Thursday 9 February 2023

శ్రీదత్త పురాణము (45)

 


సూర్యబింబం తూర్పు కొండకు అవతలి భాగంలో ఆగిపోయింది. సారధి అనూరుడు కొరడా ఝళిపించాడు. గుర్రాలు కదలలేదు. తోకనిక్కించి చెవులు రిక్కించి దిక్కులు పిక్కటిల్లేలాగా గుర్రాలు సకిలించాయి. సకల శక్తులూ కూడగట్టుకొని ఏడు గుర్రాలు ఒక్కసారిగా ప్రయత్నించాయి. అడుగు కదప లేకపోయాయి. నోటి నుండి నురగలు క్రక్కుకున్నాయి. సూర్యుడు (ధావయధావయ) తోలు తోలు అన్నాడు. సారధి అనూరుడు (లంఘయన్తు లంఘయంతు) లఘించండి లఘించండి అన్నాడు. గుర్రాలు కదలలేదు. రధం మెదలలేదు. బల్లకు అతికించిన ఏటవాలులో సూర్యరధం స్తంభించిపోయింది. ఈ వైపరీత్యం ఏమిటో అనూరుడికి అంతుపట్టలేదు. 

మందేహాది రాక్షసులు సూర్యరధాన్ని చుట్టుముట్టారు. భీకర రూపములతో భయంకరంగా గర్జిస్తూ రధాన్ని పట్టుకోవటానికి సిద్ధంగా వున్నారు. సూర్యభగవానుడు దివ్యదృష్టితో చూచాడు. విషయం అర్ధం అయ్యింది. సారధి అయిన అనూరునితో అనూరా ఇది పతివ్రతామహత్మ్యం. సుమతి కరుణిస్తే తప్ప మన రధం కదలదు. గుర్రాలను విప్పి నీవు కూడా విశ్రాంతి తీసుకో. ఇది మనకు అయాచితంగా దొరికన అవకాశం. విశ్రమించు. మన రధం కదలాలి. భూలోకంలో ఉషోదయమవ్వాలి. నైస్టికులు అర్థ్యాలు వదలాలి. అప్పటి వరకు ఈ నందేహాది రక్కసుల అలజడితప్పదు. చూస్తూ వుందాం. ఏమి జరుగనున్నదో అన్నాడు. అనూరుడు చిరునవ్వులు చిందించాడు.

భూలోకంలో ప్రాణికోటి మేల్కొంది. ఇంకాసేపట్లో చీకట్లు తొలగుతాయని ఎదురు చూస్తూవుంది. సరోవరాలలో స్నానాలు చేసి నిలబడిన నైష్టికుల చేతుల నుండి అర్హ్యజలాలు జారిపోయాయి. ఎంతకూ అరుణోదయం కాకపోవడంతో ఇదేదో ప్రళయం అనుకొని గట్లమీదకు చేరుకున్నారు. చెట్ల మీద పిట్టల కువకువలు వినిపిస్తున్నాయే తప్ప ఏ పిట్టా గూడు వదలి బయటికి రాలేదు. పువ్వులు రేకులు విప్పడం లేదు. పద్మాలలో తుమ్మెదలు గుంజుకుంటున్నాయి. పశువుల అంబా, అంబా అంటూ అరుస్తున్నాయి. లేగ దూడల ఆకలి అరుపులకు అవి మరింత గుంజుకుంటున్నాయి. కోడి కూసి జాము అయినా ఇంకా వెలుగు రేఖలు రాలేదేమా అని రైతులు విస్తుపోతున్నారు. పొలాలకు చేరే వారు దారిలో గుంపులు గుంపులుగా గుమికూడి చర్చించుకుంటున్నారు. ముంగిళ్ళలో కళ్ళాపు జల్లిన ఇల్లాండ్రు ముగ్గు బుట్టలతో నిలబడి ఇంకా తెల్లవారలేదేమి అని పలకరించుకుంటున్నారు. గంటలు గడుస్తున్న కొద్దీ అందరిలో కలవరం పెరుగుతోంది. ఇంతలోకి ఎవరో గాలిలో పుకారు లేవదీశారు. ఇదేదో ప్రళయమట. ఇవాల్టితో ఇంక సరి అంట, అని పూరూరా రకరకాల పుకార్లు లేవదీశారు. భూగోళం అంతా హా హా కారాలు చెలరేగాయి.

No comments:

Post a Comment