Sunday 3 April 2016

హిందూ ధర్మం - 202 (వేదంలో గోవధ ఖండన - 2)

మాంసం అంటే మనకు తెలిసిందే. కానీ మాంసం అంటే గుజ్జు అనే అర్దం కూడా వస్తుంది. సమయాన్ని, ప్రకరణాన్ని అనుసరించి అర్దం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వక్రీకరణకారులు మాంసం అనే సామాన్యమైన, వాడుకలో ఉన్న అర్దం తీసుకుని యాజ్ఞవల్క్య మహర్షి మాంసం తింటా అన్నారని ప్రచారం చేశారు.

ఇంకొన్ని ఆరోపణలను పరిశీలిద్దాం.

వక్రీకరణ - అతిధి వచ్చినప్పుడు, వివాహ సమయంలో, శ్రాద్ధ సమయంలో గోవును వధించాలి - ఆపస్థంభ గృహసూత్రం 1/3/10
వక్రీకరణ - శ్రాద్ధ సమయంలో భోజనంలో పెట్టిన మాంసాన్ని తినను అన్న బ్రాహ్మణుడు నరకానికి వెళతాడు - వశిష్ట ధర్మసూత్రం 11/34

వాస్తవం - అక్కడ గోవు గురించి చెప్పనేలేదు. శ్రద్ధయా కురుతే ఇతి శ్రాద్ధం అని సూత్రం. శ్రాద్ధకార్మకు శ్రద్ధ ముఖ్యం. దైవకార్యాలకు మడి లేకపోయినా సర్దుకోవచ్చు కానీ శ్రాద్ధ కర్మలకు మాత్రం మడి తప్పనిసరి అని పెద్దల నిర్ణయం. మడికి అర్దం బాహ్యంలో ఉన్న వస్తువులను ముట్టుకోకపోవడం అని కాదు. మనసును, ఇంద్రియాలను అన్యమైన విషయాల మీద వెళ్ళనివ్వక, తదేక దృష్టి కలిగి ఉండడం. మడి వస్త్రం ధరించినా, మనసు అన్య విషయాల మీదకు వెళితే, ఇక ఆ మడికి అర్దంలేదు. పై సూత్రాల్లో కూడా అదే చెప్పబడింది. అతిధి వచ్చినప్పుడు, వివాహ సమయంలో, శ్రాద్ధ సమయంలో ఇంద్రియాలను నియత్రించాలి, అదుపులో పెట్టుకోవాలి. అక్కడ గోవుకు ఇంద్రియాలనే అర్దం స్వీకరించాలి. దాన్ని వక్రీకరించి గోమాంసం తినాలని ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు నికృష్టులు.

అతిధి విషయంలో కూడా అంతే. అతిధి సాక్షాత్తు భగవత్స్వరూపం. అతిధికి భోజనం సిద్ధం చేయడం దగ్గరి నుంచి చాలా శుచిగా ఉండాలి. ఆహారం వండే సమయంలో వంట చేసేవారి మనసులోని భావాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయని, అవి తిన్న వారిని ప్రభావితం చేస్తాయని ధర్మశాస్త్రం (ఆయుర్వేద, మంత్ర శాస్త్రాలు ఇత్యాదులు) చెప్తోంది. ఆహారం సిద్ధం చేసే సమయంలో మనసు అనవసరమైన, అధార్మికమైన విషయాల మీద వెళితే అది తిన్నవారి దేహంలోకి వెళ్ళి అదే భావాలను కలిగిస్తుంది. అందుకే సాధకులకు అనేక నియమాలున్నాయి. అతిధికి భోజనం పెట్టకపోతే వచ్చే పాపం కంటే అతడి ఉపాసనకు, నిష్ఠకు, దీక్షకు భంగం కలిగిస్తే వచ్చే పాపం ఇంకా ఎక్కువ. అందువల్ల అతిధి విషయంలో ఇంద్రియ నిగ్రహం తప్పనిసరి అని ధర్మశాస్త్ర సూత్రాలు తెలియజేస్తున్నాయి.

వక్రీకరణ - కూతురి వివాహ సమయంలో ఆవులను, ఎడ్లను వధించాలి - ఋగ్వేదం 10.85.13
వాస్తవం - అసలు ఈ మంత్రం వివాహానికి సంబంధించినదే కాదు. గో హన్యతే అన్న ఒక్క పదాన్ని తీసుకుని ఇంత పెద్ద కష అల్లారు. శిశిర ఋతువు (చలికాలం) యందు సూర్యకిరణాలు బలహీనపడి మరల వసంత ఋతువులో శక్తిని పొందుతాయి అని ఆ మంత్రం చెప్తున్నది. ఇక్కడ గో అనే శబ్దానికి సూర్యకిరణాలనే అర్దం స్వీకరించాల్సి ఉండగా, నికృష్టులు ఆవును అనే అర్దాన్ని స్వీకరించారు. హన్యతే అనగా ఇక్కడ బలహీనపడుట అనే అర్దం స్వీకరించాలి. అదీగాక, వీళ్ళు పూర్తి మంత్రాన్ని అనువదించకుండా కేవలం గోహన్యతే అనే ఒక్క పదాన్నే అనువదించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ వాదనే నిజం అనుకున్నా, ఆ తర్వాతి మంత్రంలో గోవు తిరిగి తన పూర్వ రూపాన్ని సంతరించుకుంటుందని చెప్తుంది? అక్కడ గోవుకు అర్దం ఆవు అయితే వధించబడిన ఆవు తిరిగి ఎలా బ్రతికి వస్తుంది? వీటికి వక్రీకరణకారుల వద్ద సమాధానం ఉండదు.

ఇంకో విషయం ఏమిటంటే అసలు వివాహాది శుభకార్యాల్లో మాంసం పెట్టడం నిషిద్ధం. వివాహమంత్రాల్లో వేదికకు దేవతలను, ఋషులను, అనేక శక్తులను ఆహ్వానిస్తారు. అటువంటి సమయంలో శుచి ప్రధానం. అప్పుడు కేవలం శాఖాహారమే వండాలి తప్పించి, మాంసాహారం వండకూడదు. అది కొత్తగా వివాహం చేసుకున్న జంట వైవాహిక జీవితానికి కూడా మంచిది కాదు.

To be continued ..................

ఆర్యసమాజం వారి సౌజన్యంతో

2 comments:

  1. ఎంత బాగుందో వివరణ మూర్ఖుల మనసు రంజింపగా జేయగా రాదయా విశ్వదాభిరామ వినురవేమ.
    గో అంటే ఇంద్రియాలు అని సంస్కృతం తెలియాలి కదా. ఒక పదానికి అనేక అర్ధాలు ఉంటాయి. తెలిసీ తెలియక వాదించే వారిని ఏమంటాం, కానీ మీ ప్రయత్నం మానకండి అలా చెబుతూనే ఉండండి ఒకానాటికైనా తలకెక్కక మానదు.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా అండీ. మీ ప్రోత్సాహానికి ధన్యుడను. శివార్పణమండీ.

      Delete