హే వృషభధ్వజా! శుక్రవారంతో భరణి, సోమవారంతో చిత్ర, మంగళవారంతో ఉత్తరాషాఢ, బుధవారంతో ధనిష్ట, బృహస్పతితో శతభిష (అంటే గురువారంతో) శుక్రవారంతో రోహిణి, శనివారంతో రేవతి కలిసొచ్చే కాలాలు మానవులకు కలిసొచ్చే కాలాలు ఏ మాత్రమూ కావు. వీటికి విషయోగాలని పేరు. అవి దుష్కాలాలు.
పుష్య, పునర్వసు, రేవతి, చిత్ర, శ్రవణ ధనిష్ట, హస్త, అశ్వని, మృగశిర, శతభిష నక్షత్రాలు దుర్యోగాలను తప్పిస్తే సామాన్యంగా మంచివి. ఈ నక్షత్రాలలో జాతకర్మాది సంస్కారాలు చేయడం ఉత్తమం.
విశాఖ ఉత్తరఫల్గునీ, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, మఖ, ఆర్ద్ర, భరణి, ఆశ్లేష, కృత్తిక నక్షత్రాలు యాత్రలు చేయడానికి మంచివి కావు. మృత్యుభయముంటుంది.
(అధ్యాయం -59)
గ్రహదశ, యాత్రాశకున, సూర్యచక్రాది నిరూపణం
(ఈ పురాణంలో ఈయబడిన గ్రహాల మహాదశల యోగ్య సమయం, వాటి క్రమం పరాశర మహర్షి ద్వారా నిర్దిష్టమైన వింశోత్తరీ మహాదశతో అక్కడక్కడ ఏకీభవించడంలేదు. ఇందులో కేతుదశ కూడా కనబడుటలేదు)
మహేశాదులారా! ఇపుడు గ్రహాల మహా దశలను వర్ణిస్తాను. సూర్యుని దశ ఆరేళ్ళు, చంద్రునిది పదిహేను, మంగళునిది ఎనిమిది, బుధునిది పదిహేడు, శనిది పది, గురువుది పందొమ్మిది, రాహువుది పన్నెండు, శుక్రునిది ఇరవై ఒక్కటి.
సూర్యదశ (అనగా ఒక వ్యక్తి జీవితంపై సూర్యగ్రహాధిపత్యం కొనసాగే కాలం) దుఃఖములనే ఎక్కువగా కలిగిస్తుంది. ఉద్వేగాలను రేకెత్తిస్తుంది. రాజుని నాశనం దాకా తీసుకుపోతుంది.