Wednesday 26 March 2014

హిందూ ధర్మం - 39 (శౌచం)

శౌచం - శౌచం అంటే పరిశుభ్రత కలిగి ఉండడం, మానసికంగా, శారీరికంగా పవిత్రంగా జీవించడం. శౌచం అనేది విశుద్ధతను కలిగించే ఒక ప్రక్రియ.బయటకు కనిపించే మన శరీరాన్ని విశుద్ధ జలంలో స్నానమాచరించి మలాన్ని తొలగించుకోవడం శారీరిక శౌచం. స్నానం పవిత్రమైనది మరియు ఆయుర్ధాన్ని పెంచేది, శ్రమమూలంగా ఏర్పడిన స్వేదమలాన్ని పోగొట్టేది, శరీర బలాన్ని కలిగించేది, ఓజస్సును ఇచ్చేది. మన వాక్కుకు/మాటలకు శౌచం సత్యం వల్ల ఏర్పడుతుంది. అదే వాక్కుకు స్నానం/శౌచం. అబద్దాలు పలకడం వలన వాక్కు అపవిత్రం అవుతుంది. వ్యాకరణం మొదలైన శాస్త్రాలవల్ల శబ్దానికి శుద్ధి కలుగుతుంది. ఏది ఎలా పలకాలో తెలుస్తుంది. అందువల్ల వ్యాకరణం శబ్దానికి శౌచానిస్తుంది. శుభ్రత కలిగిన ప్రదేశంలో వండిన ఆహారాన్నే స్వీకరించాలి. శుద్ధమైన ఆహారం మనసును శుద్ధి చేస్తుంది. శుద్ధి చెందిన మనసు అదుపులోకి వచ్చి, పరమాత్మ సేవకు ఉపకరమిస్తుంది. ఎక్కడపడితే అక్కడ వండిన ఆహార పదార్ధాలను స్వీకరించకపోవడం ఆహారం శౌచం. సంపాదించిన ధనాన్ని ధార్మిక కార్యక్రమాలకు, దానాలకు, సేవకు ఉపయోగించడం సంపాదనకు శౌచానిస్తుంది. అలా కాకుండ స్వార్ధంతో జీవించడం వలన సంపాదన అపవిత్రం అవుతుంది.

మన మనస్సుకు గురువు యొక్క ఉపదేశం, మంచి ప్రవచనం వినడం వలన మంచి ఆలోచనలతో శుద్ధి కలుగుతుంది. మంచి గ్రంధాలు చదవడం వలన, సత్సంగం వలన మనసు మంచిదారిలో పయనిస్తుంది. మనస్సుకు ఇవే స్నానం. విపరీతమైన ప్రేమ, భరించలేని ద్వేషం, పక్షపాతం కలిగి ఉండడం, జరిగిన విషయం మీద అవగాహన లేకుండా సొంత అభిప్రాయాలు ఏర్పరుచుకోవడం, అనవసరంగా ఒకరిని నిందించడం, అన్యాయం, అధర్మం మొదలైన వాటినుంచి దూరంగా ఉండడం మానసిక శౌచం క్రిందకే వస్తుంది.

To be continued.......... 

No comments:

Post a Comment