Thursday 30 April 2015

చరిత్రకు నోచుకోని విచిత్ర యుగం!

పురాతత్వశాఖ వారి తవ్వకాలలో బయటపడుతున్న మహా విషయాలకు సముచిత ప్రచారం లేదు. మూఢ విశ్వాసాలను వదిలించుకోవాలన్న ప్రచారం జరుగుతున్న సమయంలోనే మూఢ విశ్వాసాలు మన నెత్తికెక్కి కూర్చుని ఉండడం విచిత్రమైన వర్తమానం. ఈ మూఢ విశ్వాసాలు మన విద్యారంగాన్ని రెండువందలు ఏళ్లకు పైగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ మూఢ విశ్వాసాలు విదేశీ దురాక్రమణదారుల వారసత్వ శకలాలు. ఒక్కొక్క ‘శకలం’ సకలంగా మారి మన జీవన రంగాలను ముక్కలు ముక్కలుగా మార్చివేస్తున్నాయి. మన వ్యవహారంలో, విజ్ఞానంలో సమన్వయం, సమగ్రత్వం లోపించడానికి హేతునిబద్ధత అడుగంటి పోవడానికి ఇలా ‘శకలం’ సకలమై కూర్చుని ఉండడం ప్రధాన కారణం. శకలాలను మళ్లీ ఒకటిగా కూర్చి సకలత్వాన్ని సాధించడానికి ఇప్పుడైనా కృషిజరగాలి. విద్యాప్రణాళికలలో, పాఠ్యపుస్తకాలలో, భాషాస్వరూపంలో సంస్కరణలు జరిగిపోవాలని ప్రచారం చేస్తున్నవారు ‘తవ్వకాల’ద్వారా బయటపడుతున్న చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వాస్తవాలను మన జాతీయ జీవనంతో సమన్వయం చేసుకోవాలి! భారతీయ సంస్కృతి గొప్పదని అంటున్నవారే ‘ఆర్యు లు’అనేవారు బయటినుంచి మన దేశానికి వచ్చిపడినారని కూడ పాఠ్యాంశాలలో ఇప్పటికీ ఇరికిస్తూ ఉన్నారు. ఇది మూఢ విశ్వాస చిహ్నం....
‘చరిత్ర’కు ప్రారంభ బిందువును నిర్దేశించడం పాశ్చాత్యుల విశ్వవిజ్ఞాన అవగాహనా రాహిత్యానికి శతాబ్దుల సాక్ష్యం! ఆ చారిత్రక ప్రారంభ బిందువునకు ముందున్న కాలాన్ని ‘చరిత్ర పూర్వయుగం’గా చిత్రీకరించడం కాలగతికి పాశ్చాత్య చరిత్రకారులు చేసిన ఘోరమైన గాయం... ఈ ‘తథాకథిత’- సోకాల్డ్- చరిత్ర పూర్వయుగం- ప్రి హిస్టారిక్ ఏజ్-లో మాత్రం మానవులు లేరా? కనీసం ప్రాణులు లేవా? వారిది లేదా వాటిది మాత్రం చరిత్రకాదా?? చరిత్ర కాదనడం చరిత్రకు జరిగిన అన్యాయం. ఈ అన్యాయం చేసింది మిడిమిడి జ్ఞానం కలిగిన పాశ్చాత్య మేధావులు! ఈ ‘శకల’మే ‘సకల’మని ఐరోపా చరిత్రకారులు మనకు క్రీస్తుశకం పద్దెనిమిదవ, పంతొమ్మిదవ శతాబ్దులలో పాఠాలను చెప్పారు. ఆ పాఠాలను ఆ తరువాత మరింత నిష్ఠతో శ్రద్ధతో వల్లెవేస్తున్నాం! అందువల్లనే గొప్ప విషయాలను చెప్పదలచుకున్న మేధావులు, లేదా చెబుతున్నట్టు అభినయిస్తున్న మహా మేధావులు ‘చరిత్ర పూర్వయుగం’-ప్రిహిస్టారిక్ ఏజ్- అన్న విచిత్ర పద జాలాన్ని ఉటంకించడంతో ప్రారంభిస్తున్నారు! ప్రాచీన రాజధాని అమరావతి నవ్యాంధ్రప్రదేశ్‌కు మళ్లీ రాజధాని అవుతున్న సందర్భంగా ఈ ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న అర్థంలేని పదజాలం మళ్లీ విరివిగా ప్రచారవౌతోంది! ఈ ప్రచారం అతి ప్రాచీన అమరావతికి అవమానం. ఎందుకంటె అమరావతి లేదా కొందరు అంటున్నట్టు ‘్ధన్యకటకం’ ఐదువేల వంద ఏళ్లకు పూర్వం జరిగిన మహాభారత యుద్ధ సమయంలో ఉంది. అంతకు పూర్వం వేలాది ఏళ్లుగా ఉంది! కానీ బ్రిటిష్‌వారు మప్పిపోయిన ‘‘చరిత్ర పూర్వయుగం’’అన్న విచిత్ర పదార్థాన్ని ప్రచారం చేస్తున్నవారు ‘అమరావతి’ చరిత్రను రెండువేలు లేదా రెండు వేల ఐదువందల ఏళ్లకు పరిమితం చేస్తున్నారు! బ్రిటిష్‌వారు కాలాంతకులు, కాలాన్ని అంతంచేసినవారు... వారి వారసులు కూడ కాలాంతకులే! ‘‘చరిత్ర పూర్వయుగం’’ ఒకటుందని నమ్మడం ప్రచారం చేయడం మూఢ విశ్వాసబద్ధమైన బుద్ధికి నిదర్శనం! చరిత్ర అనాది... అనంతం... అందువల్ల చరిత్ర క్రమం ఆద్యం త రహితం! ‘‘చరిత్ర పూర్వయుగం’’,‘‘కోతి యుగం’’,‘‘రాతి యుగం’’,‘‘లోహ యు గం’’ అన్నవి బ్రిటిష్‌వారు, పాశ్చాత్యులు ‘‘విజ్ఞా నం’’గా భ్రమించిన మూఢవిశ్వాసాలు... బ్రిటిష్‌వారు మన దేశాన్ని వదలి వెళ్లినప్పటికీ, వారు అంటించిపోయిన ఈ మూఢ విశ్వాసాలు మన పుస్తకాలను, మస్తకాలను వదలకపోవడం భావదాస్య ప్రవృత్తికి ప్రత్యక్ష ప్రమాణం!

పురాతత్త్వశాఖ వారి త్రవ్వకాలలో బయటపడుతున్న ప్రాచీన అవశేషాలు ‘‘హరప్పా మొహంజాదారో నాగరికత’’ కాలంనాటివని, అంతకు పూర్వంనాటివని వర్గీకరణలు జరుగుతున్నాయి. అంతవరకు కాలానికి సంబంధించిన పేచీలేదు. కాని ‘‘హరప్పా నాగరికత’’ లేదా ‘‘సింధునదీ పరీవాహక ప్రాంత- ఇండస్ వ్యాలీ- నాగరికత’’అన్న పదజాలం మన జాతీయ అద్వితీయ తత్త్వానికి విఘాతకరమైనవి! ఈ దేశంలో గతంలో రెండుమూడు జాతులవారు పరస్పరం కొట్టుకొని చచ్చారన్న అబద్ధాన్ని ప్రచారం చేయడానికి బ్రిటిష్‌వారు ఈ ‘‘హరప్పా నాగరికత’’ను ‘‘కనిపెట్టి’’ పోయారు. ఈ హరప్పా నాగరికత కాలంనాటి మానవ అస్థిపంజరాలు నాలుగు ఇటీవల హర్యానాలో జరిగిన తవ్వకాలలో బయటపడినాయి. ఈ అస్థిపంజరాలు ఐదువేల ఏళ్లనాటివట! హరప్పా, మొహంజోదారో అన్న ప్రాచీన నగరాలు సింధూ పరీవాహ ప్రాంతంలో ప్రాచీన కాలంలో ఉండి ఉండవచ్చు. కానీ నగరాల పేరుతో ‘నాగరికత’లు, ‘‘రాజ్యాలు’’ ఉండడం భారతీయ చరిత్రలో సంభవించలేదు. ఇలా ఉండడం గ్రీకుల పద్ధతి పాశ్చాత్యుల పద్ధతి! నగరాలు మన దేశంలో రాజధానులు మాత్రమే. ‘‘నాగరికత’’అన్నది దేశమంతటా విస్తరించి ఉండిన ఒకే ఒక అద్వితీయ సాంస్కృతిక వ్యవస్థ! అందువల్ల బ్రిటిష్‌వారు కనిపెట్టిన ‘‘హరప్పా నాగరికత’’ నిజానికి భారతదేశమంతటా సమకాలంలో విస్తరించి ఉండిన అద్వితీయ సామాజిక వ్యవస్థ! అది వేద సంస్కృతి, సనాతన సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి....

ఇలా దేశమంతటా ఉండిన దాన్ని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం పాశ్చాత్యుల పరిమిత బుద్ధికి నిదర్శనం. ‘తక్షశిల’ప్రాచీన విద్యాకేంద్రం, రాజ్యంకాదు, రాజధాని కూడ కాదు. కానీ గ్రీకు బీభత్సకారుడైన అలెగ్జాండరు క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్దిలో మన దేశంలో కొంత భాగాన్ని గెలిచాడన్న అబద్ధాన్ని పాశ్చాత్య చరిత్రకారుడు క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్దిలో ప్రచారం చేశారు. ఈ అబద్ధ ప్రచారంలో భాగంగా విశ్వవిఖ్యాత విద్యాకేంద్రమైన ‘తక్షశిల’ను ఒక ప్రత్యేక రాజ్యంగా కల్పించారు!! ఇదే పద్ధతిలో దేశమంతటా ఒకే జాతీయ సంస్కృతి అనాదిగా ఉండడం వాస్తవం కాగా, ఈ వేద సంస్కృతికి భిన్నమైన ‘‘హరప్పా నాగరికత’’ను పాశ్చాత్యులు ఏర్పాటుచేశారు. పైగా ఈ ‘‘హరప్పా నాగరికత’’ ధ్వంసమైన తరువాత మాత్రమే క్రీస్తునకు పూర్వం పదిహేనవ పనె్నండవ శతాబ్దుల మధ్య వేద సంస్కృతి ఈ దేశంలో పుట్టుకొచ్చిందన్న మరో భయంకర అబద్ధాన్ని కూడ పాశ్చాత్యులు మన చరిత్రకు ఎక్కించిపోయారు!! ఈ దేశంలో ‘యుగాలు’గా వేద సంస్కృతి పరిఢవిల్లుతోందన్నది వాస్తవ చరిత్ర. ఈ చరిత్రను చెరచి, వేదాల ప్రాచీనతను కేవలం మూడువేల ఐదువందల ఏళ్లకు కుదించడానికి బ్రిటిష్‌వారు చేసిన కుట్రలో ఈ తథాకథిత ‘‘హరప్పా నాగరికత’’ భాగం... ఈ కుట్రను భగ్నంచేయడానికి వీలైన అవశేషాలు తవ్వకాలలో అనేక ఏళ్లుగా బయటపడుతున్నాయి. ఇప్పుడు హర్యానాలో జరిగిన త్రవ్వకాలలో ఏడువేల ఐదువందల ఏళ్లనాటి పట్టణం బయటపడింది! ‘‘హరప్పా నాగరికత’’ కేవలం ఐదువేల ఏళ్ల ప్రాచీనమైనదన్న పాశ్చాత్య అబద్ధాన్ని ఈ ‘‘పట్టణం’’ ఇలా బట్టబయలుచేసింది.. భూస్థాపిత సత్యమిలా భువనమెల్ల మార్మోగెను....

హరప్పా నాగరికతను ధ్వంసంచేసిన తరువాత వేదాలు వైదిక సంస్కృతి విలసిల్లాయన్న పాశ్చాత్యుల ‘‘అబద్ధాల చరిత్ర’’కు పెద్ద అవరోధం మహాభారత యుద్ధం. మహాభారత యుద్ధం కలియుగం పుట్టడానికి పూర్వం ముప్పయి ఆరవ ఏట జరిగింది! కలియుగం పుట్టిన తరువాత మూడువేల నూట రెండేళ్లకు క్రీస్తుశకం పుట్టింది. ఇలా క్రీస్తునకు పూర్వం 3138 ఏళ్లనాడు మహాభారతయుద్ధం జరిగిందని అమెరికా శాస్తవ్రేత్తలు సైతం నిర్ధారించిన సంగతి దశాబ్దిక్రితం ప్రముఖంగా ప్రచారమైంది. అమెరికా శాస్తవ్రేత్తలు నిర్ధారించకపోయినప్పటికీ ప్రాచీన భారత చరిత్రకారులు చేసిన నిర్ధారణలు నిజంకాకుండా పోవు. కాని పాశ్చాత్య భావదాస్య సురాపానం మత్తుదిగని భారతీయ మేధావులు అమెరికావారి ఐరోపావారి నిర్ధారణలను నమ్ముతున్నారు. ఆ నిర్ధారణ కూడ జరిగింది కనుక ఇకనైనా ‘హరప్పా’నాగరికత అన్న మాటలను వదలి పెట్టి దేశమంతటా అనాదిగా ఒకే వేద సంస్కృతి కొనసాగుతున్న వాస్తవాన్ని చరిత్రలో చేర్చాలి! ప్రాథమిక స్థాయినుండి స్నాతకోత్తర స్థాయివరకు గల విద్యార్థులకు బోధించాలి! మహాభారత యుద్ధం జరిగిననాటికి, క్రీస్తునకు పూర్వం మూడువేల నూటముప్పయి ఎనిమిదేళ్లనాటికి, దేశమంతటా ఒకే జాతీయత ఒకే సంస్కృతి నెలకొని ఉన్నాయి! అలాంటప్పుడు అదే సమయంలో ‘‘వేద సంస్కృతితో సంబంధం లేని, వేదాలకంటె ముందు ఉండిన’’ ఈ హరస్పా ఎలా ఉండి ఉంటుంది??

చరిత్రను ఆవహించిన మూఢవిశ్వాసాన్ని ఇకనైనా వదలగొట్టాలి!

‘రాతియుగం’, ‘కోతియుగం’వంటివి కృతకమైన కల్పితమైన కాలగణన పద్ధతులు. ‘చరిత్ర పూర్వయుగం’అన్నది ఉండడానికి వీలులేదు. ఎందుకంటె సహజమైన విశ్వవ్యవస్థ తుది మొదలు లేకుండా వ్యవస్థీకృతమై ఉంది! ఈ ‘తుది మొదలులేనితనం’ కాలానికీ- టైమ్- దేశానికీ- స్పేస్-వర్తిస్తున్న శాశ్వత వాస్తవం. ఈ వాస్తవం ప్రాతిపదికగా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం, కలియుగం వరుసగా తిరుగుతున్నాయి. శిశిర ఋతువు తరువాత వసంత ఋతువువలె రాత్రి తరువాత పగటివలె కలియుగం తరువాత మళ్లీ కృతయుగం రావడం చరిత్ర! ఇది సనాతనమైన నిత్యనూతనమైన హేతుబద్ధమైన వాస్తవం! ఈ వాస్తవం ప్రాతిపదికగా విద్యార్థులకు ఇకనైనా చరిత్రను బోధించాలి! ‘రాతియుగం’తోకాక కృతయుగంతో చరిత్రను మొదలుపెట్టాలి. కృత త్రేత ద్వాపర కలియుగాలు ఒకదానితరువాత ఒకటి రావడం ఖగోళ విజ్ఞానపు గీటురాయిపై నిగ్గుతేలిన నిజం!

ఈ ఖగోళ వాస్తవాలను ఎవ్వరూ మార్చలేరు... వక్రీకరించలేరు. ఈ ఖగోళ వాస్తవం ప్రకారం ‘సప్తర్షులు’అన్న అంతరిక్ష సముదాయం భూమినుండి చూసినప్పుడు వందేళ్లపాటు ‘అశ్వని’వంటి నక్షత్రాలతో కలసి ఉదయిస్తుంది. ఈ సప్తర్షి మండలం అలా ‘రేవతి’వరకూ గల నక్షత్రాలతో ఉదయించే కాలఖండం రెండువేల ఏడువంద ఏళ్లు. ఈ ఖగోళ వాస్తవం ప్రాతిపదికగా కలియుగంలో ఇది యాబయిరెండవ శతాబ్ది! ఇది 5117వ సంవత్సరం. శాతవాహన ఆంధ్రులు కలియుగంలో 2269నుండి 2775వరకు 506 ఏళ్లపాటు మొత్తం భారతదేశాన్ని పాలించారు, దేశానికి రాజధాని గిరివ్రజం...!! ధాన్యకటకం అప్పటికే ఉంది, ధాన్యకటకం అమరావతి కావచ్చు, కోటిలింగాల కావచ్చు!్ధన్యకటకం రాజధానిగా సహస్రాబ్దులు పాలించిన తరువాతనే ఆంధ్రులు గిరివ్రజం రాజధానిగా భారత సమ్రాట్టులయ్యారు. ఇదీ యుగాల చరిత్ర.... ‘చరిత్ర పూర్వయుగం’ లేదు!

- హెబ్బార్ నాగేశ్వరరావు 30/04/2015 (ఆంధ్రభూమి విశ్లేషణ)
http://www.andhrabhoomi.net/content/main-feature-58

No comments:

Post a Comment