెట్టిన మనుష్యునికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ధర్మకూప, కూపతీర్థాలలో చేసే కర్మలకు పితౄణ విముక్తి కలుగుతుంది. ఇక్కడి శ్రాద్ధాది కృత్యాలను ఈ మంత్రం చదువుతూ చేయాలి.


ప్రమాణం దేవతాః సంతు లోక పాలశ్చసాక్షిణః ।

మయాగత్య మతంగేఽస్మిన్ పితృణాం నిష్కృతిః కృతా ॥ (ఆచార...83/36)


రామతీర్థంలో స్నానం చేసి ప్రభాస, ప్రేతశిలా తీర్థాలలో శ్రాద్ధకార్యాలు చేసిన వాని పితరులు పరమానందభరితులౌతారు. దీని వల్ల వాని నుండి ఇరువది యొక్క తరాలు ఉద్దరింపబడతాయి. అలాగే ముండపృష్ఠాది తీర్థాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని గావించినవారికి బ్రహ్మలోకమునకు తమ పితరులను గొనిపోయే శక్తి కలుగుతుంది.


Tuesday, 21 May 2024

శ్రీ గరుడ పురాణము (182)

 


గయలో నొక పర్వతంపై పరమశివుడు వెలసియున్నాడు. ఆయనను దర్శించిన వారికి పితౄణ (పితృఋణ అనే మాట సరి కాదు) విముక్తి లభిస్తుంది. అక్కడి ధర్మారణ్యంలో కొలువు తీరిన యమధర్మరాజును దర్శిస్తే అన్ని ఋణాలూ తీరిపోతాయి. అలాగే గృద్ధేశ్వర మహాదేవుని దర్శించినవారికి అన్ని బంధనాలూ తొలగిపోతాయి.


ధేనువనం (గోప్రచార తీర్థం) అను పేరుగల మహా తీర్థంలో ధేను దర్శనం చేసిన వారి పితరులకు స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. ప్రభాస తీర్థంలో ప్రభాసేశ్వర నామంతో వేంచేసి యున్న పరమశివుని దర్శించినవారు పరమగతిని పొందగలరు. కోటీశ్వర, అశ్వమేధ తీర్థాలను దర్శించినవారికి ఋణాలన్నీ తీరిపోతాయి. అలాగే స్వర్గద్వారేశ్వర దర్శనం సర్వబంధ విముక్తకం.


ఇక్కడి ధర్మారణ్యంలో నున్న గదాలోల తీర్థాన్నీ అక్కడ కొలువున్న రామేశ్వర స్వామినీ దర్శించిన వారికి స్వర్గప్రాప్తి వుంటుంది. ప్రక్కనే కొలువైన బ్రహ్మేశ్వర స్వామిని సేవించిన వారికి బ్రహ్మహత్యాపాతకం నుండి విముక్తి లభిస్తుంది.


గయలోనే ముండపృష్ఠ తీర్థంలో వెలసిన మహాచండీదేవిని దర్శించిన వారి అన్ని వాంఛలూ నెరవేరుతాయి.


ఫల్గు తీర్థంలో ఫల్గు స్వామి, చండి, గౌరి, మంగళ, గోమక, గోపతి, అంగారేశ్వర, సిద్దేశ్వర, గజస్వామి, గయాదిత్య, మార్కండేయేశ్వర భగవానులు వెలసియున్నారు. వీరి దర్శనం పితౄణ భంజకం. అలాగే ఫల్గుతీర్థంలో స్నానం చేసి అక్కడున్న గదాధర స్వామిని దర్శించినవారు పితరుల ఋణం నుండి విడివడతారు. భూమిపై నున్న అన్ని తీర్ధాలూ సముద్రాలూ, సరోవరాలూ ప్రతిదినమూ వచ్చి ఫల్గు తీర్థాన్ని దర్శించి వెళతాయి. మొత్తం భూలోకంలో గయ, గయలో గయాశిరం, ఆ శిరంలో ఫల్గు తీర్థం శ్రేష్ఠ భాగాలు. 


పృథివ్యాంయాని తీర్థాని యే సముద్రాః సరాంసిచ |

ఫల్గు తీర్థం గమిష్యంతి వారమేకందినే దినే ॥ 

పృథివ్యాం చ గయా పుణ్యాగయాయాంచ గయాశిరః ।

శ్రేష్ఠం తథా ఫల్గు తీర్థం తన్ముఖంచ సురస్య హి ॥


(ఆచార...83/22,23)


Monday, 20 May 2024

శ్రీ గరుడ పురాణము (181)

 


గయలో పిండ ప్రదానం ద్వారా కలిగే సత్ఫలితాలు వందకోట్ల సంవత్సరాలు చెప్పినా తరగవు.


కీకటదేశంలో గయ పుణ్యశాలి. అలాగే వనాల్లో రాజగృహం, భూములలో నదీజలాలతో తడిసేనీ పరమశ్రేష్ఠాలు.


గయకు తూర్పున ముండపృష్ఠ తీర్థమున్నది. అది నలుదిక్కులూ విస్తరించియున్నది. దాని విస్తృతి ఒకటిన్నర కోసులు. (ప్రస్తుత భాషలో నాలుగున్నర కిలోమీటర్లు. గయాక్షేత్ర పరిమాణం అయిదు కోసులు) గయాశిరం ఒక కోసు పరిమాణంలో వున్నాయి. ఇక్కడ పిండ దానం చేసిన వాని పితరులు శాశ్వత తృప్తి నొందుతారు.


పంచక్రోశం గయాక్షేత్రం క్రోశమేకం గయాశిరః | 

తత్రపిండ ప్రదానేన తృప్తిర్భవతి శాశ్వతీ ॥


(ఆచార... 83/3)


విష్ణు పర్వతం నుండి ఉత్తరమానసం దాకా గల భాగాన్ని గయా శిరమంటారు. దానినే ఫల్గు తీర్థమనీ వ్యవహరిస్తారు. ఇక్కడ పిండ ప్రదానం పొందిన పితరులకు పరమగతి ప్రాప్తిస్తుంది. గయకి వచ్చినంతనే వ్యక్తి పితౄణముక్తుడవుతాడు.


గయాగమన మాత్రేణ

పితౄణా మనృణో భవేత్ ||


(ఆచార...83/5)


ఈ పవిత్ర క్షేత్రంలో సాక్షాన్మహావిష్ణువే పితృదేవతల రూపంలో విహరిస్తుంటాడు. పుండరీకాక్షుడు, జనార్దనుడునైన ఆ భగవన్మూర్తిని దర్శించినంతనే వ్యక్తులు ఋణత్రయ (దేవ, భూత, ఋషి) విముక్తులౌతారు. గయ సింహద్వారానికి నమస్కరించినా, రుద్ర కాళేశ్వర, కేదారనాథులను సందర్శించినా మనిషి భూత, అతిథి ఋణ విముక్తుడవుతాడు.


అక్కడ పితామహుడైన బ్రహ్మని దర్శిస్తే పాపవిముక్తీ, ప్రపితామహుని దర్శిస్తే (* దర్శించడమనగా శ్రాద్ధకర్మ చేయుటయే) అనామయలోక ప్రాప్తి కలుగుతాయి. అలాగే గదాధరుడైన విష్ణుమూర్తికి ప్రణామం చేస్తే పునర్జన్మ లేకుండా మోక్షమే ప్రాప్తిస్తుంది.


అక్కడి మౌనాదిత్య, కనకార్క మహాత్ములను దర్శించి బ్రహ్మను పూజించిన వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. మౌనధారణ ఇక్కడి పూజా నియమాలలో నొకటి.


ఇక్కడ ప్రాతఃకాలమే లేచి స్నానాదికములను ముగించి సూర్యునిలో గాయత్రిని దర్శించి విధివిధానాలతో పూర్వసంధ్యను సంపన్నం చేసిన వారికి అన్ని వేదాలనూ చదివిన పుణ్యం లభిస్తుంది. అలాగే మధ్యాహ్నం సావిత్రిని, సంధ్యను పద్ధతి ప్రకారం ఉపాసించిన వారికి యజ్ఞం చేసిన ఫలం వస్తుంది. సాయంత్రం సూర్యశక్తి సరస్వతిని జపించి దర్శించి సంధ్య వార్చిన వారికి ఉత్తమ దానాలిచ్చిన పుణ్యం లభిస్తుంది.


Sunday, 19 May 2024

శ్రీ గరుడ పురాణము (180)

 


సాక్షాత్తూ బ్రహ్మదేవుడే ఈ గయాతీర్థం సర్వశ్రేష్ఠమనే జ్ఞానం కలిగి, ఇక్కడొక యజ్ఞం చేశాడు. దాని నిర్వహణలో తనకు సాయపడిన ఋత్విక్కులైన బ్రాహ్మణులను ఆయనే స్వయంగా పూజించాడు. అంతేకాక ఈ క్షేత్ర సందర్శకుల అవసరాలను తీర్చడానికి ఇక్కడ రసవతి యను తియ్యటి తేట నీటిని ప్రసాదించే నదినీ, లోతు దొరకని నూతినీ, మరిన్ని జలాశయాలను, భక్ష్య, భోజ్య, ఫలాదులనిచ్చే ప్రకృతినీ, మరొక కామధేనువునీ సృష్టించాడు. చివరగా తనచే పూజించబడిన విద్వద్ బ్రాహ్మణులకు అయిదు క్రోసుల వైశాల్యంలో వ్యాపించియున్న ఈ క్షేత్రాన్ని దానం చేసి వెళ్ళాడు. (అయిదు క్రోసులంటే నేటి లెక్కలో 15 కిలోమీటర్లు)


కాని ఆ బ్రాహ్మణులు అశ్రమగా వచ్చిన ధనాదుల వల్ల బద్దకస్తులై పోయి కర్మలను తగ్గించారు బ్రహ్మకు కోపం వచ్చి ఇలా శపించాడు, బ్రాహ్మణులారా! మీరు మీ కర్తవ్యాన్ని మఱచారు కాబట్టి ఇకపై ఇక్కడ కామధేనువుండదు. మీ నుండి మూడవతరం నాటికి మీ వైదిక పాండిత్యం, బ్రహ్మజ్ఞానం, ధనం ఇవేమీ మిగలవు. ఈ పర్వతాలు రాతి పర్వతాలుగానే మిగిలిపోతాయి; భక్ష్య భోజ్య ఫలదాయకాలు కాకుండా పోతాయి' అని శపించడంతో బ్రాహ్మణులు పశ్చాత్తప్తులై వేడుకోగా 'ఈ క్షేత్రంతోబాటు మీరూ అభివృద్ధి చెందుతారు. ఇక్కడి కర్మల వల్ల కర్తలకూ మీకూ కూడా శ్రద్ధాభక్తులు ప్రాతిపదికగా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఈ క్షేత్రం ముక్తి సాధనం అవుతుంది' అని దీవించాడు.


బ్రహ్మజ్ఞానం గయాశ్రాద్ధం 

గో గృహే మరణం తథా ! 

వాసః పుంసాం కురుక్షేత్రే 

ముక్తిరేషా చతుర్విధా ॥


(ఆచర 82/25)


సముద్రం నుండీ చిన్న చెలమ దాకా అన్ని తీర్థాలూ అదృశ్యం రూపంలో వచ్చి ఈ గయా క్షేత్రంలో స్నానం చేసి వెళతాయి. ఇక్కడ శ్రాద్ధకర్మలను ఆచరించేవారికి బ్రహ్మహత్య, సురాపానం, స్వర్ణచౌర్యం, గురుపత్నీగమనం, పాపాత్మ సాంగత్యం వంటి మహాపాతకాలన్నీ నశిస్తాయి.


బ్రహ్మహత్యా సురాపానం 

స్తేయం గుర్వాంగనాగమః | 

పాపం తత్సంగజం సర్వం

గయాశ్రాద్ధా ద్వినశ్యతి ||


(ఆచార 82/17)


మృత్యువు తరువాతి సంస్కారాలు సమంగా జరుగని వారికీ, పాముకాటు వలన మరణించినవారికీ, పశు, చోరాదుల ద్వారా బలవన్మరణం చెందినవారికీ సామాన్యంగానైతే ఉత్తమ గతులుండవు. కానీ వారి వారసులు వారికి గయలో శ్రాద్ధాది కర్మలు శాస్త్రోక్తంగా చేస్తే ఆ పుణ్యం వల్ల బంధన ముక్తి కలిగి స్వర్గం ప్రాప్తిస్తుంది.


Saturday, 18 May 2024

శ్రీ గరుడ పురాణము (179)

 


ఇదం తీర్థమిదంనేతి యేనరా భేదదర్శినః ।

తేషాం విధీయతే తీర్థగమనం తత్ఫలం చయత్ ॥

సర్వం బ్రహ్మేతియోవేత్తి నా తీర్థం తస్య కించన ॥

ఏతేషు స్నానదానాని శ్రాద్ధం పిండమథాక్షయం ॥

సర్వా నద్యః సర్వశైలాః తీర్థం దేవాది సేవితం |


(ఆచర 81/25-27)


భగవంతుడైన హరి నివసించే చోటు శ్రీరంగ పట్టణం. తాప్తి ఒక శ్రేష్ఠమహానది. సప్తగోదావరి, కోణ గిరియు మహాతీర్థాలే. కోణగిరి తీర్థంలో స్వయంగా శ్రీ మహాలక్ష్మియే నదీరూపంలో విరాజిల్లుతున్నది. సహ్యపర్వతంపై భగవానుడైన దేవదేవేశ్వరుడు ఏకవీర (ఏకవీరాదేవి వేరు) రూపంలోనూ మహాదేవి సురేశ్వరి రూపంలోనూ నివసిస్తున్నారు.


గంగాద్వారం, కుశావర్తం, వింధ్య పర్వతం, నీలగిరి, కనఖల ఈ పుణ్యతీర్థాలలో స్నానం చేసిన వారికి పునర్జన్మ వుండదు.


గంగాద్వారే కుశావర్తే వింధ్యకే నీలపర్వతే ॥

స్నాత్వా కనఖలే తీర్థే *సభవేన్న (సభవేత్ న) పునర్భవే ॥ (81/29,30)


శ్రీహరి ద్వారా తీర్థ మాహాత్మ్యాన్ని తెలుసుకొని వచ్చిన బ్రహ్మ దక్ష ప్రజాపతి, వ్యాసమునీంద్రాదులకు గయ క్షేత్రాన్ని గూర్చి ఇలా వినిపించాడు. (అధ్యాయం - 81)


గయా మాహాత్మ్యము - శ్రాద్ధాది కర్మల ఫలము


గయా మాహాత్మ్యాన్ని వింటే చాలు 'ఇక్కడ' భుక్తికీ 'అక్కడ' ముక్తికీ లోటుండదు. ఇది పరమ సారస్వరూపం.


పూర్వకాలంలో గయ నామకుడగు అసురుడొకడు ఆ ప్రాంతంలో దేవతలను దగ్ధం చేయడానికేమో అన్నట్లుగా ఘోరతపము నాచరించసాగాడు. లోకాలు ఆ వేడికి భగభగ మండిపోసాగాయి. దేవతలు విష్ణువునాశ్రయించగా ఆయన ఆ దానవుడు తపస్సులో లేని విరామ సమయంలో గదాధరుడై వచ్చి వానిని సంహరించాడు. ఆ గయాసురుని అద్భుత తపశ్శక్తి వల్ల అది గొప్ప పుణ్యక్షేత్రమై విలసిల్లింది. స్వయంగా శ్రీ మహావిష్ణువే గదాధారియై అక్కడ నివసిస్తూ అక్కడికేతెంచిన వారికి ముక్తిని ప్రసాదిస్తూ వుంటాడు. గయాసురుని విశుద్ధ దేహంలోనికి త్రిమూర్తులు ప్రవేశించి అతని జన్మనీ, అతని పేరిట తామే వెలయించిన గయనీ మరింత పవిత్రం చేశారు. 'ఈతని దేహమే ఈ పుణ్యక్షేత్ర రూపంలో వుంటుంది. ఇక్కడ భక్తి పురస్సరంగా స్నాన, యజ్ఞ, శ్రాద్ధ, పిండ దానాది కర్మలను చేయువారు నరకానికి వెళ్ళరు. పైగా స్వర్గం గాని బ్రహ్మలోకం గానీ చేరుకుంటారు' అని శ్రీ మహా విష్ణువు కట్టడి చేశాడు.


Friday, 17 May 2024

శ్రీ గరుడ పురాణము (178)

 


వారణాసి పరమతీర్థం. ఈ తీర్థంలో భగవంతులైన విశ్వనాథ, మాధవులు నిత్యం నివసించి వుంటారు. కురుక్షేత్రం కూడా గొప్పతీర్థం. ఇక్కడ దానాలు చేసినవారికి భోగమోక్షాలు రెండూ లభిస్తాయి. ప్రభాసం మరొక శ్రేష్ఠతీర్థం. ఇక్కడ భగవంతుడైన సోమనాథుడుంటాడు. ద్వారకాక్షేత్రమొక అత్యంత సుందరనగరం. ఇది భక్తిముక్తి ప్రదాయకం. తూర్పున నున్న సరస్వతీ తీర్థం సర్వపుణ్యదాయిని. ఇలాగే సప్తసారస్వతాలూ పరమతీర్థాలు.


కేదారతీర్థం సర్వపాప వినాశకం. సంభలగ్రామం మరొక ఉత్తమ తీర్థం. బదరికాశ్రమం భగవానులైన నరనారాయణుల తీర్థం, ముక్తిదాయకం.


శ్వేతద్వీపం, మాయాపురి (హరిద్వార్) నైమిషారణ్యం, పుష్కరం, అయోధ్య, చిత్రకూటం, గోమతి, వైనాయకం, రామగిర్యాశ్రమం, కాంచీపురి, తుంగభద్ర, శ్రీశైలం, సేతుబంధరామేశ్వరం, కార్తికేయం, భృగుతుంగం, కామతీర్థం, అమరకంటకం, మహా కాళేశ్వరం (ఉజ్జయిని) కుబ్జకం (శ్రీధరహరి నివాసం) కుబ్జామ్రకం, కాలసర్పి, కామదం, మహాకేశి, కావేరి, చంద్రభాగ, విపాశ, ఏకామ్ర, బ్రహ్మేశ, దేవకోటకం, మధుర, మహానది (శోణం) జంబూసర నామకములైన మహాతీర్థాలలో సూర్య, శివ, గణపతి, మహాలక్ష్మి హరి మున్నగు దేవతలు నివసిస్తారు. ఇక్కడ గావించబడు స్నాన, దాన, జప, తప, పూజ, శ్రాద్ధ, పిండదానాది కర్మలు అక్షయ ఫలితాలనిస్తాయి. ఇలాగే శాలగ్రామ, పాశుపత తీర్థాలు కూడా భక్తుల అన్ని కోరికలనూ తీర్చే పవిత్ర స్థలాలు.


కోకాముఖ, వారాహ, భాండీర, స్వామి తీర్థాలను మహా తీర్థాలంటారు. లోహదండ తీర్థంలో మహావిష్ణువు, మందార తీర్థంలో మధుసూదనుడు నివసిస్తారు.


కామరూప మరొక మహాతీర్థం. ఇక్కడ కామాఖ్యాదేవి నిత్యం నివాసముంటుంది. పుండ్రవర్ధన తీర్థంలో కార్తికేయుడు ప్రతిష్ఠింపబడియున్నాడు. విరజ, శ్రీ పురుషోత్తమ, మహేంద్రపర్వతం, కావేరి, గోదావరి, పయోష్టి, వరద, వింధ్య, నర్మదాభేద నామక మహాతీర్థాలు సర్వ పాపవినాశకాలు. గోకర్ణ, మాహిష్మతి, కలింజర, శుక్లతీర్థాలను కూడా మహాతీర్థాలుగానే సేవించాలి. ఇక్కడ స్నానం చేస్తే మోక్షం వస్తుంది. ఇక్కడ శంఖధారియైన హరి నివాసముంటాడు. స్వర్ణాక్ష మరొక ఉత్తమతీర్థం. ఇది భక్తులకు సర్వప్రదాయిని. నందితీర్థం ముక్తిదాయకం. కోటి తీర్థాల ఫలాన్ని ఇదొక్కటే ఇవ్వగలదు. నాసిక, గోవర్ధన తీర్థాలు గొప్పవి.


కృష్ణవేణి, భీమరథి, గండకి, ఇరావతి, విందుసర, విష్ణు పాదోదకాలు పరమతీర్థాలు. ఇవన్నీ పరమ పుణ్యదాయకాలు. బ్రహ్మధ్యానం, ఇంద్రియ నిగ్రహం మహాతీర్థాలు. దమ, భావశుద్ధులు శ్రేష్ఠతీర్థాలు. జ్ఞానరూప సరోవరంలో ధ్యానరూప జలంలో, ప్రతి నిత్యం ప్రతిక్షణం మానస స్నానం చేయగలిగే వారి అజ్ఞానమనెడి, రాగద్వేషాదులనెడి మలం పూర్తిగా కడుక్కుపోతుంది. ఎవరి మటుకు వారే ఈ మనస్తీర్థాలను, ఈ మానసిక క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాలి.


తీర్థయాత్రలు చేయడం బహు పుణ్యప్రదం, మానసికానందకరం. పుణ్యమనేది తీర్థయాత్రలు వల్లనే రావాలని లేదు. 'సర్వం బ్రహ్మమయం' అనే భావనను స్వీకరించి నిత్యం అదే భావనలో వుండే వారెక్కడుంటే అదే తీర్థం. వారున్న చోటనే స్నాన, దాన, శ్రాద్ధ పిండప్రదానాది కర్మలకు మహాక్షేత్రాల్లో, తీర్థాల్లో చేసిన ఫలమే వస్తుంది. అక్షయ ఫలం కూడా ప్రాప్తిస్తుంది. సమస్త పర్వతాలూ, నదులూ, దేవతలూ, ఋషులూ, మునులూ, సంతులూ వుండే చోట్లు సర్వాలూ తీర్థాలే.


Thursday, 16 May 2024

శ్రీ గరుడ పురాణము (177)

 


స్ఫటికరత్నం మనకు బలరాముడిచ్చిన వరం. ఈయన బలాసురుని మేధాభాగాన్నందు కొని కావేరి, వింధ్య, (నేటి చైనా), నేపాల ప్రాంతాల్లో ప్రయత్నపూర్వకంగా వెదజల్లాడు. ఆకాశ సమాన నీలవర్ణంలో తైల-స్పటిక అను పేరు గల రత్నాలు ఆయాప్రాంతాల్లో లభిస్తున్నాయి. ఇవి తెల్లకలువ, శంఖ వర్ణాల్లో వుంటాయి. ఈ ధవళ వర్ణమే కాక మరికొన్ని రంగుల్లో కూడా లభిస్తాయి. పాప వినాశనంలో ఈ మణికి సాటి లేదు. దీన్ని ధరిస్తే అన్ని పాపాలూ నశిస్తాయి. శిల్పకారులు దీనికి వెలకట్టగలరు.


విద్రుమమణి ఆదిశేషునిచే భూలోకానికి ప్రసాదింపబడింది. ఈయన బలాసురుని అంత్రభాగాన్ని గ్రహించి కేరళాది దేశాలలో వదిలాడు. ఈ మహాగుణ సంపన్నమైన విద్రుమ మణుల్లో కుందేలు రక్తం రంగులోనూ, గుంజాఫల లేదా జపాకుసుమ సదృశ ఎఱ్ఱటి వర్ణంలోనూ వున్నవి. శ్రేష్ఠతమాలుగా పరిగణింపబడుతున్నాయి. నీల, దేవక, రోమక దేశాలు ఈ మణులకు జన్మభూములు. అక్కడి విద్రుమమణులు చిక్కటి ఎరుపులో ప్రకాశిస్తుంటాయి. అన్యస్థానాల్లో కూడా విద్రుమాలు దొరుకుతున్నాయి గాని అవి ప్రశస్తాలు కావు. శిల్పకళలో విశేషమైన నేర్పు గలవారే వీటికి వెల కట్టగలరు. సుందరంగా, కోమలంగా, స్నిగ్ధంగా ఎఱ్ఱగా వుండే ఈ మణులను ధరించేవారికి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది; అంతేకాక విషాదిక దుఃఖాలు దూరమవుతాయి" ఈ విధంగా వివిధ రత్నాలకు సంబంధించిన జ్ఞానాన్ని విష్ణువూ, బ్రహ్మా మనకు ప్రసాదించారు. 


(అధ్యాయాలు 74-80)

గంగాది తీర్థాల మహిమ


సూతుడు శౌనకాది మహామునులకు గరుడ పురాణాన్ని ఇంకా ఇలా చెప్పసాగాడు.


"శౌనకాచార్యాదులారా! ఇపుడు మీకు మన సమస్త తీర్థాలనూ వాటి మహిమనూ వినిపిస్తాను. అన్ని తీర్థాలలోనూ ఉత్తమము గంగ. గంగానది సర్వత్రా సులభమైనా హరిద్వార, ప్రయాగ, గంగా సాగర సంగమాల్లో దుర్లభం.


సర్వత్రసులభాగంగా త్రిషుస్థానేషు దుర్లభా ॥

గంగాద్వారే ప్రయాగే చ గంగాసాగర సంగమే ।


(ఆచార... 81/1,2)


మరణించేవానికి ముక్తినీ, బతికున్నవానికి భుక్తినీ కూడా ప్రసాదించే ప్రయాగ పరమశ్రేష్ఠ తీర్థం. ఈ మహాతీర్థంలో స్నానం చేసి తమ పితరులకు పిండ ప్రదానం చేసేవారు తమ తమ పాపాలన్నీ పూర్తిగా నశింపగా సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు.


Wednesday, 15 May 2024

శ్రీ గరుడ పురాణము (176)

 


తమ కంఠంలో స్వర్ణసూత్రంలో ముడిపెట్టి ఈ విశుద్ధ భీష్మక మణిని ధరించినవారు సదా సుఖసమృద్ధితో సంపదల కలిమి కలుగగా జీవించగలరు. వీరు వనాలలో తిరుగుత్నుపుడు ఆ మణిని దూరం నుండే చూసి సింహ, వ్యాఘ్ర, శరభాది మహామృగాలూ, తోడేళ్ళవంటి హింస్రక జంతువులూ కూడా మరింత దూరం పారిపోతాయి. వారికి ఏ రకమైనా పీడా సోకదు; ఏ విధమైన భయమూ కలుగదు. మానవులు కూడా వారిని అపహాస్యం చేయడానికి గానీ నిందించడానికి గానీ జడుస్తారు.


ఈ భీష్మకమణినిపొదిగిన ఉంగరాన్ని ధరించి పితృకార్యం చేస్తే ఆ పితరులు కొన్నేళ్ళ దాకా గొప్ప సంతృప్తిని పొందుతారు. దీని ప్రభావం వల్ల సర్ప, వృశ్చికాదుల విషప్రభావం మణిధారి వంటికి ఎక్కదు. జల, శత్రు, చోర భయముండదు. నాచు మరియు మబ్బు రంగులోనుండి కఠోరమై, పచ్చటి కాంతులను వెదజల్లుతూ, మలినద్యుతినీ వికృతవర్ణాన్నీ కలిగియుండే భీష్మకమణిని దూరం నుండే చూసి మరింత దూరంగా తొలగిపోవాలి. అది అంత ప్రమాదకరం.


పులకమణి కూడా వాయుదేవుని చలవే. ఆయన బలాసురుని గోళ్ళ నుండి భుజాల దాకా గల శరీరాన్ని విధ్యుక్తంగా పూజించి శ్రేష్ఠ పర్వతాలలో, నదుల్లో, ఉత్తర దేశంలోని కొన్ని ప్రసిద్ధ స్థానాల్లో స్థాపితం చేశాడు. దశార్ణ, వాగదర, మేకల, కళింగాది దేశాల్లో ఈ ప్రకాశరూపియైన బీజం నుండి వచ్చిన పులకమణులు గుంజాఫల, అంజన, మధు, కమలనాళ వర్ణాలలో వుంటాయి. గంధర్వ, అగ్ని దేశాలలో పుట్టిన పులకమణులు అరటి పండు రంగులో వుంటాయి. ఈ వర్ణమణులన్నీ ప్రశస్తాలే. కొన్ని పులకమణులు విచిత్ర భంగిమలతో శంఖ, పద్మ, భ్రమర, సూర్య ఆకారాలలో వుంటాయి. వీటిని ఒక పద్ధతి ప్రకారం గుచ్చి మెడలో ధరిస్తే అసంఖ్యాకంగా సుఖాల్నీ, శుభాల్నీ కలుగజేస్తాయి. ఐశ్వర్యాభివృద్ధినీ ప్రాప్తింపజేస్తాయి. కొన్ని పులకమణులు మాత్రం మిక్కిలి భయంకరమైనవి. ముఖ్యంగా కాకి, గుఱ్ఱం, గాడిద, తోడేలు, రూపాలతో నున్నవి, మాంసంతో రక్తంతో నున్న గ్రద్ద ముఖ సమాన వర్ణంలో నున్నవి మృత్యుదాయకాలే. శ్రేష్ఠ, ప్రశస్త ఏకపల మాత్ర భారమున్న పులకమణి ధర అయిదువందల ముద్రలు పలుకుతుంది.


రుధిరాక్షరత్నం అగ్నిదేవుని అనుకంప (దయ) వల్ల మనకు దక్కింది. దానవరాజు బలాసురుని శరీరంలోని కొన్ని అంశాలను నర్మదానదీ తీర ప్రాంతంలోనూ మరికొన్ని అంశాలను దానికి దిగువ భూములలోనూ స్థాపించిన అగ్నిదేవుడే మనకు రుధిరాక్షరత్నం లభించడానికి కారకుడు. ఎఱ్ఱగా చిలకముక్కు రంగులోనూ, ఇంద్రగోప కీటవర్ణంలోనూ ఈ మణులు దొరుకుతున్నాయి. కొన్ని తెల్లగా నుండి మధ్య భాగంలో పాండుర వర్ణంతో అత్యంత విశుద్ధంగా వుంటాయి. ఆ రుధిరాక్షలు ఇంద్రనీలమణితో సమానమైన శక్తులను కలిగి వుంటాయి. ఈ రత్నాలను ధరించేవారికి అన్ని ఐశ్వర్యాలూ, భృత్యాది అభివృద్ధులూ అబ్బుతాయి. దీనిని పాకక్రియ ద్వారా శోధన చేస్తే దేవ వజ్రంలా మెరుస్తుంది.


Tuesday, 14 May 2024

శ్రీ గరుడ పురాణము (175)

 


ఇతర మణులు


(పుష్యరాగ, కర్కేతన, భీష్మక, పులక, రుధిరాక్ష, స్పటిక, విద్రుమ)


పుష్యరాగ (పుష్కరాగ) మణి బలాసురుని చర్మం హిమాలయ పర్వతంలో పడిన చోటినుండి ఉద్భవించింది. ఇది మహాగుణ సంపన్నం. సంపూర్ణ పీత, పాండుర వర్ణముల సుందరకాంతులను వెదజల్లు పుష్యరాగాన్నే పద్మరాగమణిగా వ్యవహరిస్తారు. అదే లోహిత, పీతవర్ణాల కాంతులను వెలారుస్తుంటే 'కౌకంటక'మని వ్యవహరిస్తారు. పూర్ణలోహిత వర్ణము, సామాన్య పీత వర్ణము సంయుక్తంగా వుండి మెరిసే పాషాణాలను 'కాషాయక' మణులంటారు. ఈ మణుల పూర్వరూపమైన పుష్పరాగమణి వైదూర్యముతో సమానమైన మూల్యాన్నే కలిగి వుంటుంది. ఫలితం కూడా పురుషుల విషయంలో సమాన ఉన్నత ఫలమే. స్త్రీలు పుష్యరాగాన్ని ధరిస్తే పుత్రప్రాప్తి నొందగలరు.


కర్కేతనమణి పరమపూజ్యతమం. బలాసురుని రత్నబీజ స్వరూపాలైన గోళ్ళను వాయుదేవుడు అత్యంతాదరంతో గొనివచ్చి ప్రసన్నతాపూర్వంగా కమల వన ప్రాంతంలో వ్యాపింపజేశాడు. అవి పృథ్విపై కర్కేతన నామంతో జన్మించాయి. ఇవి రక్త, చంద్ర, మధు, తామ్ర, పీత, నీల, శ్వేత వర్ణాలలో లభిస్తున్నాయి. ఇన్ని రంగుల్లో దొరకడానికి కారణం రత్నవ్యాధి అనే దోషమని పెద్దల మాట. ఈ రత్నాలు కఠోరంగా వుండడానికీ అదే కారణం.


సంతాప, వ్రణ వ్యాధులు రత్నాలకు కూడా వుంటాయి. ఆ వ్యాధి లేకుండా స్నిగ్ధ, స్వచ్ఛ, సమరాగ, అనురంజిత, పీత, గురుత్వ ధర్మాలతో నిండి, విచిత్ర వర్ణ కాంతులీను కర్కేతనమణి విశుద్ధ, పరమపవిత్ర మణిగా పూజలందుకుంటుంది.


స్వర్ణపాత్రలో సంపుటితం చేసి అగ్నిలో వేసి తీస్తే అత్యధిక దేదీప్యమాన కాంతులతో ప్రకాశించే మణి విశుద్ధకర్కేతనమణి. ఇది సర్వరోగాలనూ నశింపజేయగలదు; కలిదోషాన్ని నివారించగలదు; కులవృద్ధినీ కలుగజేయగలదు; సుఖమునూ ఇవ్వగలదు. ఈ కర్కేతనాలను ధరించినవారు పూజలందుకోగలరు; ధనాఢ్యులు కాగలరు; బంధు బాంధవ సంపన్నులు, ప్రసన్నులు కాగలరు. దూషిత కర్కేతనాన్ని ధరించరాదు. అలా చేస్తే, అంటే ధరిస్తే, సర్వ కష్టాలూ సంప్రాప్తిస్తాయి.


భీష్మకమణి మహారత్నదాతయైన బలాసురుని వీర్యం హిమాలయ పర్వతప్రాంతాల్లో పడగా నేర్పడిన రత్నాకరంలో సముద్భవించింది. అక్కడి భీష్మకమణి శంఖ, పద్మ సమాన, సముజ్జ్వలములూ, మధ్యకాలీన సూర్య ప్రభాసమాన శోభలూ వెదజల్లుతూ వజ్రమంత తరుణంగా ఉంటుంది.

Monday, 13 May 2024

శ్రీ గరుడ పురాణము (174)

 


వైదూర్యమణి - పరీక్షా విధి


(వై'డూ'ర్యమనే మాటే తెలుగులో ఎక్కువగా వాడబడుతోంది. కాని సంస్కృత మూలం విదూర-జ, వైదూర్య)


సూతుడిలా చెప్పసాగారు, "హే శౌనకాది మహామునులారా! వైదూర్యాది ఇతర మణులను అనగా వైదూర్య, పుష్ప, రాగ, కర్కేతన, భీష్మక మణులను గూర్చి బ్రహ్మదేవుడు మా గురువు గారికి చెప్పగా ఆయన నాకాజ్ఞానాన్ని ప్రసాదించారు.


బలాసురుని యొక్క నాదం ప్రళయకాల క్షుభిత సముద్ర ఘోషవలె నున్నపుడు దాని నుండి వివిధ వర్ణాలు గల, సౌందర్య సంపన్నములైన వైదూర్యాలుద్భవించాయి. బలాసురుని నుండి పుట్టిన మణి బీజము ఉత్తుంగ శిఖరాన్ని కలిగిన విదూరమను పేరు గల పర్వతానికానుకొనియున్న కామభూతిక సీమక్షేత్రంలో పడగా అదే రత్నగర్భగా మారింది.


ఈ వైదూర్యం మహాగుణసంపన్నం మూడు లోకాలలోనూ దీనికి పేరు ప్రతిష్ఠలున్నాయి. ఈ మణుల కాంతి ఎంత ఎక్కువగా వుంటుందంటే వాటి నుండి నిప్పురవ్వలు రాలుతున్నాయేమోననిపిస్తుంది.


పృథ్విపై పద్మరాగమణి ఎన్ని వర్ణాల్లో లభిస్తోందో వైదూర్యం కూడా అన్ని వర్ణాల్లోనూ దొరుకుతోంది. వీటిలో నెమలి కంఠం రంగూ, వెదురు పత్రం రంగూ వున్నవి శ్రేష్ఠాలుగా చెప్పబడ్డాయి. చషకనామక పక్షి వర్ణంలో వున్నవి ప్రశస్తం కావు.


గుణయుక్తమైన వైదూర్యం తన యజమానికి పరమ సౌభాగ్య సంపన్నునిగా చేయగలదు. దోషయుక్తమణి తన యజమానిని కూడా దోష సంయుక్తుని గావిస్తుంది కాబట్టి ఈ మణి విషయంలో గట్టి పరీక్ష అవసరం.

కొండగాజు, శిశుపాల, గాజు, స్పటిక మణులు కూడా వైదూర్యం లాగే వుంటాయి. దాని వలెనే కాంతులను కూడా వెలారుస్తాయి. కానీ జాగ్రత్తగా పరీక్షిస్తే లేఖన సామర్థ్యం లేకపోవడం వల్ల గాజు, గురుత్వభావహీనత్వం వల్ల శిశుపాల, కాంతి భేదం వల్ల గిరిగాజు, సముజ్జ్వల వర్ణం వల్ల స్ఫటికమణీ వైదూర్యాలు కావని తేలిపోతుంది. ఎనభై రత్తీల బరువున్న ఇంద్రనీలమూ రెండు పలంల బరువున్న వైదూర్యమూ ఒకే ధర పలుకుతాయి.


కొన్ని రాళ్ళు రత్నాల కంటె అధికంగా మెరుస్తాయి కాని రత్నాలకుండే స్నిగ్ధత, మృదుత్వం లఘుత వాటికుండవు. పట్టిచూడాలే గాని ఇంకా ఎన్నో భేదాలు కనిపిస్తాయి.


మంచిమణులను సజాతీయమణులనీ, కాని వాటిని విజాతీయ మణులనీ రత్నశాస్త్ర పరిభాషలో వ్యవహరిస్తారు.


రత్నాల గూర్చి బాగా తెలిసిన వానిని ఉపయోగం ద్వారా తద్ జ్ఞానాన్ని పొందిన వానిని మణిబంధకుడు, మణివేత్త అంటారు. వారు పరిశీలించి నిష్కర్షగా సజాతీయ మణి యేదో చెప్పగలరు. అటువంటి మణి సాధారణ మణి కంటే ఆరు రెట్లు ధర పలుకుతుంది. సముద్రతీరంలో ఆవిర్భూతమైన మణులకున్న విలువ భూమి నుండి ఇతర స్థానాల్లో తీయబడిన మణులు, సజాతీయాలైనా సరే, వాటికి వుండదు.


మనువు పదహారు మాశలు ఒక 'భారం'తో సమానమని నిర్ణయించాడు. దానిలో ఏడవ భాగమొక 'సంజ్ఞ'. నాలుగు మాశలు ఒక 'శాణ'. ఒక పలంలో పదోభాగం 'ధరణం'. అయిదు 'కృష్ణలాలు' ఒక 'మాశ'


(అధ్యాయం - 73)




Sunday, 12 May 2024

శ్రీ గరుడ పురాణము (173)

 


ఈ మణులలో మట్టిమరకలు, మలినాలు ఉండిపోయినవి, కరకరమని శబ్దం వచ్చేవీ, నీలాకాశాన్ని కప్పే నల్లమబ్బుల రంగున్నవి మంచివి కావు. అవి వర్ణదోషదూషితాలు. వీటి మధ్యలోనే రత్నశాస్త్ర కోవిదులు ప్రశంసలతో ముంచెత్తే ఇంద్రనీలమణులు ఎక్కువగా జన్మిస్తాయి.


పద్మరాగమణిని ధరిస్తే కలిగే సత్ఫలితాలన్నీ ఇంద్రనీలమణిని ధరించినవారికీ కలుగుతాయి. ఈ మణిలో కూడా మూడు జాతులు కనిపిస్తున్నాయి. మణి యొక్క రత్న పరీక్ష కూడా రెండింటికీ ఒక్కటే.


అగ్ని పరీక్ష మణి నిర్ధారణకి మాత్రమే చేయాలి గాని మణిని మరింత వన్నెచిన్నెలతో శోభిల్లేలా చేయడానికి అగ్నిలో పడవేయరాదు. దానివల్ల మొదటికే మోసం వస్తుంది. సద్గుణయుక్తమైన మణి దోషదూషితమై తనను అగ్నిలో అతిగా వేయించిన వానికీ వేసినవానికీ కీడును కలిగించవచ్చు.


గాజు, కలువ, గన్నేరు, స్పటిక, వైఢూర్యాది మణులు (ఇవన్నీ మణుల్లో రకాలే) ఇంద్రనీలమణి యొక్క పోలికలతో, గుణాలతో వున్నా కూడా రత్నశాస్త్రజ్ఞులు ఇంద్రనీలమణి వైపే మొగ్గు చూపుతారు. అందుచేత వీటిని క్షుణ్ణంగా పరీక్షించాలి. ముఖ్యంగా గురుత్వ కఠినత్వాలను చూడాలి. ఇంద్రనీలమణికి మధ్యలో ఇంద్రాయుధమైన వజ్రాయుధం కనిపిస్తే ఇక దానిని మించిన రత్నమే లేదు.


ఒక ఇంద్రనీలమణిని తీసుకొని దానికి వందరెట్లు పరిమాణమున్న స్వచ్ఛమైన పాలలో పడేస్తే, ఆ పాలన్నీ నీలవర్ణంలోకి వచ్చివేస్తే అది అచ్చమైన మణి. దీనిని మహా నీలమణి అని కూడా అంటారు. ఎలాగైతే మాశాదులతో మహాగుణశాలియైన పద్మ రాగమణిని తూస్తారో అలాగే సువర్ణ పరిమాణ (ఎనభై రత్తీలు)ములతో మహా గుణశాలియైన ఇంద్రనీలమణిని తూస్తారు”.


(అధ్యాయం - 72)


Saturday, 11 May 2024

శ్రీ గరుడ పురాణము (172)

 


కొన్ని మణులకు ఔషధాలతో రంగును సృష్టించి తయారు చేయడం జరుగుతుంది. సహజ వర్ణాలున్న రత్నకాంతులు పైకి ప్రసరిస్తాయి. మందులు పూయబడ్డ రత్నాలను ఆభరణాలలో వాడడం వల్ల నష్టం లేదు కాని లాభం కూడా వుండదు. సహజత్వాన్ని నిర్ధారించే ఊర్ధ్వగామి కాంతులు కూడా ఒకే ఒక ఏటవాలుగా కోణంలో కనిపిస్తాయి. అవనత దృష్టికి అసలు కనిపించవు.


శుభఫలితాల కోసం మరకతాన్ని ధరించదలచుకున్నవారు స్నానం, ఆచమనం, రక్షామంత్ర విధివత్ జపం, గో- సువర్ణ దానాలు చేసి ధరించాలి. దోషాలు లేని గుణాలు కలిగిన బంగారు త్రాటిలో దీనిని పెట్టుకొని పెట్టుకోవచ్చు. అన్ని దేవ, పితృ కర్మలలో మరిన్ని మంచి ఫలాలకై మరకత మణిని ధరిస్తారు. విషపీడితులను ఆ పీడ నుండి రక్షించే శక్తీ, సంగ్రామంలో విజయాన్ని సమకూర్చే శక్తీ ఈ రత్నానికుంటాయి.


ఇది పద్మరాగమణికంటె అధికమూల్యాన్ని కలిగి వుంటుంది. (అధ్యాయం 71)


ఇంద్రనీలమణి లక్షణాలు, పరీక్షా విధి


ఎక్కడ సింహళ దేశపు రమణులు లవలీ అనే సుగంధిత పుష్పాలతో వాటి వాసనలతో మనసును దోచే వృక్షాలనూ, పొగడలనూ తమ కరాగ్రాల స్పర్శచే కరుణిస్తుంటారో అక్కడ మహాదాత బలాసురుని వికసిత కమల సదృశ శోభలతో వెలిగే కన్నులు వచ్చి పడినవి. రత్న సమాన కాంతులీను ఆ నేత్రప్రభతో సముద్రతీరమంతా వెలుగులమయమై భాసించింది. అక్కడొక విశాలమైన క్షేత్ర మేర్పడింది. అక్కడే ఇంద్రనీలమణులకు గని కూడా ఏర్పడింది. అయితే అక్కడ అన్ని మణులూ లభిస్తాయి. ముఖ్యంగా అక్కడి మరకతమణులు అన్ని రంగుల్లోనూ వుంటాయి. - శ్రీ కృష్ణబలరాములు ధరించే పట్టుపంచెల వలె పచ్చగా, నీలంగా, నల్ల తుమ్మెద రంగులోనూ, శారంగధనుర్యుక్తమైన విష్ణు భగవానుని భుజకాంతులతో, హాలాహలధరమైన శివుని కంఠం రంగులో కూడా వుంటాయి.


ఆ సాగర తీరానికీ అక్కడ పర్వతానికీ నడుమ నున్న క్షేత్రం ఎన్నో జాతి రత్నాలకు నెలవుగా మారింది. వాటిలో కొన్ని తేట నీటి తరంగాల తెలుపుతో ప్రకాశించగా కొన్ని మయూర వర్ణంలో దర్శనమిస్తాయి. మరికొన్ని నీటి బుడగల వలె నుండగా ఇంకొన్ని కోయిల గొంతు వలె నిగనిగలాడతాయి. వీటన్నిటిలోనూ సమానమైన నిర్మలతా, ప్రభాశక్తుల భాస్కరతా బలీయంగా వుంటాయి. అయితే, ఆ పర్వత రత్నగర్భంలో దొరికే అన్ని రకాల రత్నాలలోకీ పరమశ్రేష్టము, అత్యధిక గుణశాలియైనది ఇంద్రనీలమణి.


Friday, 10 May 2024

శ్రీ గరుడ పురాణము (171)

 


గరుత్మంతునిచే, వాసుకిచే వదలబడిన బలాసురాత్మీయ భాగాలలో లభించునవే ఈ నాటికీ ప్రపంచంలో అత్యుత్తమ మణులుగా నెలకొనివున్నాయి. ఇవి చాలా చోట్ల నుండే వస్తున్నాయి గాని, ఏవైనా వాసుకి వదలిన, గరుత్మాన్ కదిలిన స్థానంలోపుట్టిన మణుల తరువాతనే.


రత్న విద్యా విశారదులైన విద్వజ్జనులు ఇలా వచిస్తారు. చిక్కటి ఆకుపచ్చని రంగులో కోమలకాంతులతో మెరుస్తూ, ముట్టుకొన్నా నొక్కినా గట్టిగా తగులుతూ, మధ్యభాగంలో బంగరుపొడి వున్నట్టుగా భ్రమింపజేస్తూ, సూర్యకిరణాలు గానీ వేరే ఉత్తమ కాంతులు గానీ సోకినపుడు మొత్తం మణి పచ్చగా మెరిసినా దాని మద్య భాగం నుండి సూర్యసమాన కాంతులు ఉజ్జ్వలంగా వెలువడి తొలుతటి పచ్చదనాన్ని అధిగమించి వెలుగుతూ వుండే మరకతమణి గొప్ప ప్రభావం కలది. దానిని చూడగానే మన మనసులో ఏదో తెలియని ఆనందం ప్రవేశించి, వేళ్ళూనుకొని మనను పరవశింపజేస్తుంది. ఇంత అధికంగా మనకు ఆహ్లాదం కలిగించే శక్తి ఏ ఇతరమణికీ వుండదు. ఈ లక్షణాలున్న మరకత మణినే సకల సద్గుణవతిగా భావించాలి.


వర్ణం బాగా వ్యాపించడం వల్ల ఉత్తమమైన మరకతమణి అంతర్భాగం నిర్మల స్వచ్ఛకిరణాలతో కూడుకొని వుంటుంది; దాని ఉజ్జ్వలకాంతి చిక్కగా, శుభ్రంగా, కోమలంగా, స్నిగ్ధంగా వుంటుంది.


(పై లక్షణాలు, కాంతులు వుండి నీలకంఠం అంటే నెమలి కంఠం రంగులో మెత్తగా వుండే మరకతమణులు కూడా మంచివే)


చిత్రవర్ణంలో వుండి, కఠోరంగా, మలినంగా, రూక్షంగా, బండరాయిలాగా తగులుతూ శిలాజిత్తనే ఔషధంలాగా వేడిని నిర్గమింపజేస్తూ వుండే మరకతమణి దోషపూరితం. సంధి ప్రదేశంలో శుష్కంగా వుండి, మధ్యలో విరిగి మరొక మణిగా తయారైతే... అటువంటి మరకతాలను తెచ్చిపెట్టడంకాని పెట్టుకోవడం కాని చేయరాదు. భల్లాతకీ, పుత్రికాయని రెండు శైల విశేషాలున్నాయి. కొన్ని రత్నాలు వాటి రంగుల్లో గాని, వాటి కలగలుపు రంగుల్లో గాని వుంటాయి. అటువంటి మరకతమణులు మంచివి కావు. అయితే, పుత్రికా వర్ణం క్షౌమవస్త్రంతో గట్టిగా ప్రయత్నిస్తే తొలగిపోతుంది. కాని మణి చిన్నదై పోయి గాజులా సన్నగా వుంటుంది. అదీ మంచిది కాదు.


Thursday, 9 May 2024

శ్రీ గరుడ పురాణము (170)

 


మరకతమణి - లక్షణాలు, పరీక్షా విధి


నాగరాజు వాసుకి బలాసురుని పిత్తాన్ని తీసుకొని ఆకాశాన్ని చీల్చేటంత వేగంతో దేవలోకం వైపు సాగి పోతుండగా అతని తలపై నున్న మణి ప్రకాశం క్రింద నున్న సముద్రంపై పడి సాగరానికి వెండి సేతువు అమరినట్లుగా కాంతులు పఱచుకొన్నాయి. సరిగ్గా అదే సమయానికి తన రెక్కల దెబ్బలతో భూమ్యాకాశాలను కలగుండు పఱచే వేగంతో పక్షిరాజు గరుత్మంతుడు వాసుకిపై దాడిచేశాడు.


వాసుకి భయపడిపారిపోతూ ఆ బలాసురుని పిత్తాన్ని ఒక పర్వత సానువు వద్ద నుంచి వెడలిపోయాడు. ఆ పర్వతంపై మధుర సుస్వాదజల స్రవంతులు ప్రవహిస్తున్నాయి. నవకలికలతో సాంద్రసుగంధ పరిమళాలను వెదజల్లుతున్న సౌగంధిక వృక్షాలు, ఎన్నో మాణిక్యాలు కూడా, తురుష్క దేశానికి దగ్గరల్లో నున్న ఆ పర్వతం కొండకోనల్లో కొలువున్నాయి. బలాసురుని పిత్తం ఆ నీటిలో కలసి సముద్రంలోకి ప్రస్థానించి మహాలక్ష్మి సమీపానికి* దగ్గరగా పోగా, అది ప్రయాణించిన సరిత్తుల తీరాలలో నున్న భూమి మరకతమణులకు ఖజానా అయింది.


* సముద్రం మహాలక్ష్మికి పుట్టిల్లు


వాసుకి పరుగెడుతున్నపుడు అతని రక్షణలోనున్న బలాసురుని పిత్తం నుండి కొన్ని బిందువులు జారిపడుతుండగా గరుత్మంతుడు వాటిని అందుకొని పానం చేశాడు. వెంటనే ఆయనకి మైకం కమ్మేసినట్లుగా కావడంతో ఆయన దానిని వమనం (కక్కివేయుట) చేశాడు. ఆయన రెండు నాసికారంధ్రాల ద్వారా వెలువడి నేల పైబడిన ఆ పిత్తభాగము అద్భుత కాంతితో మెరిసే మరకతాలకు గనిగా మారింది. ఆ మహామణులు కోమలమైన చిలుక వన్నెలోనూ, శిరీష పుష్ప వర్ణంలోనూ, మిణుగురు పురుగు వెనుకభాగం రంగులోనూ, హరిత తృణక్షేత్రంవలెనూ, నాచురంగులోనూ, సర్పభక్షిణి నెమలి కన్నుల వన్నెలలోనూ నవహరిత పత్రవర్ణంలోనూ మెరుస్తుంటాయి. ఇవి లోకకళ్యాణ కారకాలు. గరుత్మంతుని స్పర్శ వలనయోమో గాని ఇక్కడి మరకతమణులు సర్వవిషవ్యాధులనూ నశింపజేసే శక్తిని కలిగి వుంటాయి. అయితే ఇవి దుర్లభాలు; దొరకడం చాలా కష్టం. ఎన్నో మంత్రాలకూ, మరెన్నో ఔషధాలకూ లొంగని విషాలు కూడా గరుత్మంతుని మూలంగా వచ్చిన రత్నాలు తగలగానే పటాపంచలై పోతాయి.


Wednesday, 8 May 2024

శ్రీ గరుడ పురాణము (169)

 


మలినవర్ణం వల్ల కలాశపుర పద్మరాగాలు, అల్పతామ్ర వర్ణ కారణంగా తుంబరు దేశీయాలు, కృష్ణ వర్ణపు కలిమిచే సింహళోత్పన్నాలూ, నీలవర్ణ, కాంతి విహీనతా వ్యాజానముక్త పాణి శ్రీ పూర్ణకీయ పద్మరాగాలూ స్వల్పంగా వాసి తక్కువ మణులుగా పేర్కొనబడుతున్నాయి.


వెలితి లేని ఎఱ్ఱదనం - అంటే గుంజబీజం (గురిగింజ) తో సమానమైన రంగుండే పద్మ రాగం అత్యుత్తమం. ఇది మెత్తగా వున్నట్లు చేతికి తగిలినపుడు అనిపిస్తుంది. కాని నొక్కి చూస్తే చాలా గట్టిగా వుంటుంది. నున్నదనంలో దీనికి సాటి లేదు. దానిని ఒక వైపు చేతితో నిమురుతుంటే రెండో వైపు రంగు మరింత చిక్కబడుతుంది. ఎక్కువసేపు వేళ్ళ మధ్య పెట్టుకొని రాపిడి చేస్తే కొంత రంగును కోల్పోయినట్లు కనిపిస్తుంది. రాపిడి తీవ్రతరమైతే రంగును కొంతవఱకు కోల్పోవచ్చు. చేతబట్టుకొని పైకెగరేసి చూస్తే సూర్యకిరణాల చిక్కదనాన్ని బట్టి పద్మరాగం రంగులు మారుస్తుంది. ఒక్కొక్క ఎత్తులో ఒక్కొక్క రంగును ధరిస్తుంది. ఇవన్నీ ఉత్తమ రత్న లక్షణాలే కాని వీటిని గమనించేసి తొందరపడిపోకుండా రత్న పరీక్షకుని అభిప్రాయం తీసుకోవాలి. సాన కూడా పట్టించి చూడాలి. ఎందుకంటే ఉత్తమ రత్నాన్ని ధరించినవాడు ఏదో సరదాగా శత్రువుల మధ్యలోకి వెళ్ళినా ఆ రత్నము వానిని రక్షిస్తుంది. అదే దోషభూయిష్టమైన రత్నమైతే స్నేహితుల మధ్యలోనున్న వాడు కూడా ఆపదల పాలౌతాడు.


ఒకచోట పుట్టిన మణులన్నీ ఒకే ప్రభావాన్ని కలిగి వుంటాయనుకోరాదు. పోలికలుంటాయి; కాని భేదాలూ వుంటాయి. కాబట్టి రత్నాలను దేనికదిగానే కలివిడిగా కాకుండా విడివిడిగా రత్న పరీక్షకునికిచ్చి శోధన చేయించాలి. అత్యుత్తమ రత్నాన్ని అల్పప్రభావం గల రత్నాలతో కలిపి నిక్షేపించరాదు.


మహాగుణ సంపన్నములైన పద్మరాగాలను ఉడద ధాన్యపు గింజ పరిమాణాన్ని బట్టి పోల్చాలి. అనగా తులన, ఆకలన, చేయాలి.


(అధ్యాయం - 70)


Tuesday, 7 May 2024

శ్రీ గరుడ పురాణము (168)

 


స్పటికం నుండి పుట్టిన పద్మరాగం సూర్య కిరణాలు సోకగానే ఎంత దూరం దాకానైనా అవిచ్ఛిన్నంగా అన్ని ప్రక్కలకూ తన కాంతులను విరజిమ్మగలదు. కొన్ని రత్నాల వర్ణాలు కుసుంభ నీల వర్ణాల మిశ్రితాల కలగలుపు కాంతులతో కంటికింపు గొలుపుతాయి. కొన్ని పద్మరాగాలు కొత్తగా వికసించిన కమలం వంటి శోభతో మెరుస్తాయి. కొన్ని భల్లంటక, కంటకారి పుష్ప సమానకాంతులను వెలారుస్తాయి. ఇంగువ చెట్టు పూలరంగులో కొన్ని కళకళలాడగా, మరికొన్ని చకోర, పుంస్కోకిల, సారస పక్షుల కన్నుల కాంతులతో సమాన వర్ణాలలో వెలుగును వర్షిస్తుంటాయి. మొత్తానికి స్పటికోద్భూత పద్మ రాగాలలో కూడా గుణ ప్రభావాలు ఉత్తమంగానే వుంటాయి. రావణ గంగోత్పన్న మణులతో సమానంగానే వుంటాయి.


సౌగంధిక మణుల నుండి పుట్టిన పద్మరాగ మణులు నీలకమలాల రంగులోనూ ఎఱ్ఱ కలువల వర్ణంలోనూ వుంటాయి. కురువిందాల నుండి వచ్చిన వాటికి స్పటికోద్భూత పద్మరాగాలంత కాంతి వుండదు. అధికాంశ మణులలో కాంతి అంతర్నిహితమై అనగా లోపల్లోపలే వుంటుంది. అయినా ఆ రేఖా మాత్రపు బహిర్గత బహువర్ణ కాంతి బాహుళ్యమే మనుజులను మైమరపించగలుగుతోంది.


వర్ణాధిక్యం, గురుత, స్నిగ్ధత, సమత, నిర్మలత, పారదర్శత, తేజస్విత, మహత్త - ఇవన్నీ శ్రేష్టమణుల యొక్క గుణాలు. మణులు గరుకుగాను, పొడిపొడిగానూ, పరుషం గానూ, అక్కడక్కడ కన్నాలు పడి, వర్ణవిహీనంగా, ప్రభాహీనంగా, కడిగినా పోని మరకలతో వుంటే అవి దోషయుక్తాలని గ్రహించి వానిని కనీసం స్పృశించరాదు. ఎందుకంటే వాటిని ధరిస్తే వాటి దుష్ప్రభావం వల్ల ధరించిన వానిని శోకం, చింత, రోగం, మృత్యువు, ధననాశాది ఆపదలు చుట్టుముడతాయి.


అన్ని సద్గుణాలూ అబ్బిన పద్మరాగమణులు కూడా ఒక్కొక్కప్పుడు సర్వశ్రేష్ఠతా పదాన్ని అందుకోలేకపోవచ్చు. రత్నతులన చేయునపుడు కలాశపురం, సింహళం, తుంబరు, ముక్తపాణి, శ్రీపూర్ణక ప్రాంతాల నుండి వచ్చిన పద్మరాగమణులెంత జాజ్జ్వల్యమానా లైనప్పటికీ రావణగంగోత్పన్న పద్మరాగాలకంటే, తలవెంట్రుకవాసైనా, వాసి తక్కువగానే భావింపబడుతున్నాయి.


Monday, 6 May 2024

శ్రీ గరుడ పురాణము (167)

 


పద్మరాగమణి - లక్షణాలు - పరీక్షావిధి


దేవతలపాలిటి మహాదాతయు, జగత్తికి సర్వరత్న ప్రదాతయునగు బలాసురుని రత్న బీజరూప శరీరం నుండి సూర్యభగవానుడు కొంత రక్తాన్ని తీసుకొని వెళుతుండగా వినీలాకాశమార్గంలో లంకపై నుండి పోతున్నపుడు లంకాధిపతియైన రావణుడు అడ్డగించాడు. వారి పెనగులాటలో ఆ రక్తం అలా క్రిందికి జారి లంకాదేశంలో ఒక నదిలో పడిపోయింది.


రావణగంగగా ప్రసిద్ధమైన ఆ నది బహు ప్రశస్తమైనది. అందలి జలాలు లంకలోని అద్భుత సౌందర్యవతుల నితంబాల నీడలతో నిత్య సంపర్కం గలగడం వల్లనో ఏమో గాని పరమ రమణీయాలుగా పేరు గాంచాయి. నారీరత్న సంచయసంగ్రాహకులలో రావణుని మించిన వారుండరేమో కదా! ఆ నది యొక్క రెండు తటాలూ పోకచెట్లతో సుశోభాత్ శోభితాలై వుంటాయి. ఆ నదిని అక్కడి వారు గంగతో సమాన పవిత్రంగా చూసుకుంటారు. ఉత్తమ ఫలాలనివ్వడంలో ఆ నది గంగకి తీసిపోదు.


అందులో బలాసురుని రుధిరగతాకర్షక శక్తి ఒక ఆకస్మిక ధనలాభం వలె చేరగానే ప్రతిరాత్రి రత్నాలెక్కడి నుండో వచ్చి ఆ నదీతటంపై స్థిరపడసాగినవి. వాటి యొక్క కాంతులు బంగారు బాణాల్లాగా నదిలో నుండి పైకీ వెలుపలి నుండి నదిలోకీ పరావర్తితం కాసాగినవి. ఆ నదిలో దొరికినవే పద్మరాగమణులు.


ఇవి సౌగంధికాలు కూడ. వీటిలో కురువిందజ రత్నాల, స్పటిక రత్నాల ఉత్తమ, ప్రధాన గుణాలన్నీ వుంటాయి. వాటి స్వరూపం ఎఱ్ఱటి మెరుపుతో బంధూకపుష్పం, గుంజాఫలం, జపా కుసుమం, కుంకుమ, వీరబహుటి కీటవర్ణాలు, పలాశ పుష్పవర్ణం - ఇలా లేతగా కనీ కనిపించని ఎరుపు నుండి నలుపు కలిసిన చిక్కటి రక్తవర్ణం దాకా అన్ని ఎఱ్ఱని నీడలలోనూ అనగా చాయలలోనూ వుంటుంది. సిందూరం, నీలోత్పలం, రక్త కమలం, కుంకుమపూవు, లాక్షారసం రంగుల్లోనూ పద్మరాగం వుంటుంది. ఎంత చిక్కటి రంగులో నున్నా కాంతులు వెదజల్లుతూ వుంటుంది.


Sunday, 5 May 2024

శ్రీ గరుడ పురాణము (166)

 


విశుద్దత కోసం ముత్యాలను సాధారణ అన్నపుకుండలలో జంబీర రసం నింపి, అందులో వేసి ఉడికిస్తారు. తరువాత వాటి ఆకారాలను మలచి కన్నాలను కూడా వేసేస్తారు.


దీనికి ముందుగానే బాగా తడిపిన మట్టితో మత్స్య పుట పాకమును జోడించి, అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత మట్టికి బిడాల పుట పాకమును జోడించి అందులో ముత్యాలను ఉడికించాలి. తరువాత వాటిని బయటికి తీసి పాలలో గాని నీటిలో గాని, మధు రసంలోగాని వేసి మరల వేడి చేస్తే అవి నున్నగా, మృదువుగా తయారవుతాయి. మంచి మెరుపు కూడా వస్తుంది. అపుడు స్వచ్ఛమైన వస్త్రంతో ప్రతి ముత్యాన్నీ గట్టిగా తోమాలి. చెప్పులను మెరుపు కోసం గుడ్డతో రాపిడి చేసే దాని కన్న నెక్కువగా వీటిని చేయాలి. (పాలిష్) వాటి మెరుపు రెండింతలు మూడింతలుగా పెరుగుతుంది. దోషాలన్నీ పోయి, గుణవంతమై సహజంగానే వుండే ముత్యం ఈ రకమైన శుద్ధి చర్యల వల్ల మరింత నయనానందకరమై పంకిలరహితమై శోభిస్తుంది. మహానుభావుడు, దయామయుడు, లోకబాంధవుడునగు వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్యాలపై జనులకు జ్ఞానాన్ని కలిగించాడు.


ఈ విధంగా రసశోధితమైన ముత్యం శుభ, సిద్ధి కారకమైన విశ్వాసపూర్ణాలంకారమై మానవశరీరాలపై అలంకారమై శోభిస్తుంది. సూర్యకాంతి సోకిన స్వచ్చమైన గాజులాగా మెరుస్తుంటుంది. స్వర్ణజటితమై వుంటే ఆ బంగారానికే ఒక కొత్త వెలుగునూ అందాన్నీ శోభన ప్రతిపత్తినీ ఇస్తుంది. ముత్యాన్ని బాగా శోధించి మంగళకారకం చేయడంలో సింహళీయులదే సింహభాగం.


ఏదేనా ఒక ముత్యం మీద అనుమానము వస్తే దానిని స్నేహద్రవం (ముత్యానికి హాని చేయనిది) వేడిచేసి, దానిలో ఉప్పు కలపగా వచ్చిన ద్రావకంలో ఒక రాత్రంతా ఉంచివేయాలి. తెల్లవారినాక ఆ ముత్యాన్ని బయటికి తీసి పొడిగుడ్డలో చుట్టి శ్రద్ధగా మర్దన చేసినంత గట్టిగా తుడవాలి. అలా అరగంట పాటుచేసి తీసి చూస్తే ఆ ముత్యం ఏ మాత్రమూ వన్నె తగ్గకుండా నిన్నటిలాగే మెరుస్తుంటే అది మంచిముత్యమే.


ఇదివఱకు చెప్పబడిన ప్రమాణాలతో పెద్దదై, తెల్లగా, నున్నగా, స్వచ్ఛంగా, నిర్మలంగా, తేజస్సంపన్నంగా, సుందరంగా, గుండ్రంగా వుండే ముత్యం గుణసంపన్నమని శాస్త్రం 

వచిస్తోంది. ముత్యం అమ్ముడు పోయినా, పోకున్నా ఆనందాన్నే కలిగిస్తుంది. అమ్ముకుంటే 

డబ్బులొస్తాయి. అమ్ముకోకుండా వాడుకుంటుంటే దానికి గల అతీత శక్తుల వల్ల ఐశ్వర్యానందాలు కలుగుతూనే వుంటాయి.


సర్వసులక్షణ లక్షిత జాతయైన ముత్యము ఒక మారు ఒక మనిషి పూర్వజన్మ సుకృతం కొద్దీ అతన్ని చేరిందంటే అతనిని ఏ విధంగానూ చెడిపోనీయదు, బాధపడనివ్వదు, 

అనర్ధోత్పాదక శక్తులనతని దరి చేరనివ్వదు, దోష సంపర్కం కలుగనివ్వదు. ఇదీ మంచి ముత్యము యొక్క మాహాత్మ్యము. 


(అధ్యాయం - 69)


Saturday, 4 May 2024

శ్రీ గరుడ పురాణము (165)

 


మేఘంలో పుట్టే ముత్యాలు భూగోళం దాకా రానే రావు. ఖేచరులైన దేవతలే వాటిని ఒడిసి పట్టేసుకుంటారు. ఆ ముత్యాలకి దిక్కుల మూలల్లోని చీకట్లను కూడా పారద్రోలి అంతవఱకు మనకి కనిపించని చీకటి కోణాలని ఆవిష్కరించేటంత తేజస్సుంటుంది. సూర్య సమాన కాంతులతో ప్రకాశించే ఆ ముత్యం ఆకారం కూడా స్పష్టంగా ఆ వెలుగులో కనిపించడం కష్టం. ఈ మేఘమణి సర్వజన సామాన్యానికీ సమస్త శుభదాయకం. ఈ మణి వున్న చోటి నుండి నలుదిక్కులూ సహస్రయోజనాల దాకా విస్తరించిన క్షేత్రంలో ఏ అనర్థమూ జరగదు.


దైత్యరాజు, మహాదాని బలాసురుని ముఖము నుండి రాలినదంత పంక్తి నక్షత్ర మండలంలాగా ఆకాశంలో ప్రకాశిస్తూ విచిత్ర వివిధ వర్ణకాంతులను వెలారుస్తూ అలా అలా సముద్రంలో పడింది. ఈ సముద్రం అప్పటికే అశేష జలరాశికే గాక అమూల్య రత్న సంపత్ ప్రపంచాధిపతి. సోముని యొక్క షోడశ కళలతో నిండిన వెలుగులను, కాంతిని, శాంతిని తలదన్నే రత్నాలకు ఆకారము ఆ చంద్రునికే పుట్టినిల్లు, రత్నగర్భయైన సముద్రము. సముద్రమే మహాగుణ సంపన్నాలైన సర్వరత్ననిధానము. అందులో పడిన బలాసురుని పలువరస ఒక కొత్త అమూల్య సంపదకు తెరతీసింది. ముత్యపు చిప్పగా అనంతర కాలంలో ప్రసిద్ధికెక్కిన శుక్తులలో ఈ పలువరుస వంశాభివృద్ధి జరుగుతోంది. ఈ ముత్యాలే సర్వశ్రేష్ఠములై మానవజాతిని సముద్దరిస్తున్నవి. సాగర తీర దేశాలు, ద్వీపాలునైన సౌరాష్ట్ర, పరలోక, తామ్రపర్ణ, పారశవ, కుబేర, పాండ్య, హాటక, హేమక, సింహళ ప్రాంతాలు ముత్యాలకు కోశాగారాలు (ఖజానాలు)గా పరిణతిచెందాయి.


ముత్యమెక్కడ పుట్టినా ముత్యమే. ఇది సర్వత్ర సర్వాకృతులలోనూ లభిస్తుంది. పురాణ కాలంలో ఒక ముక్తాఫలం విలువ ఒక వేయీ మూడు వందల అయిదు ముద్రలు. అరతులం బరువున్న ముత్యం పైన చెప్పిన ధరలో అయిదింట రెండవ భాగము (2/5) తక్కువ. మూడు మాశలు అధికంగా బరువుండే ముత్యము. రెండువేల ముద్రలు. అనంతర కాలంలో విలువలు ఈ దిగువ కలవు.


(ఈ ధరవరుల పట్టిక క్రిందటి శతాబ్దిది. విష్ణువు గాని సూతుడు గాని చెప్పినది కాదు)


పూర్తిగా పెరిగిన పెద్ద పరిమాణంలో వున్న చిప్ప నుండి వచ్చిన ముత్యం పదమూడు వందల బంగారు కాసుల (సావెరిన్ల) ధర పలుకుతుంది. ఆరు బియ్యపు గింజల బరువున్నది 460 కాసులు చేస్తుంది. అత్యుత్తమ స్థాయికి చెంది, తొమ్మిది గింజల బరువున్న ముత్యం ధర రెండు వేల కాసులుంటుంది. రెండున్నర గింజల బరువున్నది 1300 కాసులు, రెండు గింజల బరువున్నది 800 కాసుల విలువ చేస్తాయి. అరగింజ బరువే వుండి మూడువందల కాసుల ఖరీదు చేసే ముత్యాలు కూడా వున్నాయి. ఉత్తమస్థాయికి చెంది, 720 మిల్లిగ్రాముల బరువుండే ముత్యం వెల రెండు వందల కాసులు. ద్రావిక అను పేరు గల శ్రేష్ట ముత్యమొకటుంది. దీని బరువు 50 మిల్లి గ్రాములు వెల 110 కాసులు. భావకమను పేరు గల ముత్యం 35 మిల్లిగ్రాములు, ధర 97 కాసులు. శిక్య అని చిన్న ముత్యాలుంటాయి. అవైతే ఒక్కొక్కటి పాతిక మిల్లిగ్రాముల బరువు, 40 కాసుల ధర. సోమ ముత్యము 15 మిల్లిగ్రాములు, 20 కాసులు. అలాగే కుప్యా అనే రకానికి చెందిన ముత్యం 8 లేక 9 మిల్లిగ్రాముల బరువుండి తొమ్మిది లేదా పదకొండు కాసుల ధర పలుకుతుంది. (కాసులనగా బంగారుకాసులైన సావెరిన్లే)


Friday, 3 May 2024

శ్రీ గరుడ పురాణము (164)

 


వెదురు, ఏనుగు, చేప, శంఖం, వరాహాల నుండి వచ్చే ముత్యాలు మంగళకరమైన కార్యాలకు ప్రశస్తములని చెప్పబడింది. రత్ననిర్ణాయక విద్వాంసులు ఎనిమిది రకాల ముత్యాలను పేర్కొంటూ వాటిలో శంఖ, హస్తి ప్రభూతాలు అధమాలని వచించారు.


శంఖం నుండి పుట్టిన ముత్యం ఆ శంఖము యొక్క మధ్యభాగం రంగులోనే వుండి బృహల్లోల ఫలం పరిమాణంలో వుంటుంది. ఏనుగు కుంభస్థలం నుండి వచ్చే ముత్యం పసుపురంగులో వుంటుంది. వీటి ప్రభావం ఏమీ వుండదు. చేప నుండి పుట్టే ముత్యాలు ఆ చేపపై భాగం రంగులోనే వుంటాయి. అందంగా, గుండ్రంగా, చిన్నవిగా ఉంటాయి. సముద్రంలోనే ఎక్కువ భాగం జీవించే చేప యొక్క వదన భాగం ఈ ముత్యాల జనకస్థానం.


వరాహం నుండి వచ్చే ముత్యాలు ఆ వరాహం దంత మూలాల రంగులోనే వుంటాయి. అయితే ఈ వరాహాలు మనకెప్పుడూ దర్శనమిచ్చే నల్ల ఊరపందులు కావు. ముక్తాజనకమైనది ఎక్కడో ఎప్పుడో అరుదుగా దొరికే శ్వేతవరాహరాజము.


వెదురు కణుపుల నుండి పుట్టే ముత్యాలు వడగళ్ళలాగ స్వచ్ఛ సముజ్జ్వల తెలుపు మెరుపుల కాంతులతో శోభాయమానంగా వుంటాయి. ఈ ముత్యాలకు జన్మనిచ్చే వెదుళ్ళు ఎక్కడో దివ్య, జనులను సేవించుకోవడానికి వారున్నచోటనే పుడతాయి గాని సామాన్యులకు దొరకవు.


సర్పముత్యాలు కూడా చేప ముత్యాల వలెనే విశుద్ధంగా వృత్తాకారంలో వుంటాయి. కత్తుల చివరల కాంతుల వలె అద్భుతంగా మెరుస్తాయి. పాము పడగలపై, అదీ అత్యున్నత జాతి నాగుల వద్దనే, దొరికే ఈ ముత్యానికి గొప్ప శక్తి వుంటుంది. దీనిని ధరించేవాడు అతిశయ ప్రభాసంపన్నుడై, రాజ్యలక్ష్మీయుక్తుడై, దుస్సాధ్యమైన ఐశ్వర్యానికధిపతియై తేజస్విగా, పుణ్యవంతునిగా వెలుగొందుతాడు.


ఈ ముత్యాన్ని రత్నశాస్త్రంపై ప్రపంచంలోనే సంపూర్ణ అధికారమున్న విద్వాంసుని చేత పరీక్ష చేయించి ఆయన తలయూచిన పిమ్మట శుభముహూర్తంలో నొక సమస్త విధి పూర్వక సంపన్నమైన భవనంపై స్థాపిస్తే ఆకాశం నుండి దేవదుందుభి ధ్వని వినిపిస్తుంది. దేవతల సంతోషం, ఆశీర్వాదం స్పష్టంగా తెలుస్తాయి. ఎవని కోశాగారంలోనైతే ఈ సర్ప ముత్యంవుంటుందో వానికి సర్ప, రాక్షస, వ్యాధి, ప్రయోగాల ద్వారా మృత్యు భయముండదు.


Thursday, 2 May 2024

శ్రీ గరుడ పురాణము (163)


 

పుష్పరాగాది జాతిరత్నాలు ఇతర జాతిరత్నాలపై గీతను గీయగలవు. కాని హీరకము, కురువిందము (మాణిక్యం) తమ జాతి రత్నాలనే గీయగలవు.


వజ్రాన్ని వజ్రమే కోయగలదు. స్వాభావిక వజ్రానికి మాత్రమే తన కాంతులను పైపైకి అనగా ఆకాశదిశగా ప్రసరింపజేసే శక్తి వుంటుంది.


ఇంద్రాయుధ చిహ్నంకితములైన వజ్రాలు కొన్ని అరుదుగా వుంటాయి. వీటిపై ఆ గుర్తు స్పష్టంగానే కనిపిస్తుంటుంది. కేవలం ఇవి మాత్రమే... కోణాల వద్ద విరిగినా, బిందు, రేఖా చిహ్నదూషితాలైనా తమ శ్రేష్టతను పూజ్యతను నిలబెట్టుకొనే వుంటాయి. అనగా వీటిని ధరిస్తే నష్టం జరుగకపోగా ఉద్దిష్ట ప్రయోజనాలన్నీ నెరవేరుతాయి.


మెరుపుతీగలలోని కాంతితో సముజ్జ్వలంగా వెలుగులను విరజిమ్మే వజ్రాలను ధరించే రాజు అతిశయ ప్రతాపవంతుడై జగదేకవీరుడై విలసిల్లగలడు. సమస్త సంతానాలతో వర్ధిల్లుతూ పెద్ద కాలముపాటు పుడమి నేలగలడు. (అధ్యాయం - 68)


ముత్యాలు - వాటిలో రకాలు లక్షణాలు - పరీక్షణ విధి


శ్రేష్ఠమైన ఏనుగు, మేఘం, వరాహం, శంఖం, చేప, పాము, వెదురు - వీటన్నిటి నుండీ ముత్యాలు వస్తాయి. అయినా శుక్తి అనగా ముత్యపు చిప్ప నుండి పుట్టు ముత్యాలే జగత్ప్రసిద్ధాలు.


రత్నమనిపించుకొనే స్థాయి ఒకే ఒక రకమైన ముత్యానికుంటుందని ముక్తాశాస్త్రం ఇది వివరిస్తోంది. అది ముత్యపు చిప్పలోనేపుడుతుంది. ఇదే సూదితో పొడిస్తే కన్నం పడుతుంది. మిగతావి పడవు.