Monday, 20 April 2015

అక్షయతృతీయ విశేషాలు

ॐ  ఏప్రియల్ 21 మంగళవారం , వైశాఖ శుద్ధ తదియ, అక్షయతృతీయ సంధర్భంగా అక్షయ తృతీయ గురించి ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం.

పురాణ ప్రాశస్త్యం :
వైశాఖ శుద్ధ తృతీయ (తదియ) నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది.

"అక్షయ తృతీయ" నాడే మహావిష్ణువు ఆరో అవతారమైన పరుశురాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ నృసింహుడు ప్రహలాదుడిని అనుగ్రహించింది కూడా ఈ రోజే అని చెప్తారు. అక్షయ తృతీయ రోజు సింహాచలంలో చందనోత్సవం చేస్తారు. ఏడాదికి ఒకసారి మాత్రమే జరిగే ఈ ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ఈ రోజునే సింహాచలం అప్పన్న (నరసింహస్వమి) నిజస్వరూపం చూడవచ్చు. మిగితా రోజులలో స్వామి నిత్యం చందనం (గంధం) తో అలకరించబడి ఉంటారు.

విధులు:
అక్షయము అంటే క్షయములేనిది, లెక్కించలేనిదని అర్దాలున్నాయి. ఈ అక్షయతృతీయ రోజున చేసే జపము, స్నానం, దానము, పూజ మొదలైన అన్ని కార్యాలు అక్షయమైన (లెక్కించలేని) పుణ్యాన్ని ప్రసాదిస్తాయి. ఈ రోజు తప్పక గంగా స్నానం చేయాలి. అది కుదరని పక్షంలో 'ఓం గంగాయై నమః' అని మనసులో జపిస్తూ స్నానం చేయాలి. ఈ స్నానం సూర్యోదయానికి పూర్వమే ముగించాలి. పేదలకు, ఆర్తులకు దానం చేయడం ముఖ్యమైన విధి. అక్షయ తృతీయ రోజున గోదానం, జలదానం, విసురుకర్రలను, గొడుగును దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరి శక్తి కొలది వారు దానం చేయవచ్చు.

ఏ దానం చేస్తే ఏం ఫలితం వస్తుంది?
ఈ రోజు రోగులకు సేవ చేయడం వలన మృత్యుసమయంలో అనుభవించే బాధ తొలగుతుంది.
పేదలకు, దీనులకు కావలసిన వస్తువులను దానం చేయడం వలన వచ్చేజన్మలో సకల సంపదలు చేకూరుతాయి.
పేదలకు బట్టలు దానం వలన రోగాలు తగ్గుతాయి లేక రావు.
పండ్లు దానం చేస్తే, జీవితంలోనూ, ఉద్యోగంలోనూ మంచి స్థితికి ఎదుగుతారు, ప్రమోషన్లు వస్తాయి.
మజ్జిగ దానం వలన విద్యలో అభివృద్ధి, పురోగమనం కలుగుతాయి.
ఆహారధాన్యాల దనం అపమృత్యదోషాన్ని నివారిస్తుంది
దేవతర్పణం పేదరికాన్ని దూరం చేస్తుంది
పెరుగన్నం దానం జీవితంలో చేసిన దుస్కర్మలను దూరం చేసి, చక్కటి అభివృద్ధిని ఇస్తుంది.

అంతేకానీ అక్షయతృతీయకు బంగారం కొనుగోలు చేయాలన్న నిబంధన ఏమీ లేదు. అసలు బంగారం కొనమని ఏ శాస్త్రమూ చెప్పలేదు. భారతీయ చరిత్రలో 19వ శతాబ్దం చివరి వరకు భారతీయులు ఏనాడు బంగారం కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. బంగారం కొంటే అది అక్షయమవుతుందని చెప్పడంలో సత్యం ఎంత మాత్రమూ లేదు. బంగారం అమ్మకాల్లోకి బహుళజాతి సంస్థలు అడుగుపెట్టడంతో అమ్మకాలు పెంచుకోవడం కోసం మొదలుపెట్టిన ప్రచారమే ఇదంతా. శాస్త్రం ఎప్పుడు దాచిన దనాన్ని దానం చేసి పుణ్యంగా మార్చుకోమని చెప్తుంది, అలా దాచిన పుణ్యమే మరు జన్మల్లో సహాయపడుతుంది. ఏదో జన్మలో మనం చేసిన దానం వల్ల కలిగిన పుణ్యమే ఈ రోజు మనం ఇలా రెండు పుటాల తిని, బ్రతకడానికి, సుఖాలు అనుభవించడానికి కారణమవుతోంది. ఇప్పుడు కూడా దానం చేసి పుణ్యం మూటగట్టుకుంటే తర్వాతి జన్మల్లో ఉపయోగపడుతుంది. అదే డబ్బు దాచి, కూడబెడితే, మరణించిన తర్వాత పిల్లలు పంచుకోవడం తప్పించి, ఒక్క రూపాయి కూడా వెంటరాదు. డబ్బు దాచకూడదు అని శాస్త్రం చెప్పడంలేదు, కొంతరవర్కు దాచుకోవలి, కానీ పుణ్యం కూడా కూడబెట్టమంటుంది శాస్త్రం. బంగారం కొనడానికి 'గురుపుష్య' యోగం ఉన్న రోజు శుభకరం. పుష్యమి నక్షత్రం గురువారం వచ్చిన రోజు, అది ఏ మాసమైన, బంగారం కొనడానికి శ్రేష్ఠమైనదని శాస్త్రం చెప్తోంది. అది తప్పించి వెరొక ప్రత్యేక దినం చెప్పలేదు.

అక్షయ తృతీయ రోజున మృత్తికను (మట్టిని) పూజించాలి. మట్టి వల్లనే మానవులకు సర్వ సంపదలు కలుగుతున్నాయి. సహజవనరులు, ఆహారం, నీరు అన్నిటికి భూమాతే కారణం. ఈ రోజు మట్టిని పూజించడం వలన ధనలక్ష్మీ, ధాన్యలక్ష్మీ, వైభవ లక్ష్మీల అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని, మట్టిని కృతజ్ఞతా పూర్వకంగా, అమ్మగా భావించాలని శాస్త్రం చెప్తున్నది. అక్షయతృతీయ రోజున విత్తనాలు చల్లాలని, ఒక మొక్క నాటలని సంప్రదాయం చెప్తోంది. అట్లాగే పితృదేవతలకు తర్పణాలు వదలాలి.

వీలుంటే ఎవరికైన సహాయం చేయండి. మీకు అందుబాటులో, వీలుగా ఉన్నదాంట్లో ఎవరో ఒకరి సహాయపడండి. దేవాలయాన్ని సందర్శించండి. సాధ్యమైనంతవరకు అబద్దాలు ఆడకుండా, ఎవరి మీద కోపం ప్రదర్శించకుండ, కసురుకోకుండా గడిపేందుకు ప్రయత్నించండి. దైవధ్యానం చేయండి.

అక్షయతృతీయ రోజు మనం ఏ కార్యం (మంచిదో, చెడ్డదో) చేసినా దాని ఫలితం అక్షయమని గుర్తుపెట్టుకోండి.
ఈ సంవత్సరం (2015), అక్షయత్రీత్య పూజ ముహూర్తసమయం ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల 14 నిమిషాల వరకు

|| ఓం శాంతిః శాంతిః శాంతిః ||

Originally Published : Akshya Tritya 2013
1st Edit: 01 May 2014
2nd Edit: 20 April 2015

No comments:

Post a Comment