Saturday 20 October 2012

సరస్వతి దేవి

మిగితా దేవి దేవతలందరూ కలువ, తామర పువ్వుల్లొనూ కూర్చుంటే చదువుల తల్లి సరస్వతి దేవి మాత్రం రాయి మీద కూర్చొని ఉంటుంది ఎందుకు?ఏ పువ్వైనా కొంత సమయం మాత్రమే వికసించి ఉంటుంది.ఉదయానికి వికసించిన పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది.కాని రాయి మాత్రం పదిలంగా ఉంటుంది.అంటే మనకు వాగీశ్వరి(సరస్వతి దేవి) ఇస్తున్న సందేశం విద్య,జ్ఞానం,వివేకం మాత్రమే శాశ్వతం.సంపదలు కొంత కాలం మాత్రమే ఉంటాయి అని అర్దం.అందుకే అన్నమయ్య జ్ఞానమే మోక్షసాధనకు మార్గం అన్నారు.అంతేకాదు మనకు చిన్నప్పటి పద్యాల్లో చదువు గురించి ఒక పద్యంలో"పోదు యుగాంతపు వేళనైనా"అని చదువుకున్నాం.అంటే ప్రపంచ ప్రళయకాలంలో అన్ని నశించినా కూడా విద్య నశించదు.

సరస్వతి దేవికి హంస వాహనంగా ఉంటుంది.పాలు,నీరు కలిపి హంస ముందు పెడితే హంస నీటిని వేరు చేసి పాలను మాత్రమే త్రాగుతుంది.మనలో కూడా ఎవరైతే సమాజంలో ఉన్న మంచి గ్రహించి చెడును విడిచిపెడతారో,అటువంటి వారిని అనుగ్రహిస్తుంది హంసవాహన(సరస్వతి దేవి) అని అర్దం.సమాజంలోనే కాదు ప్రతి విషయానికి ఒక మంచి ఉంటే ఒక చెడు పరిణామం ఉంటుంది.ఒక కాయిన్ కు బొమ్మ బొరుసుల తరహాలో.ప్రతి విషయంలో ఎవరు మంచిని మాత్రమే వెతికి దానిని మాత్రమే గ్రహించడం ద్వారా వారి సరస్వతి అనుగ్రహం కలుగుతుంది.

సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను,మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది.వేదం అనంతమైన జ్ఞానానికి సంకేతం.జపమాలతో ఆమే నిరంతరం జపిస్తూ ఉంటుంది.దాని అర్దం మనకు చదువు రావాలి,జ్ఞానాన్ని పొందాలి అంటే వచ్చిన దాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేయాలి అని  శారదా దేవి సందేశం.అందుకే వేదం అంటుంది"తపస్స్వాధ్యాయ నిరతం".అంటే క్రొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన(ఇంట్రస్ట్)ఎంత అవసరమో,తెలిసిన విషయాలను మళ్ళి మళ్ళీ గుర్తుచేసుకోవడం కూడా అంతే అవసరం.

సరస్వతి దేవి చేతిలో వీణ నాదానికి సంకేతం.నాదం అంటే శబ్దం.అదే పరబ్రహ్మం.అలాగే సరస్వతి దేవికి వాగ్దేవి అని పేరు.వాక్ అంటే మాటలు.మాటల రూపంలో ప్రకటితం అవుతుంది సరస్వతి అమ్మవారు.మన నాలుక మీద సరస్వతి దేవి స్థానం.మనం మాట్లాడే మాటలను బట్టి మనకు ఆమె అనుగ్రహం ఉంటుంది.మనం మాట్లాడే మాటలు మంచివైతే అవి ఆమెకు మనం చేసి అర్చన అవుతుంది,మనలని అనుగ్రహిస్తుంది.మాటలు చెడ్డవైతే సరస్వతి అమ్మవారిని అవమానించినట్టు అవుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి.
             
ఓం సరస్వత్యై నమః అన్న నామాన్ని రోజు మీకు వీలైనన్ని సార్లు జపించండి.అమ్మవారి కృపకు పాత్రులవ్వండి.

ఓం సరస్వత్యై నమః

No comments:

Post a Comment