Sunday 30 June 2024

శ్రీ గరుడ పురాణము (221)

 


మూడేళ్ళకు సరిపడునంత బియ్యమును పండించి దాచగలిగినవాడు సోమరసపానానికి అర్హతను సంపాదించుకుంటాడు. ఒక్కయేడాది అన్నానికి సరిపడు బియ్యం లేదా ధాన్యమును దాచగలిగిన వారు ముఖ్యంగా సోమయాగం యొక్క ప్రాక్ క్రియను చేయవలసి వుంటుంది. అనగా సోమయాగానికి పూర్వం చేయవలసిన అగ్నిహోత్ర, దర్శపూర్ణమాస, ఆగ్రాయణ, చాతుర్మాస్యాది కర్మలను అనుష్ఠించాలి. ద్విజుడు ప్రతియేటా సోమయాగం, పశుయాగం, చాతుర్మాస్యయాగం, ఆగ్రాయణేష్ఠి (అనగా కొత్తగా ధాన్యపుగింజలు కనబడగానే చేయుయాగం) లను ప్రయత్న పూర్వకంగా శ్రద్ధగా చేయాలి. ప్రతియేటా చేయలేనివారు రెండుసంవత్సరాలలో ఒకమారు అదే వేళకు వైశ్వానరీ యిష్టిని చేయాలి.


ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలందుకొని మోక్ష ప్రాప్తిని కోరు బ్రాహ్మణుడు జీవించవలసిన విధానం వేరు. స్వాధ్యాయ విరోధియైన అర్థ సంపాదనం చేయరాదు. ఎవరి వద్దా ధనమును పుచ్చుకొనరాదు. చిన్న చిన్న పనులకూ వ్రతాలకూ ప్రతి ఫలాన్ని స్వీకరించరాదు. నృత్య గీతాదుల ద్వారా కూడా ధన సంపాదన చేయరాదు. శూద్రుని చేత యజ్ఞాన్ని చేయించి డబ్బును పుచ్చుకున్న బ్రాహ్మణుడు మరుజన్మలో చండాలునిగా పుడతాడు. యజ్ఞం కోసం తీసుకువచ్చిన అన్నాన్ని దానం చేసుకున్నవాడు కోడి, గ్రద్ధ, కాకి యోనుల్లో పుడతాడు.


ఆధ్యాత్మికాశయాలను కలిగి శరీరాన్ని ధర్మమోక్షాలకొక సాధనంగా వాడుకోదలచిన బ్రాహ్మణుడు రెండు మూడు రోజులకు సరిపడు బియ్యాన్ని మాత్రమే ఉంచుకోవాలి. మోక్ష సాధకునికి అన్నిటికంటె *శిలోంఛవృత్తి పరమ శ్రేష్ఠము. (* శిలవృత్తి అనగా పంట కోతలైనాక పొలములో మిగిలియున్న ధాన్యపు గింజల నేరుకొని వాటితోనే అన్నం వండుకొని కడుపు నింపుకొనుట. ఉంఛవృత్తి యనగా ధాన్యపు బస్తాలనుండి రహదారిపై రాలిన ఒక్కొక్క గింజ నేరుకొని తెచ్చుట. ఈ రెండిటినీ కలిపి శిలోంఛవృత్తి అని వ్యవహరిస్తారు.)


అతనిని గుర్తించి రాజుగానీ, శిష్యుడుగానీ, యజ్ఞాలను నిత్యకృత్యంగా చేయించే యజమానిగాని ముందుకివచ్చి పోషణ భారాన్ని వహిస్తే అంగీకరించవచ్చును అప్పుడయినా ప్రాణాన్ని నిలబెట్టుకోవడం కోసంమే తినాలిగాని భోగద్రవ్యాలను స్వీకరించుట తగదు.


No comments:

Post a Comment