Monday 12 December 2016

13 డిసెంబరు 2016, మంగళవారం, మార్గశిర పూర్ణిమ, దత్తపూర్ణిమ.



శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.

దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము.

ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.

సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయులవారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్షపూర్ణిమనాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారు. దత్తాత్రేయుడు మార్గశీర శుక్ల చతుర్దశిని అవతరించినా దత్తజయంతిని మహారాష్ట్రులు మార్గశీర పూర్ణిమనాడే జరుపుతారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవడం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు.

మేడి (ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!

Source: http://archive.andhrabhoomi.net/content/dattatreya-jayanthi

No comments:

Post a Comment