Tuesday 21 April 2015

భూతాపం - భూతల్లికి జ్వరం - ఆధునిక మానవుడి భస్మాసుర హస్తం

కన్నతల్లికి బ్రతికి ఉండగానే ఆమెకు చితి పేర్చి నిప్పు అంటించే పిల్లలని ఏమనాలి?
అమ్మ లేకపోతే తాము బ్రతికి బట్టకట్టలేమని, కూడు, గూడు ఉండదని గ్రహించకుండా, అన్నంపెట్టి గౌరవంగా, ప్రేమతో చూసుకోవలసిన అమ్మ నెత్తిన నిప్పు పెట్టే మూర్ఖపు పిల్లలను ఏం చేయాలి? వారి అజ్ఞానాన్ని ఎలా దూరం చేయాలి?
కన్నతల్లిని చంపుకునే కసాయి కొడుకులకు ఏం శిక్ష వేయాలి?
-------------------------------------------------------సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే

సముద్రములను వస్త్రంగా ధరించి, కొండలు, పర్వతాలు, అడవులను శరీరభాగాలుగా కలిగిన విష్ణుమూర్తి భార్య అయిన ఓ భూదేవి, నీ మీద నా కాలు మోపుతున్నందుకు నన్ను క్షమించమ్మా అని అర్ధం. ఇది ప్రతి ఒక్కరు ఉదయం నిద్రలేవగానే మంచం మీది నుండి కాలు కింద పెట్టకముందు ఈ శ్లోకం చదివి, మంచం దిగి, భూమాతను చేతులతో తాకి, నమస్కరించాలి అని శాస్త్రం చెప్తోంది.  

మనము భూదేవిని అమ్మగా భావిస్తాం. శ్రీ విష్ణుభగవానుడి దశవతారాల్లో ఒకటైన వరహ అవతారం భూదేవి రక్షణకు వచ్చింది. ఆయన భార్యగా భూదేవిని ఆరాధిస్తాం.

కేవలం కాలు మోపినందుకే క్షమాపణ చెప్పమని మన ధర్మం చెప్పింది. కాని మనం నమస్కారం చెయ్యట్లేదు. అక్కడితో ఆగక మూర్ఖత్వంతో ఆమె నెత్తిన నిప్పుల కుంపటి పెట్టాం. అదే global warming, అంటే భూతాపం. ఇది భూమాతకు వచ్చిన జ్వరం. ఇప్పుడామే మంచం మీద ఉంది, ఆమెకు కీడు జరిగితే మొత్తం జీవరాశి మరణిస్తుంది.

--------------------------------------------------------------------------------

మానవుడు చేసే కాలుష్యం కారణంగా మన భూమి రోజురోజుకు వేడెక్కిపోతోంది. మొత్తం జీవరాశి ఉనికే ప్రశార్ధకంగా మారే పరిస్థితికి ఏర్పడుతోంది. 2100వ సంవత్సరానికి ఈ భూమి మీద జీవం ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తలా పాపం తిలా పిడికేడు అన్నట్టు ఈ భూతాపానికి అందరం కారకులమే.

అసలు ఈ భూతాపం (global warming) అంటే ఏంటి? భూమి ఎందుకు వేడెక్కుతోంది? దాని పర్యవసానాలు ఏంటి?

భూతాపం (global warming) అంటే భూవాతావరణం (earth's atmosphere) వేడిగా మారిపొవడం. మనం చలికాలంలో చలి నుండి తప్పించుకోవాలని, వెచ్చదనం కోసమని దుప్పటి / లేదా రగ్గు (బొంత అని కూడా అంటారు) కప్పుకుంటాం. 1 లేదా 2 కప్పుకుంటే వెచ్చగా ఉంటుంది. 3 లేదా 4 కప్పుకుంటెనో వెచ్చదనం ఎక్కువ అవుతుంది. 6 లేక 7 కప్పుకుంటే భరించలేము, చెమటలు పడతాయి. అదే 10 రగ్గులు కప్పుకుంటేనో ? ....... ఇంకేమైనా ఉందా?

భూవాతావరణం కూడా అంతే. మన వాతావరణంలో water vapourcarbon dioxidemethanenitrous oxide, ozone ఉంటాయి. వీటిని green house gases అంటారు. సూర్యుడి నుండి భూమికి వచ్చే సూర్యకిరణాల్లో వేడిని 50% భూమి గ్రహిస్తుంది (absorbtion). మిగితా వేడిని తిరిగి అంతరిక్షం (space) లోకి పంపుతుంది, అంటే reflect చేస్తుంది. వాతావరణంలో ఉన్న greenhouse వాయువులు (gases) ఈ వేడిని అంతరిక్షం (space) లోనికి వెళ్ళకుండా అడ్డుకుని, వాతావరణాన్ని వేడిగా ఉంచుతాయి, అంటే ఉష్ణొగ్రతను (temperature) పెంచుతాయి. Green house వాయువుల సహకారంతో భూమి మీద జీవరాశి (life) ఎంత ఉష్ణొగ్రత ఉంటే బ్రతుకగలవో,అంతే ఉష్ణొగ్రత  మాత్రమే భూమి మీద ఉండేలా చేస్తుంది ప్రకృతి. దీనినే green house effect అంటారు. మంచుయుగం (ice age) లో Green house వాయువులు అసలే లేవు. అందువల్లే అప్పుడు చాలా చల్లగా ఉండింది. ఇప్పుడు ఇవి ఉండడం వల్లే భూమి సగటుఉష్ణొగ్రత (average temperature) 14°C (57 °F)గా ఉంది. ఇవి కనుక లేకపొయి ఉంటే -19°C గా ఉండేది. అప్పుడు జీవం (life) ఉండేది కాదు. ఇవి ప్రకృతిలో సహజంగానే ఉంటాయి. ఎంత ఉంటే మన భూమికి మంచిదో అంతమాత్రమే ఉండేలా చేస్తుంది ప్రకృతి. కాని ఇవాళ అవి మనిషి దురాశ వల్ల, అతను చేసే కాలుష్యం (pollution) కారణంగా, Green house వాయువులు ఉండవలసిన సాంద్రత (density/concentration) కన్నాఎక్కువ అవ్వడం చేత అవి భూమి ఉష్ణోగ్రతను వీపరీతంగా పెంచేస్తున్నాయి. అందువల్ల భూగోళం వేడేక్కుతోంది. వాతావరణం (climate) లో ఎన్నడు లేని మార్పులు వస్తున్నాయి. అదే భూతాపం(global warming). ఇలా పెరిగితే 2100 సంవత్సరం కల్లా జీవం అంతరించిపోతుంది. మనిషి భూమి మీద నుంచి మాయమైపోతాడు.

అవి ఎంత శాతం పెరిగాయి? వాటికి కారణాలు ఏమిటి?

1750 నుండి 1850 మధ్య యూరపుదేశాల్లో పారిశ్రామిక విప్లవం (industrial revolution) ప్రారంభమైంది. అది జరిగిన తరువాత గాలిలో carbon-di-oxide 30%, nitrous oxide 15%, methane విషవాయువు 100% పెరిగాయి.

ఈ  1995లో 6.5 billion metric tonnes కు చేరుకున్నాయి. 2000 సంవత్సరం నాటికి 7.2 billion metric tonnes కు చేరుకున్నాయి. గత 15000 సంవత్సరాలుగా భూమి ఉష్ణోగ్రత 3.5°C  మాత్రమే పెరుగగా, గత 76-80 సంవత్సరాలలో ఒక్కసారి 15°C పెరిగింది. వచ్చే 45 సంవత్సరాల్లో ఇది ఇప్పుడు ఉన్నదానికంటే 7°C  లేక 8°C  పెరగగలదని శాస్త్రవేత్తల అంచనా.

1860 తో పోలిస్తే నేడు వాతావరణంలో carbon-di-oxide 30% అధికంగా ఉంది. రోజురోజుకు పెరుగుతున్న ఈ  greenhouse వాయువులు సూర్యుని నుండి వచ్చే రేడియేషన్ ను భూమివాతావరణంలోనికి ప్రవేశించేలా చేస్తూ, సూర్యుని వేడిని మరింతగా ఒడిసిపట్టి భూతాపానికి (global warming) కారణమవుతున్నాయి. గత 600సంవత్సరాలతో పోలిస్తే ఈ 100 సంవత్సరాలలో భూగోళం వేడెక్కడం ప్రారంభమైంది. ముఖ్యం గత 20 సంవత్సరాలలో ఇది మరీ ఎక్కువైంది.

ఇంకా వివరంగా చెప్పాలి అంటే పారిశ్రామికీకరణ (1750-1850) జరగక ముందు గాలిలో 280 parts per million by volume (ppmv) గా ఉన్నకార్బన్-డై-ఆక్సైడ్, 1900 నాటికి 299 ppmv కి, 2003  నాటికి 276 ppmv కి, ఈ నాటికి 380 ppmv కి చేరుకుంది. 2000 సంవత్సరం నుండి సంవత్సరానికి 1.9 ppm (rate of increase) చొప్పున పెరుగుతోంది. 21 వ శతాబ్దం చివరకు ఇది 490 ppmv నుండి 1260 ppmv కు పెరుగుతుంది. అంటే పారిశ్రామిక విప్లవం కంటే ముందు ఉన్న దానితో పోలిస్తే 75-350% పెరుగుతుందని శాస్త్రవేత్తల అంచనా.

ఈ రోజు వాతావరణంలో ఉన్న కార్బన్-డై-ఆక్సైడ్ గత 6,50,000 సంవత్సరాల ముందు భూమి పై ఉన్నకార్బన్-డై-ఆక్సైడ్ కేంద్రీకరణతో (concentration) పోలిస్తే  చాలా ఎక్కువైంది. 180 ppmv నుంచి 380 ppmv కు పెరిగింది.

ప్రపంచ ఉష్ణోగ్రతలు 19 వ శతాబ్దం చివరినుండి 0.74°C పెరగగా, గత 50 సంవత్సరాలుగా ప్రతి 10 సంవత్సరాలకు 0.13°C చొప్పున పెరిగాయి. అంటే గత శతాబ్దం (century) తో పోలిస్తే రెండింతలు.

సాధరణంగా ఉష్ణోగ్రతలో 0.1°C మార్పు జరిగితేనే వాతావరణంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. అటువంటిది 4°C ఉష్ణొగ్రత (earth's temperature)  పెరిగితే అది మహావినాశనానికి దారి తీస్తుంది. మనం కాలుష్యాన్ని ఆపకపోతే 2100 కల్లా అది 4°C పెరుగుతుంది.


భూతాపానికి కారణాలు ఏమిటి?

మొదటి కారణం పరిశ్రమలు (industries), విచ్చిలవిడిగా పారిశ్రామికీకరణ (industrialization). పరిశ్రమలనుండి హానికరమైన కార్బన్ మోనాక్సైడ్ (CO), కార్బన్-డై-ఆక్సైడ్ (CO2), nitrous oxide, methane, hydrofluro carbons, halogenated carbons వంటి వాయువులు వాతావరణంలోనికి వదలడం వలన green house వాయువులు ఇంకా ఇంకా ఉత్పత్తి జరిగి భూతాపానికి కారణమవుతున్నాయి. ముందుచూపు లేని కారణంగా, ప్రభుత్వాలకు లంచాల మీద ఉన్న శ్రద్ధ ప్రకృతివనరుల (natural resources) మీద లేని కారణంగా పరిశ్రమలు వాటి హానికర వ్యర్ధాలను చెరువుల్లోను, నదుల్లోను, సముద్రాల్లోనూ కలుపుతున్నాయి. అవి ఆ నీటి వనరులను కలుషితం చేసి, నీటి కాలుష్యాన్ని పెంచుతున్నాయి. అక్కడ నివసించే జీవజలం ఈ కాలుష్యం వలన మరణించి, మరింత కాలుష్యాన్ని చేస్తున్నాయి. ఇది నాణానికి(coin) ఒక వైపు. మరి రెండవ వైపు ఏమిటి?



ఈ నీటిని త్రాగిన జనం రోగాల బారిన పడుతున్నారు.వారి రోగాలకు వాడే మందుల తయారిలో కూడా అనేకానేక వాయువులు, విషపదార్ధాలు వెలువడతాయి. విషవాయువులు వాయుకాలుష్యాన్ని(air pollution) పెంచి భూతాపానికి కారణమైతాయి. విషపదార్ధాలను భూమిలోనికి పంపుతారు. ఫలితంగా భూగర్భజలాలు కలుషితమై భూమి కూడా కలుషితం అవుతోంది. వాటితో పండిన పంటల నుండి మానవుడు ఆహారం తీసుకోవడం ద్వారా అతని శరీరం కలుషితమై రోగాల బారిన పడుతున్నారు. మళ్ళీ అదే కధ మొదలువుతుంది.

అవి విడుదల చేసే పోగ కారణంగా స్థానికంగా ఉండే జీవరాశిపై తీవ్రప్రభావం చూపుతుంది. చెట్లు, పక్షులు, జంతువులు చనిపోతాయి. పరిశ్రమలు నుండి వెలువడే బూడిద (ash) ప్రజలకు శ్వాస సంబంధిత రోగాలను కలిగిస్తుంది. ప్రజలు అనారోగ్యాల బారిన పడతారు. ఇలా ఒక్క పరిశ్రమలే వాతావరణంపై తీవ్రప్రభావం చూపుతున్నాయి.

పరిశ్రమల కాకుండా మరొక ముఖ్యమైన కారణం శిలాజఇంధనాలను (fossil fuels) మండించడం. Thermal power stations లో బొగ్గును మండించి, కరెంటును ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో బొగ్గును మండించినప్పుడు అధికశాతంలో carbon-di-oxide వాతావరణంలోనికి విడుదల అవుతుంది. దానితో పాటు nitrous oxide, methane వంటి green house వాయువులు విడుదలవుతున్నాయి. భూతాపానికి కారణమవుతున్నాయి. వాహనాలు వంటివి కూడా green houseను విడుదలచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజు రోడ్ల మీదకు వచ్చే వాహనాలు వల్ల భూతాపం ఎక్కువ అవుతోంది.

మనం వాడే refrigeratorలు, A.C.లు, విద్యుత్ ఉపకరణాలు (electronic items), కార్బన్-డై-ఆక్సైడ్ ను, మరికొన్నిహానికారక వాయువులను విడుదల చేస్తున్నాయి. అడవుల నరికివేత (deforestation), చెట్లను నరకడం ఒక కారణం. చెట్లు తమలో carbonను దాచి ఉంచుకుంటాయి. వాటిని నరికి వేసినప్పుడు వాటిలో దాగి ఉన్న carbon వాతావరణంలో కలిసి వేడిని పెంచి భూతాపానికి కారణమవుతోంది. ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 34 మిల్లియన్ ఎకరాల అడవులను నరికి కాల్చి వేస్తున్నారు. తద్వారా విడుదలైన carbon భూతాపానికి కారణమయ్యే carbonలో 25%.

పెరుగుతున్న జనాభ (population) కూడా ఒక కారణం.మనం వదిలే carbon-di-oxide ను పీల్చుకునే అవకాశం లేకుండా చెట్లు నరికివేస్తున్నాం. అందువల్ల అది కూడా వాతవరణంలో కలిసి భూగోళం వేడెక్కడంలో తొడ్పడుతోంది.

అణువిద్యుత్ కేంద్రాల (nuclear power plants) నుండి విడుదలయ్యే అణువ్యర్ధాలు(nuclear waste), వాటి నుండి ఉత్పత్తి జరిగే అధికవేడి కూడా పుడమితల్లికి నిప్పు పెడుతున్నాయి.

అగ్నిపర్వతాలు (volcanoes) బద్దలైనప్పుడు అక్కడ విడుదలయ్యే వేడి,వాయువులు వంటివి కూడా global warming కి కారణమవుతున్నా, అది ప్రకృతిలో ఎప్పుడొ కొన్ని వందల ఏళ్ళకు ఒక్కసారి జరిగుతుంది. మూర్ఖమానవుడు చేసే దానితో పొల్చినప్పుడు, ఇది చాలా తక్కువ.

కరెంటు వస్తువులను వాడడం, కరెంటును అధికంగా వాడడం చేత వాటి నుండి carbon వెలువడుతుంది.

ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మన చేసే చాలా పనులు భూతాపానికి కారణమవుతున్నాయి.అలా అని ఆయా వస్తువులను వాడకుండా ఉండమని కాదు, పర్యావరణానికి హాని కలిగించని రీతిలో వాటిని తయారు చేయాలి. కాస్త జాగ్రత్తగా, అవసరమైనంత వరకే వాడాలి.

ఇవే కాక భూతాపానికి అతి ముఖ్యమైన కారణాలలో ఒకటి మాంసాహారం తినడమని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. జనం మాంసాహారం తినడం కనుక మానేస్తే, జరిగే నష్టాన్ని సగం వరకు తగ్గించవచ్చని చెప్తున్నారు. ఈ విషయం మీద ప్రముఖ ఉద్యమకారుడు, శాస్త్రవేత్త, రాష్ట్రబంధు స్వర్గీయ శ్రీ రాజీవ్ దీక్షిత్ గారి ప్రసంగం ఈ వీడియోలో వినండి.


భూతాపం వల్లే కలిగే అనర్ధాలు ఏమిటి?
(effects of global warming)

భూమి వేడెక్కడం చేత ధృవపు ప్రాంతాల్లో(polar region) ఉన్న మంచు కరిగిపోతోంది. మంచు కరిగి ఆ నీరు సముద్రంలో చేరడం వల్ల సముద్రం మట్టం (sea level) పెరుగుతోంది.

మొత్తం 57,73,000 cubic miles నీరు ice-caps, galciers, మంచుకొండల్లోనూ ఉంది. Glaciers కరిగితే కనుక ప్రపంచంవ్యాప్తంగా 230 అడుగుల (feet) మేర సముద్రమట్టం పెరుగుతుంది. అంటే ప్రపంచవ్యాప్తంగానున్న పెద్ద పెద్ద నగరాలు, దేశాలు, ద్వీపాలు (islands) సముద్ర గర్భంలో కలిసిపోతాయి.

ప్రపంచవ్యాప్తంగా తీరప్రాంతం నుండి 100 కిలోమీటర్ల దూరంవరకు గల ప్రాంతంలో 40% జనాభ (population) నివసిస్తున్నారు. సముద్రమట్టం పెరిగితే వీరంతా దిక్కులేనివారైపోతారు. అతలాకుతలమైపోతారు. ఆహారం దొరకక అలమటిస్తారు.

ఒక్క మీటరు సముద్రమట్టం పెరిగితేనే బంగ్లాదేశ్ లో 25-35 మిల్లియన్ల జనాభ నివాసం, ఆహారం కోల్పోతారాని అంచనా. ఇంకా ఎక్కువ పెరిగితే మాల్దివులు (Maldives), బంగ్లాదేశ్ వంటి అనేక దేశాలు పూర్తిగా కనుమరుగవుతాయి.

 భారత్ తన స్వరూపాన్ని కోల్పోతుంది. Glaciers, Himalayas మీద ఆధారపడిన అనేక నదులు ఎండిపోతాయి. ఫలితంగా ఎప్పుడు చూడనటువంటి భయంకరమైన కరువు సంభవిస్తుంది.

అంటార్టికా (Antarctica) ప్రాంతంలో ఉండే ధృవపు ఎలుగుబంట్ల (polar bears) జాతి ఈ భూమి మీది నుండి పూర్తిగా అంతరించిపోతుంది.

ఇంకా చాలా భయంకరమైన అనర్ధాలు పొంచున్నాయి.

భూతాపం (global warming) వలన కలిగే అనర్ధాలు ఏమిటి?

కరుగుతున్నice caps  ప్రపంచ జీవావరణవ్యవస్థను(ecology) అస్తవ్యస్తం చేస్తాయి. Icebergs లో మంచినీరే ఉంటుంది. ఇవి కరిగి సముద్రంలో కలిసినప్పుడు సముద్రనీటిలో ఉన్నలవణత (salinity) తగ్గిపోతుంది. అంటే నీటిలో ఉప్పు శాతం తగ్గిపోతుంది. ఫలితంగా సముద్రపు నీటి ఉష్ణొగ్రత (temperature) పెరుగుతుంది. అనగా కడలి వేడెక్కుతోంది.

భూఉపరితలంలో 70శాతం సముద్రాలే కాని 95% జీవరాశి కి ఆవాసం. సముద్రాలు కర్బనాన్ని(carbon) ఒడిసిపట్టే అతి పెద్ద రిజర్వాయర్లు. గత 250 సంవత్సరాలుగా మానవులు విడుదల చేసిన carbon-di-oxide లో 3వ వంతును సముద్రాలే గ్రహించాయి. 350 బిల్లియన్ టన్నుల (350 billion tonnes) తమలో దాచుకోని మనకు సాయం చేశాయి. 1960లో అవి మన చర్యలవల్ల  విడుదలైన 2.4 బిల్లియన్ టన్నుల carbon గ్రహించగా, 2010 నాటికి 5 బిల్లియన్ టన్నుల carbon గ్రహించాయి. అటువంటి సాగరం ముప్పులో పడింది.

ప్రాణవాయువును (oxygen) జీవారాశికి అందించడంలో సాగరం కీలక పాత్ర పోషిస్తోంది. మనం పీల్చే ప్రాణవాయువులో 50% సముద్రాల చలువే. భూఉపరితలం (earth's crust/land) పై ఉష్ణొగ్రతలు సముద్రం మీద ఆధరపడి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సముద్రాలే ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. సముద్రం వేడెక్కడం వలన ఉష్ణొగ్రత్లలో మార్పు వస్తుంది. ఇప్పటికే బాగా మార్పు వచ్చింది. భవిష్యత్తులో ఇంకా వస్తుందన్నది యదార్ధం.

సముద్రం వేడెక్కడం వలన వాటికి కర్బనాన్ని (carbon) దాచి ఉంచుకొనే శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా  వాతావరణంలో ఉన్నcarbon-di-oxide కు తోడుగా వాటిలో దాగి ఉన్న carbon-di-oxide విడుదలవతుంది. అంటే భూతాపం ఇంకా పెరుగుతుంది. వాటిలో ఉన్న జీవరాశి చనిపోతుంది. వాటినుండి విడుదలయ్యే ప్రాణవాయువు తగ్గిపోతుంది.

ప్రపంచజనాభలో 50% అవాసం కొల్పోతారు. 300 కోట్ల మంది జీవనోపాధి కోల్పోతారు.

భూతాపం కారణంగా వచ్చే 100 ఏళ్ళలో సరాసరిన 9-88 సెంటిమీటర్ల మేర సముద్రమట్టాలు పెరుగుతాయి. ఫలితంగా తీరప్రాంతాల ముంపు, మడ అడవులు, చిత్తడినేలలు కనుమరుగవుతాయి. తీరప్రాంతాలు కోతకు గురవుతాయి. ఉప్పునీరు వచ్చి మంచినీటిని, వ్యవసాయాన్ని(agriculture) దెబ్బతీస్తుంది. వ్యవసాయం దెబ్బతింటే కరువు వచ్చి జనం ఆకలి చావులు చస్తారు.

Ice-capsకు, అగ్నిపర్వతాలకు, భూకంపాలకు, సముద్రాలకు చాలా సంబంధం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. Ice caps కరగడం మొదలైతే కొన్ని వందలవేల ఏళ్ళుగా తమలో బడబాగ్ని(lava) ని దాచి ఉంచుకొన్న అగ్నిపర్వతాల (volcanoes) మీద ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా అవి బడబాగ్ని(lava) ని బయటకు కక్కుతాయి, అంటే బద్దలవుతాయి. అలాగే ice-caps కరిపోవడం చేత భూకంపాలు చాలా తరుచుగా సంభవిస్తాయి. ఎప్పుడొ వచ్చే ఉప్పెనలు (tsunamis) ఎప్పుడు పడితే అప్పుడు విరుచుకుపడతాయి. భారత్ లాంటి దేశాల మీద అవి చాలా ప్రభావం చూపిస్తాయి. అమెరికా వంటి దేశాల్లో చాలా తరుచుగా మహాభయంకరమైన hurricanes ఏర్పడి అతలకుతమవుతాయి. ఈ hurricanes ప్రభావం 2004, 2005 సంవత్సరాలలోనే ప్రపంచానికి స్పష్టంగా కనిపించింది. ఇవన్ని గొలుసుకట్టు చర్య (chain reaction) లాగా ఒకటి తరువాత ఒకటి చాలా వేగంగా జరిగిపోతాయి.

అర్కిటిక్ (arctic) ప్రాంతంలో  ఈ వాతావరణ మార్పును (climate change) తట్టుకునే అతి కొద్ది జీవాలు తప్ప మిగితా జీవరాశి అంతా మరణిస్తుంది.

Ice caps, Ice bergs తెల్లటి రంగులో ఉండడం చేత అవి సూర్యకిరణాలను పరావర్తనం (reflection) చెందించి భూమిని చల్లగా ఉంచుతున్నాయి (because of their white color,ice caps reflect sun rays into space,there by keeping earth cool). Ice-caps,glaciers కరిగిపోతే ఇక మిగిలేది సముద్రాలే. అవి dark color లో ఉండడం వలన సూర్యకిరణల నుండి వచ్చే వేడిని మరింతగా గ్రహించి భూగోళాన్ని మరింత వేడిక్కిస్తాయి.

ఒక్క గ్రీన్ ల్యాండ్ లోనే 2,850,000 క్యూబిక్ కిలోమీటర్ల పైగా మంచు ఉందని అంచనా. ఆ మంచుకరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు 70 మీటర్ల ఎత్తు పెరుగుతాయి. అక్కడ ఉన్న మంచు చాలా వేగంగా కరుగడం మొదలైపోయింది. గత శతాబ్దం లో లో 9°C వరకు ఉష్ణొగ్రత పెరిగింది. కొన్ని వందల వేల సంవత్సరాలకు జరగవలసిన ఈ పరిణామం చాలా తొందరగా జరగడంతో శాస్త్రవేత్తలు ఆందోళనతో పాటు ఆశ్చర్యపడ్డారు. ఇప్పటికే అక్కడ 40% మంచు కరిగిపోయిందని నాసా (NASA) వాళ్ళు తేల్చారు.

వేడెక్కిన సముద్రాల నుండి వేడిగాలులు భూఉపరితలం మీదకు వీస్తాయి. అందువల్ల ఏమి జరుగుతుంది ??? భూగోళం వేడక్కడం వలన కలిగే పర్యవసానాలేమిటి?

వేడెక్కిన సముద్రం నుండి భూఉపరితలం మీదకు వేడిగాలులు / వడగాలులు (heat waves) వీస్తాయి. భూమిపై ఉష్ణొగ్రత పెరుగుతుంది.

పెరిగిన green house gases వలన భూతాపం పెరుగుతుందని చదివాం కదా. ఇది అతివృష్టికి, అనావృష్టికి దారి తీస్తుంది. వర్షాలు బాగా పడే ప్రాంతాల్లో మరింత అధిక వర్షపాతం నమోదవుతుంది. కరువు ప్రాంతాల్లో వానజాడ లేకుండాపోతుంది. పంటలు నాశనమవుతాయి. చాలా ప్రాంతాలు ఎడారిగా మారుతాయి. అధికవర్షపాతం వలన నదులకు వరదలు సంభవిస్తాయి. మంచుకరిగిపోవడం వలన glaciers నుండి ఉధ్భవించే నదులకు మొదట వరదలు సంభవించి, తరువాత అవి పిల్లకాలువలా మారిపోతాయి. కొన్ని నదులు పూర్తిగా ఎండిపోతాయి. 

ఆంధ్రప్రదేశ్, బంగ్లాదేశ్ తీరంలో తరుచూ సంభవించే తుఫానులు, మొజాంబిక్ అమెరికా లోని కాలిఫోర్నియాలో ఏర్పడిన అనావృష్టి దీని ప్రభావమే. మనకు తెలుసు మన రాష్ట్రంలో తరుచూ సంభవించే తుఫానుల వల్ల ఎంత నష్టం జరుగుతోందో.     

ఏడాదిలో ఎండాకాలానికి, మిగితా కాలాలకు మధ్య వత్యాసం తగ్గిపోతుంది. అన్ని కాలాల్లోనూ వాతావరణం వేడిగానే ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతాయి. మీరు నమ్ముతారా? మనకు ఏప్రిల్, మే నెలలో ఎండాకాలంలో మధ్యాహ్నం ఉండే ఎండ వేడి, చలికాలంలో సూర్యోదయం సమయానికే వస్తుందని చెప్తున్నారు. అంటే ఇక మనం ఎలా బ్రతుకుతకగలమో ఆలోచించండి.

భూగర్భ జాలాలు (under-ground water) అడుగంటిపోతాయి. వాతావరణంలో తేమ (moisture) అధికమవుతుంది. పెరిగిన ఉష్ణోగ్రతలు కారణంగా కొత్త కొత్త క్రిములు (bacteria/virus) పుడతాయి. రకరాకాల రోగాలు వస్తాయి. మలేరియా, డయేరియా, కలరా వంటి వ్యాధులు ప్రపంచాన్ని పట్టి పీడిస్తాయి. ఇప్పుడు వచ్చిన డెంగ్యూ (dengue) వ్యాధి కూడా భూ ఉష్ణోగ్రతల పెరగడం వలన పుట్టిన సూక్షక్రిమి సంభవించింది.

పగటి ఉష్ణోగ్రతలకు (temperatures), రాత్రి ఉష్ణోగ్రతలకు మధ్య తేడా తగ్గిపోతుంది. "చల్లని రాత్రి"అన్నది ఒక ఆశగా, ఒక కలగా, కేవలం కధగా మిగిలిపోతుంది.

ఋతుచక్రం (season) పూర్తిగా గాడితప్పుతుంది. అకాలంలో వర్షాలు పడడం, ఎండలు మండిపోవడం వంటివి సాధరణం అవుతాయి.

తరుచువీచే వేడిగాలులకు నిప్పు అంటుకుని కొన్నివేల కిలోమీటరల అడవులు తగలబడతాయి. ఫలితంగా అధికంగా carbon-di-oxide వాతావరణంలోనికి విడుదలవుతుంది. కొద్దికాలం క్రితమే రష్యాలో forest-fires ప్రభావం కనిపించింది.

జంతువులు, పక్షులు తమ స్వభావాలను మార్చుకుంటాయి.మనుష్యులు మీద దాడి చేస్తాయి. ఒక ప్రాంతపు జంతువులు, ఆహారం కోసం, జీవనం కోసం మరొక ప్రాంతానికి తరలివెళ్ళడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉండే జీవవైవిధ్యం (bio-diversity) దెబ్బ తింటుంది.

ఆఫ్రికా ఖండంలో (africa continent) భయంకరమైన కరువు వస్తుంది. ప్రజలు ఆహారం కోసం యుద్ధాలు చేస్తారు.ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళి ఆహారం కోసం, నివాసం కోసం అక్కడి ప్రజలతో పోరాటం చేస్తారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాలు స్మశాన భూములుగా మారుతాయి.

వ్యవసాయం దెబ్బతినడం వలన, రకరకాల ప్రకృతి ఉత్పాతాల వలన ప్రపంచ ఆర్థికవ్యవస్థ (economy) అతలాకుతలం అవుతుంది. కోట్లమంది ప్రజలు ఆకలితో హాహాకారాలు చేస్తారు. వాతావరణ కాలుష్యం పెరగడం వలన నగరాలంతట దుమ్ముతోనూ, పొగతోను నిండిపోతాయి. ప్రజలు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది పిడిగుపాట్లు 100% పెరుగుతాయి. పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా 12 భయంకరమైన వ్యాధులు ప్రపంచాన్ని పట్టిపీడిస్తాయి.

ఇవన్నీ నేను చెప్తున్నవి కావు, ఎందరో శాస్త్రవేత్తలు,ఐక్యరాజ్య సమితి వంటి దృవీకరించినవి. ఇంకా భయంకరమైన నిజాలు తెలిసినా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు, ప్రజలకు నిజాలు తెలియనివ్వట్లేదు.

భూతాపం-భారతదేశం
పెరుగుతున్న భూతాపం వలన మనకు ఏం నష్టం అంటారా?

మీకు తెలుసా భుతాపం వలన వేదభూమి, యోగ భూమి, కర్మభూమి, జ్ఞానభూమి అని ప్రపంచమంతా చెప్పుకుంటున్న భరతఖండం తన నిజస్వరూపాన్ని కోల్పోతుంది.



"హిమాలయస్య సమారంభ్యా యావదిందు సరోవరం

 తత్ర దేవనిర్మితం దేశం హిందూస్థానం ప్రశ్యస్తయత్" అంటే హిమాలయం మొదలుకొని, హిందూమహాసముద్రం (Indian ocean) అంతా వ్యాపించిన ఈ భరతఖండం దేవతల చేత నిర్మింపబడింది. అటువంటి గొప్ప దేశం, పెరుగుతున్న భూతాపాన్ని తట్టుకోలేకపొతోందని చాలా నివేదికల్లో ఎందరో పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



భూతాపాన్ని పెంచడంలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. కేవలం 5% జనాభ కలిగిన అమెరికా భూతాపానికి కారణమయ్యే carbon-di-oxideలో తన వాటా 23%. మిగితా 34 పాశ్చాత్యదేశాలు (western countries) కలిసి 75% విషవాయువులను విడుదలచేస్తున్నాయి. నిజానికి ఈ పాపంలో భారతదేశం వాటా చాలా తక్కువ, దానికి కారణం మన జీవన విధానం, జీవినవిధానానికి మూలమైన భారతీయ సంస్కృతి. కాని పెరుగుతున్న భూతాపం వలన అధికంగా నష్టపోయేది మాత్రం భారతదేశమే అంటే మీరు నమ్ముతారా?......

అవునని అంటున్నారు శాస్త్రవేత్తలు.

భారతదేశనికి 7517 కిలోమీటరల తీరరేఖ / తీరప్రాంతం ఉంది. 25% జనాభ తీరప్రాతంలో నివసిస్తున్నారు. ప్రతి ఏటా సముద్రమట్టం 2.4 మిల్లిమీటర్లు పెరుగుతోంది. ఇది 2050 నాటికి 38 సెంటీమీటర్లు పెరుగుతుంది. దీని వలన కొన్ని వేలమంది నిరాశ్రయులవుతారు. ఈ శతాబ్దం చివరికి ముంబాయి, చెన్నై, కలకత్త, మచిలీపట్నం (ఆంధ్రప్రదేశ్), విశాఖపట్టణం (ఆంధ్రప్రదేశ్) వంటి అనేక ముఖ్యమైన నగారాలు జలసమాధి అవుతాయి. అంటే సముద్రంలో కలిసిపోతాయి. ఇవే కాదు తీరం వెంబడి విస్తరించిన అనేకానేక చిన్నపట్టణాలు, గ్రామాలను సముద్రం ముంచివేస్తుంది. అంటే దాదాపు 30.25% జనాభ నివాసం కోల్పోతారు.

ప్రపంచదేశాల్లో భారత్ కు తనదైన స్థానం ఉంది. ప్రపంచంలో 6వ వంతు జనాభాకు నివాసం. ప్రపంచంలో మరెక్కడలేని వాతావరణపరిస్థితులు మన దేశంలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక, అత్యల్ప వర్షపాతాలు నమోదయ్యే ప్రాంతాలు ఇక్కడే ఉన్నాయి. ఒకవైపు హిమాలయాలు ఉంటే మరొక వైపు ఏడారి (desert) ఉంది. భారత్ అనగానే మనకు గుర్తుకువచ్చేది పల్లెలు (villages), అక్కడి వాతావరణం, వ్యవసాయం (agriculture). మనదేశం, మన ఆర్థిక వ్యవస్థ (economy) పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డాయి. వ్యవసాయం ఋతుపవనాలు(monsoons), నదుల మీద ఆధారపడి కొనసాగుంతోంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, భూతాపం వలన ఋతుపవనాల మీద తీవ్రప్రభావం చూపుతాయి. సమయానికి ఋతుపవనాలు రాకపోవడం, అకాల వర్షాలు, తరుచు తుఫాన్లు సంభవించడం, పంటపొలాలకు క్రొత్త క్రొత్త పురుగు, చీడ వంటివి రావడం వంటివి అనేక ప్రకృతి భీభత్సాలు మన దేశంలో చోటు చేసుకుంటాయి. అంటే మన వ్యవసాయం నాశనమవుతుంది. వర్షాలు తగ్గిపోవడం వలన వర్షాల మీద ఆధారపడ్డ నదులు పూర్తిగా ఎండిపోతాయి. ప్రజలకు త్రాగునీరు, పంటపొలాలకు నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నీటి యుద్ధాలు మొదలవుతాయి. ఈ నదుల నీటి మీద ఆధారపడి నడుస్తున్న పరిశ్రమలు శాశ్వతంగా మూతపడతాయి. అంటే ఇప్పటికే మనలను పట్టి పీడిస్తున్న నిరుద్యోగం సమస్య మరింత పెరుగుతుంది.
ఈ దేశంలో వ్యవసాయం మీద అధికశాతం మేర ఆధారపడింది పేదప్రజలే. వారికి ప్రకృతికి చాలా దగ్గరి సంబంధం ఉంది. ప్రకృతి నాశనమయితే పేదరికం పెరుగుతుంది. దానికితోడు వ్యవసాయం రంగం దెబ్బతినడం వలన దాని మీద ఆధారపడ్డవారు మరింత పేదవారిగా మరుతారు. ఇప్పటికే భారత్ లో పేదరికం 40% వరకు ఉందని అంచనా. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. 125 కోట్ల జనాభకు ఆహరం అందించడం గగనమవుతుంది.

భారతీయ సంస్కృతిలో గంగానదికి విశేషస్థానం ఉంది. "గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి" అంటూ ప్రతిపూజలో ఈ నదులను ఆవాహన చేస్తాం, పూజిస్తాం, వాటికి హారతులిస్తాం. ఇప్పటికే ప్రకృతిలో కలిగిన మార్పులవల్ల సరస్వతి నది అంతర్వాహినిగా మారింది. పెరుగుతున్న భూతాపం హిమాలయాల నుండి పుట్టిన గంగా, యమున, సింధు నదుల మీద, దక్షిణభారతంలో అన్నినదుల మీద తీవ్రప్రభావం చూపుతుంది.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హిమాలయాలలో ఉన్న మంచు కరిగిపోతోంది. ఇక్కడున్నglaciers నుండే ఉత్తరభారతానికి నీటిని అందించి నదులు పుడుతున్నాయి. ఇవి గతంలోకంటే చాలా త్వరగా కరుగుతున్నాయి. ఎక్కువగా కరగి సముద్రంలో చేరుతున్న నీరు భవిష్యత్తులో తీర ప్రాంతాలకు పెద్ద ముప్పుగా పరిణమించబోతోందని IPCC (Inter governmental panel on climate change) తన తుదు నివేదిక (final report) లో పేర్కొంది. ఫలితంగా 2080 నాటికి లక్షల జనాభ నిరాశ్రయులవుతారు. 

ఇక గంగా విషయానికి వద్దాం. గంగా గంగోత్రి glacier నుండి మొదలవుతుంది. అటువంటి గంగోత్రి glacier గత 30 సంవత్సరాలలో చాలావేగంగా కరిపోతోంది. దీని కారణంగా 2050-2070 నాటికి గంగా నది నీటిమట్టం విపరీతంగా పెరుగుతుంది. భారీగా వరద సంభవించి చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాల్లో ఏనలేని నష్టం సంభవిస్తుంది. 

ఇది ఒక్కటేనా అంటే కాదు మరొక విపత్తు కూడా పొంచి ఉందని ఆ నివేదిక మొత్తుకుంది.హిమాలయాల్లో ఉన్న మంచు పూర్తిగా కరిగి అవి మట్టి కొండలుగా మారుతాయి. ఫలితంగా 2070 నాటికి గంగా శాశ్వతంగా ఏండిపోవడం అంటే శాశ్వతంగా కనుమరిగవ్వడం, లేదా చిన్న పిల్ల కాలువలా మారిపోవడం జరుగుతుంది. ఆకాశం నుండి భగీరథుని తపస్సు వలన భూమికి వచ్చిన దేవగంగ, ఆకాశ గంగ మనం చేస్తున్న భూతాపం వలన ఏండిపోతుంది .గంగా లేని భారతీయ సంస్కృతి మీరు ఊహించగలరా? తన ప్రవాహాంలో మునిగిన ఎంతో మంది పాపాలను కడిగేసే ఆ గంగా ప్రవాహం తగ్గిపోయి ఇసుకదిబ్బలుగా మారే పరిస్థితి వస్తే అప్పుడు మనం మేల్కొని ప్రయోజనం ఏమిటి? గంగ ప్రత్యేకత ఏంటి? ఈ లింక్‌లో చూడండి - పావనగంగా రహస్యాలు

గంగను కాపాడాలి అంటే భూతాపాన్ని అరికట్టాలి. అందుకోసం అందరిని జాగృత పరచాలి. రండి గంగను, భూగోళాన్ని కాపాడుకుందాం.          


ప్రపంచంలో ఉన్న ఏ దేశస్థులైనా, వారికి వారి దేశానికి తరతరాల వారసత్వ అనుబంధం లేదు, ఒక్క భారతీయులకు, భారతదేశానికి మాత్రమే ఉంది అటువంటి బంధం. మన తాతలు, ముత్తాతలు, వారి ముత్తాతలు అందరూ ఇక్కడే పుట్టారు, ఈ మట్టిలోనే కలిసిపోయారు. ఉదహరణకు అమెరికాను చూస్తే, అక్కడ నివసిస్తున్న అధికశాతం జనాభ ప్రపంచంలో వివిధప్రాంతాల నుండి అక్కడకు వెళ్ళి స్థిరపడినవారే. కాని భారత్ విషయంలో అలా కాదు. ఈ దేశంలో పుట్టినవాడు హిందువైనా, ముస్లిమైనా, సిక్కైనా అతడి పూర్వీకులు కూడా భారతీయులే. ఈ భూమి మనది, మన అందరిది. ఈ భరతఖండం మన తల్లి. అటువంటి భరతభూమిని భారతీయులు శాశ్వతంగా వదిలివేళ్ళే పరిస్థితి వస్తే? .......... ఎప్పుడైన అలా ఆలోచించారా? భూతాపం పెరిగితే అదే జరుగుతుందని మీకు తెలుసా?

గంగానది మీద ఆధారపడి ఈ దేశంలో 50 కోట్లమంది జీవనం సాగిస్తునారు. గంగా 11 రాష్ట్రాలకు, 40% జనాభకు నీరు అందిస్తోంది. గంగా-బ్రహ్మపుత్ర నదులు 10,86,000 చరపు కిలోమీటర్ల ఆయకట్టుకు నీరు అందిస్తున్నాయి. యమున, సింధు వంటి అనేక నదులు కూడా ఈ దేశంలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయి. అటువంటి గంగా 2030 నాటి హిమాలయాలు కరిగి, పిల్ల కాలువలా మారుతుందని, ఋతుపవనాల మీద ఆధారపడే పరిస్థితి వస్తుందని తాజాగా విడుదలైన UN Climate Change Report చెప్తోంది. ఇక మిగితా నదుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటితో పాటు ఇదే సమయానికి దక్షిణ భారతంలో నదులు ఋతుపవనాలు సరిగ్గా రాక అడుగంటిపోతాయి. ఫలితంగా ఈ దేశంలో వ్యవసాయం పూర్తిగా నాశనమవుతుంది, పరిశ్రమలు మూతపడతాయి. ఎందరో ఆకలి చావులు చస్తారు. తినడానికి మెతుకు ఉండదు, త్రాగడానికి చుక్క నీరు ఉండదు. ఇక 2050-2070 నాటికి భారతీయులు జీవనం కోసం భారతదేశాన్ని విడిచివెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయని, వారు కూలి పని చేసుకోవడానికి, పొట్ట చేతపట్టుకుని, మూట సర్దుకుని యూరపు దేశాల వైపు పయనం సాగించవలసిన సందర్భం ఏర్పడుతుంది అని నివేదికలు ఘోషిస్తున్నాయి.    
కొన్ని వందల సంవత్సరాలుగా ఎందరికో అన్నం పెట్టిన భరతమాత తన బిడ్డల కడుపు నింపలేని పరిస్థితి భూతాపం పెరగడం వలన ఏర్పడుతుంది. అన్నపూర్ణగా పిలువబడుతున్న భరతవర్షం ఒక స్మశానంగా మారిపోతుందంటే మన వాళ్ళకు రవ్వంతైన భాధ కలగట్లేదా? ఎందరో దీనార్తులకు ఆశ్రయం కల్పించిన భారతప్రజలు, ధీనంగా ఇతర దేశాల్లో బిక్షమెత్తుకునే పరిస్థితి వస్తుందంటే మనం చూస్తూ ఊరుకోవాలా? 150 సంవత్సరాల స్వాత్యంత్ర పోరాటంలో ఎందరో స్వాత్యంత్ర సమరయోధుల త్యాగఫలితం మూణాల్ల ముచ్చటవుతుందన్నా మనకు సంబంధం లేని విషయంగా ఎందుకు భావిస్తున్నాం ?

ఈ దేశం వదిలివెళ్ళవలసిన పరిస్థితి రాకుండా మనం అడ్డుకోవాలి. రండి భూతాపాన్ని అరికడుదాం. భారతదేశాన్ని కాపాడుకుందాం.

ఇక భూతాపం వలన మన దేశంలో ఏ ఏ ప్రాంతాలకు ముప్పో చెప్పుకుందాం.

బెంగాల్ ప్రమాదపుటంచున ఉంది.
భూతాపం(global warming) కారణంగా హిమాలయాలు అతివేగంగా కరుగుతున్నాయి. 1971లో ఏటా 19 మీటర్లమేర కరిగేవి, ఇప్పుడు 34 మీటర్ల మేర కరిగుతున్నాయి. ఇవి కరగడం వలన దేశంలో ఉష్ణోగ్రతలు, సముద్రమట్టం విపరీతంగా పెరిగి sundar bans ను ముంచివేస్తాయి. అక్కడ అడవుల్లోనే పులులు సంచరిస్తూ ఉంటాయి. ఇప్పటికే sundar banలలో 2 ద్వీపాలు నీట మునిగాయి. సమీప భవిష్యత్తులో 102 ద్వీపాలను (islands) మునిగిపోతాయట. బెంగాల్ (వంగ దేశం) ప్రమాదంలో పడుతుంది.

మన దేశంలో సముద్రమట్టం 1మీటరు పెరిగితే 70 లక్షల మంది ప్రత్యక్షంగా నిరాశ్రయులవుతారు. 5,764 కిలోమీటర్ల తీరప్రాంత భూమి, 4,200 కిలోమీటర్ల రోడ్ల వ్యవస్థ నాశనమవుతాయి.

కళింగ దేశం (ఓడిషా రాష్ట్రం) లో కేంద్రపుర జిల్లా మొత్తం సముద్రంలో కలిసిపోతుంది. అనేకానేక పల్లెలు నీట మునుగుతాయి. నిజానికి పల్లే ప్రజలు ప్రకృతితో మమేకమై జీవనం సాగిస్తున్నా, మిగితా జనం చేసిన పాపానికి వారు ఫలితం అనుభవిస్తున్నారు.

బంగాళఖాతం తీరంలో ఉన్న అన్ని రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతింటాయి. తరుచుగా తుఫాన్లు సంభవిస్తాయి. బంగ్లాదేశ్ ప్రపంచ పటం నుండి పూర్తిగా కనుమరుగైనా ఆశ్చర్యపడనవసరం లేదు.

మచిలిపట్నం, విశాఖపట్టణం, కృష్ణపట్నం, చెన్నై అదృశ్యమవుతాయి, సాగరగర్భంలో కలిసిపోతాయి.


మీకు ఇంకో విషయం తెలుసా? 2010లో భూతాపానికి సంబంధించి ఒక నివేదిక విడుదలైంది. 2010-2020 మధ్య మనం భూతాపాన్ని అరికట్టడానికి, మరింత పెరగకుండా ఉండడానికి చర్యలు చేపడితేనే ఈ భూగోళం మిగులుతుంది. అలసత్వం వహిస్తే ఇక జరగబోయే వినాశనాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. 2100 కి ఈ భూమి మీద మానవజాతి బ్రతకలేని పరిస్థితి వస్తుందని ఆ నివేదిక సారాంశం. ఈ వార్త అన్ని టి.వి.చానెళ్ళలో చాలా రోజుల పాటు వచ్చింది. మన భూమిని కాపాడుకోవడానికి ఇంక కేవలం 5 ఏళ్ళ సమయం మాత్రమే మిగిలి ఉంది. నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైన మేల్కొందాం.మన ప్రయత్నం మనం చేద్దాం.    

"పంజాబ సింధు గుజరాత మరఠా ద్రావిడ ఉత్కల వంగా,వింధ్య హిమాచల యమున గంగా ఉత్కల జలధితరంగా" అంటూ మనం పాడే జాతీయగీతంలో ఉన్న పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళ్ నాడు, బెంగాల్ తమ స్వరూపాన్ని కోల్పోతుంటే దేశభక్తి గుర్తుకురావట్లేదా? జలతరంగాలతో ప్రవహించే గంగా, యమునల్లో నీరే లేని పరిస్థితి ఏర్పడుతున్నా, హిమాలయాల్లో హిమం(మంచు) కరిగుతున్నా భారతీయుల హృదయం కరగట్లేదా?

మన దేశభక్తిని నిరూపించుకుందాం. స్వాత్యంత్ర సంగ్రామంలో పాల్గొనలేదన్న భాధ యువతకు అవసరంలేదు. భారతదేశాన్ని భూతాపం అనే రాకాసి విషకోరల నుండి విముక్తి చేయడానికి యువత ముందుకు రావాలి. ఈ దేశం మనది. భవిష్యత్తు మనది. రండి కాపాడుకుందాం భారతావనిని, ప్రపంచాన్ని.

జరిగే వినాశనం ముందు ఇవి చిన్నవే అయినా ఏవో కొన్ని. భూతాపాన్ని నివారించడానికి చిన్న చిన్న మార్గాలు. http://ecoganesha.blogspot.in/2013/04/blog-post_22.html

Originally published: 3 December 2012
1st Edit: 21 April 2015

1 comment:

  1. మా గొప్పగా చెప్పారు..

    ReplyDelete