Sunday 3 March 2024

శ్రీ గరుడ పురాణము (108)

 


అలాగే శూద్రులు రాజ్యాలేలుట వస్తు విక్రయము చేయుట కూడా పురాణాల్లో కనిపిస్తుంది. అనగా శూద్రులే ఆయా వర్ణాల పనులలో సాయపడి పనిని బ్రహ్మాండంగా చేయడంతో వారికి 'వర్ణోన్నతి' ని కల్పించి వారిని వర్ణము వారినిగా గుర్తించి వుంటారు. కాబట్టి హిందువుల్లో కులాల్లేవు. ఇప్పటి కులపు లెక్కలే 'అప్పట్లో' వుండుంటే మహాపద్మనందుడూ, చంద్రగుప్తుడూ మగధ రాజులూ, భారత సమ్రాట్టులూ కాకూడదు కదా! శ్రీకృష్ణుడు భగవంతుడే కాకపోనేమో! వర్ణాలు వర్ణాలే. కులాలు కులాలే.*

 

శిల్ప రచన, పాకయజ్ఞ, సంస్థల నిర్వహణ కూడా శూద్రులు చేయాల్సిన పనులే. ఇవి వర్ణధర్మాలు. ఇక ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్యాశ్రమాన్ని జీవితపు తొలినాళ్ళలో అందరూ పాటించాలి.

 

భిక్షాచరణ, గురు శుశ్రూష, స్వాధ్యాయము, సంధ్యావందనము, అగ్ని కార్యము. ఇవి బ్రహ్మచారుల ధర్మములు. బ్రహ్మచారులలో రెండు రకాల వారుంటారు. మొదటి రకం ఉపకుర్వాణులు. అంటే శాస్త్రోక్తంగా వేదాదులను ఇతర విద్యలను అధ్యయనం చేసి స్నాతకులై గురుకులాన్ని వీడి జనారణ్యంలోకి పోయి గృహస్థులయ్యేవారు.

 

రెండవ విధం నైష్ఠికులు - అంటే స్నాతకులైన తరువాత కూడా గురుకులంలోనే వుండి చదువుతూ, చదువునే బోధిస్తూ, బ్రహ్మజ్ఞానతత్పరులై, సాధకులై మృత్యుపర్యంతము గురుకులంలో వుండిపోయేవారు.

 

అగ్నికార్యము, అతిధిసేవ, యజ్ఞ, దాన, దేవతార్చనలు- ఇవి గృహస్థుల సంక్షిప్త ధర్మాలు, గృహస్థులలో సాధకులనీ, ఉదాసీనులనీ రెండు ప్రకారాల వారుంటారు. తన పరివారం యొక్క భరణ పోషణలలోనే మగ్నుడై వుండేవాడు సాధకుడు. పితృ, దేవ, ఋషి, ఋణాలను తీర్చుకొని, ఏకాకిగా ధర్మాచరణ చేస్తూ గృహస్థుగా జీవించేవాడు ఉదాసీన గృహస్థు. వీనిని మౌక్షికుడంటారు.

 

ఇక వానప్రస్థం, బాధ్యతలన్నీ తీరిన వారి స్థాయి ఇది. దశలో భూశయనం, ఫల - మూల ఆహారం, వేదాధ్యయనం, తపస్సు, తన సంపత్తిని తన వారికి యధోచితంగా పంచి యిచ్చుట ధర్మాలు. అరణ్యంలో తపస్సు చేసుకుంటూ, దేవార్చన, ఆహుతి ప్రదానం గావిస్తూ, స్వాధ్యాయాన్ని ఇష్టంగా చేస్తూ వుండే వానప్రస్థి తాపసోత్తమునిగా పరిగణింపబడతాడు. తపస్సుద్వారా, శరీరాన్ని శుష్కింపజేసి నిరంతరం భగవత్ ధ్యానంలో వుండే వానప్రస్థి చివరికాలంలో సన్యాసిగా గౌరవింపబడతాడు.


No comments:

Post a Comment