Thursday 23 April 2015

ఏప్రియల్ 24, 2015, శుక్రవారం, శ్రీ రామానుజ జయంతి

వైశాఖ శుద్ధ షష్టి నాడు క్రీస్తు శకం 1071 సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో జన్మించిన గొప్ప తత్వవేత్త భగవద్రామానుజులు. ఆదిశేషుని అంశతో భువిపై జన్మించారు రామానుజులు.  రామానుజాచార్యుడు త్రిమతాచార్యుల లో ఒకరు. కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యానికి, దేవుని పై చూపవలసిన అనన్య సామాన్యమైన నమ్మకానికీ, సాటిలేని భక్తికీ, రామానుజాచార్యుని జీవితం ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సాంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించి లోకానికి చాటారు. 16 ఏళ్ళ వయసుకే సమస్త శాస్త్రాలను కంఠస్థం చేసారు.

విశిష్టాద్వైత మతాన్ని, శ్రీ వైష్ణవ సంప్రదాయాన్నిస్థాపించారు. జీవాత్మ పరమాత్మ నుంచి వేరు కానప్పటికి ఇద్దరికి కొంత వ్యత్యాసం ఉన్నది అంటూ చెప్తుంది విశిష్టాద్వైతం. కర్మసిద్ధాంతం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలను ప్రస్థానత్రయం అంటారు. వీటికి భాష్యం రాశారు. అట్లాగే అనేకానేక ఇతర గ్రంధాలను రచించారు.

తన జీవితం ద్వారా ఈ ఆచార్యుడు మానవాళికి ఇచ్చిన సందేశాలు ఇవి:

1. ప్రస్తుతం సాంప్రదాయకంగా కొనసాగుతున్న ఆచార వ్యవహారాలు ఛాందసంగా మారి సామాజిక పురోగతికి అడ్డురాక మునుపే వాటిని గుర్తించి సమాజ శ్రేయస్సుకై వాటిని మానటమో, మార్చటమో చేయటం బ్రాహ్మణుని లేదా ఆచార్యుని ప్రధమ కర్తవ్యం.

2. దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్వం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.

3. మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.

4. ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కానీ వ్యక్తిగత శ్రేయస్సు కాదు.

తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడేనని తెలిసిన రామానుజులు తన పాదాలను కొండపై మోపడానికి ఇష్టపడలేదు. శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం మోకాళ్ళపై కొండెక్కి స్వామిని కటాక్షం చేసుకున్నారు. తిరుమల ఆలయంలో పూజా విధానం కొరుక చక్కని వ్యవస్థను ఏర్పరించింది, తిరుమల ఉన్న దైవం విష్ణువేనని చాటి చెప్పింది భగవద్రామానుజులే.

ఓం శ్రీమతే శ్రీ రామానుజాయ  

ఏప్రియల్  24, 2015, శుక్రవారం, శ్రీ రామానుజ జయంతి

Originally posted: 03 May 2014
1st Edit: 23 April 2015

No comments:

Post a Comment