Saturday 27 February 2021

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (187)

ఈ రెంటినీ తీసుకొని వెళ్ళి కావేరీ తీరాన్ని సమీపించాడు విభీషణుడు. మన గణపయ్య దీనిని గమనించాడు, ఇట్టి సంపద, లంకకు తరలిపోవడాన్ని ఇష్టపడలేదు. ఇది తమిళనాడును, భారతదేశాన్ని దాటకూడదని భావించాడు. ఇక్కడొక లీలను ప్రదర్శించాడు ఏమది?


విగ్రహాన్ని, విమానాన్ని క్రింద పెట్టకూడదని షరతు. ఎక్కడైనా పొరపాటున పెడితే అది అక్కడే ప్రతిష్ఠితమైపోతుందని హెచ్చరిక.


అప్పుడు కావేరీ నది వరదలతో నిండియుంది. కావేరిలో ఒక మాటు స్నానం చేస్తే మంచిదనే భావనను కలిగించాడు గణపతి. ఒక బ్రహ్మచారి వేషంలో విభీషణుని ముందు నిలబడ్డాడు, వీటిని నీ చేతిలో పెట్టి, జాగ్రత్తగా ఉంచగలవా అని విభీషణుడన్నాడు.


దానికేమి? అయితే నేను చాలా సేపు ఈ బరువును మోయలేకపోతే ఏం చేయాలి? నేను మూడు సార్లు పిలుస్తాను. సకాలంలో నీవు రాకపోతే తప్పనిసరై నేను నేలమీద పెట్టవలసి వస్తుంది. అంగీకరిస్తావా అని గణపతి యన్నాదు. అతడు నదిలో ఈత కొడుతూ ఉండగా మూడుసార్లు పిలిచాడు. విభీషణుడు సకాలంలో రాలేకపోయాడు, ఇదిగో పిలిచాను, నా తప్పేమీ లేదు, నేనిక్కడ ఉంచేస్తున్నానని బిగ్గరగా అన్నాడు గణపతి, ఇంకేముంది? అక్కడే ప్రతిష్టితమై పోయింది.


ఈ కథ వల్ల విమానం, విగ్రహం చేతిలో ఇమిడినట్లుగా మొదట ఉన్నాయని, ప్రతిష్ఠ జరిగిన తరువాత అవి రెండూ పెద్దవయ్యాయని ఊహించవచ్చు.


నదినుండి బైటకు వచ్చి కోప్పడి, విభీషణుడు విగ్రహాన్ని కదలింపబోయాడు. బ్రహ్మచారి నెత్తిపై ఒక దెబ్బ వేయాలనుకున్నాడు. గణపతి, పరుగు లంకించుకొని కొండనెక్కాడు. విభీషణుని పట్ల దయలో లొంగిపోయాడు.


No comments:

Post a Comment