Wednesday 22 February 2023

శ్రీదత్త పురాణము (58)

 


ఏది ఏమైనా రాకుమారా! ఇది నీవు తప్పించుకోలేని బాధ్యత. మీ వంశాలకు, మా వంశానికీ అనుబంధం ఈనాటిది కాదు. మీ తాత ముత్తాతల కాలం నుంచీ మా తాతముత్తాతలు మంత్రులుగా ఉన్నవారే. ఏనాడూ ఎవరూ మీ వంశీకుల్ని తప్పుదారి పట్టించిన దాఖలాలు లేవు. మీ తండ్రిగారికి మేమంతా నమ్మినబంటులం, ఆయనపట్ల అపారమైన గౌరవాదరాలు కలవాళ్ళం. లోకంలో వ్యక్తిగతంగా పదిమంది చేతా ధర్మపరుల మనిపించుకుంటున్న వాళ్ళం. మమ్మల్ని నువ్వు విశ్వసించవచ్చు. నీతో 'తప్పులు చేయించీ నిన్ను బలహీనపరిచీ మేము బావుకునేదీ ఏమీ ఉండదు. అలాంటి పనులు చేసేవారు తాత్కాలికంగా ఏవో లబ్ధులు పొందినా, చివరికి హత్యలు అవమానాలకూ గురికావడం చరిత్రలో అందరూ ఎరిగినదే. కూర్చున్న కొమ్మనూ నరుక్కునేంతటి మూర్ఖులమో, అహంకారులమో, అజ్ఞానులమో కాము. మమ్మల్ని విశ్వసించు. ధర్మ భంగం కలగకుండా ప్రజారంజకంగా నీ పరిపాలన సాగేటట్టు సహకరిస్తాం. అదీకాక ఒకరిమీద ఒకరికి తెలియకుండా చారులను నియోగించి నిఘాలు పెట్టి ఎక్కెడికక్కడ కదలికలు గమనించి ఎప్పటి కపుడు సమాచారం రాబట్టుకునే సువ్యవస్థితమైన పరిపాలనా విధానం మన రాజ్యంలో ఎప్పటి నుంచో నెలకొని ఉంది. దాన్ని మరింత చైతన్యపరిచే చాతుర్యం నీకు సమృద్ధిగా ఉంది. అందుచేత ఏ కోణం నుంచి ఆలోచించినా నువ్వు తిరస్కరించడానికి తగినంత కారణం నాకయితే కనిపించడంలేదు. మిమ్మల్ని విశ్వసించలేను అనేస్తే చెప్పలేను గానీ నువ్వు నిస్సందేహంగా అంగీకరించవచ్చునని మాత్రం చెప్పగలను.


అమాత్యులారా! దయచేసి నన్ను అపార్ధం చేసుకోకండి. మీ మీద నమ్మకంలేక నేను కాదనడంలేదు. నా అశక్తతవల్ల కాదంటున్నాను. అవమాన భయంతో కాదంటున్నాను. పాపభీతితో కాదంటున్నాను. ఇక బాధ్యత అంటారా, మీరందరూ లేరూ, సమర్ధులు, అనుభవజ్ఞులు, పరిపాలనకేమి నిశ్చితంగా నిరాటంకంగా సాగుతుంది. నేను వెళ్ళి తపస్సు చేస్తాను. యోగ సిద్ధులు సంపాదిస్తాను. బాహు శాలినై శస్త్రాస్త్రకోవిదుడనై అన్ని సామర్థ్యాలూ సంపాదించుకొని తిరిగివస్తాను. అప్పుడు రాజ్యభారం భుజాలకు ఎత్తుకుంటాను. అందాకా మీకిది తప్పదు. అనువంశికంగా వస్తున్న అమాత్యులు కనుక మీరు ఈ బాధ్యతను కాదనటానికి వీలు లేదు.


No comments:

Post a Comment