Saturday 25 February 2023

శ్రీదత్త పురాణము (61)

 


ఆశ్రమంలోకి ఇంతమంది సేవకులు ఒక్కసారిగా ఎప్పుడు వచ్చిపడ్డారో ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో ఆశ్రమ వాసులెవ్వరికీ అంతపట్టడంలేదు. అయినా ఎవరు ఎవరినీ అడిగిందిలేదు. అందరూ అందరితోనూ హాయిగా సేవలు చేయించుకుంటున్నారు. ఆనందిస్తున్నారు. కాలం గడుస్తోంది.


ఒకనాటి ఉదయాన దత్తయోగికి ఇలాంటి సందేహమే కలిగింది. తన అంతరంగిక సేవకుణ్ణి అడిగాడు. ఎవరు మీరందరూ? ఎందుకు మాకు ఈ సేవలు చేస్తున్నారు? మీ రూపురేఖావిలాసాలు చూస్తోంటే దైవాంశ సంభవుల్లా కనిపిస్తున్నారు. మీ వినయవిధేయతలూ సేవాతత్పరతలూ మమ్మల్ని అందర్నీ ఆనందపరవశుల్ని చేస్తున్నాయి. సేవలు చేస్తున్నారు. సంతోషమే. కాని ఏమి కోరి ఈ సేవలు చేస్తున్నారు? సేవలు చెయ్యమని మీకు ఎవ్వరు చెప్పారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు?


దత్తయోగి ఇలా ప్రశ్నల పరంపర కురిపిస్తోంటే దేవేంద్రుడు మరింత చేరువకి వచ్చి సాష్టాంగపడ్డాడు. సన్నిధిలో నిలబడ్డాడు. చేతులు కట్టుకొని ఊర్ద్వకాయాన్ని వినయంగా వినమ్రంగా రవ్వంత ముందుకి వంచి, తుంపురులు యోగేంద్రుడి మీద పడతాయేమో అనే శంకతో తన అరచెయ్యిని నోటికి గూడులా అడ్డం పెట్టి బదులు పలికాడు. దత్తయోగేంద్రా! అన్నీ తెలిసే ఏమీ ఎరగనట్టు మీరిలా ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. అయినా మీరు అడిగారు కనుక నేను చెప్పాలి. మనవి చేస్తున్నాను. స్వామీ! నేను దేవేంద్రుణ్ని. ఈ పరిచారకులు అందరూ దేవతలు. జంభాసురుడు స్వర్గలోకం మీద దండెత్తి మమ్మల్ని పారద్రోలాడు. స్వర్గసీమను ఆక్రమించుకున్నాడు. దిక్కుతోచక మేమంతా నీ సన్నిధికి చేరుకున్నాము. మిమ్మల్ని సేవిస్తు మీ అనుగ్రహంకోసం ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాము. ఈనాటికి తమకు దయకలిగింది. ఆ జంభాసురుడ్ని ఓడించి మళ్లీ మా రాజ్యం మాకు ఇప్పించండి. యజ్ఞయాగాది క్రతువులు సజావుగా సాగే అవకాశం కల్పించండి. దానికి మీరొక్కరే సమర్థులు. ఇంక ఎవరివల్లా ఇది సాధ్యంకాదు అనుగ్రహించండి.


ఏమిటీ! నువ్వు దేవేంద్రుడివా! వీరంతా దేవతలా! ఆశ్చర్యంగా ఉందే. అష్టదిక్పాలకులకు అధిపతిని. నీ సేవలు నేను పొందడమా? అపచారం అపచారం. నేనొక సాధారణ తపస్విని. అందునా ఆచార భ్రష్టుణ్ణి. నీ సేవలు నేను పొందడంగానీ నీ దేవతలు సేవలు మా ఆశ్రమవాసులు పొందడం గానీ తగనిపని, తెలియక జరిగిన పొరపాటు. ఈ క్షణం నుంచీ మీరందరూ సేవలు విరమించండి. మీకే మేమంతా సేవలు చేస్తాం. తరిస్తాం. నీ సామ్రాజ్యాన్ని జంభాసురుడు ఆక్రమించుకున్నాడన్నావు. దాన్ని తిరిగి పొందడానికి సహకరించమంటున్నావు. తప్పకుండా మేమంతా సహకరిస్తాం.


No comments:

Post a Comment