Tuesday 5 March 2024

శ్రీ గరుడ పురాణము (110)

 


ఇపుడు ఈ చతుర్వర్ణాలవారూ చేరుకొనే ఉత్తమ గతులను వినండి. వేద విహిత కర్మలన్నిటినీ ఆచరిస్తూ జీవించిన బ్రాహ్మణులు ప్రాజాపాత్య లోకప్రాప్తి నొందుతారు. యుద్ధంలో పారిపోకుండా, తమ ధర్మాలను పాటించిన క్షత్రియులు ఇంద్రస్థానాన్ని పొందగలరు. నిత్యమూ తమ ధర్మంలో రతులై జీవించిన వైశ్యులు మరుద్ దేవతల లోకాన్ని పొందుతారు. తమ వృత్తిని ప్రాణ సమానంగా ప్రేమించి జీవించిన శూద్రులకు గంధర్వలోకం ప్రాప్తిస్తుంది.


ఊర్ధ్వ రేతస్కులై, బ్రహ్మనిష్టలోనే మొత్తం జీవితాన్ని గడిపి వందల యేళ్ళ తపస్సు ద్వారా బ్రహ్మలోకంలో నొక ఉత్తమ స్థానాన్ని పొందిన ఋషులు ఎనభై ఎనిమిది వేలమంది మన భారతీయ పరంపరలో వున్నారు. ఆ స్థానమే గురుకుల నివాసియైన బ్రహ్మచారికి లభిస్తుంది. వానప్రస్థి దేహాంతంలో సప్తర్షిలోకాన్ని చేరుకుంటాడు. సన్యాసికి మోక్షం లభిస్తుంది. పునర్జన్మవుండదు. ఆ మోక్ష పదం పరబ్రహ్మ వ్యోమమనీ, ఈశ్వర సంబంధి పరమానంద నిలయమనీ, అమృతస్థానమనీ చెప్పబడింది. ఇదే ముక్తిపదం అష్టాంగమార్గ సమ్యక్ జ్ఞానానుష్ఠానాల వల్ల కూడా ప్రాప్తిస్తుంది. వాటిని గూర్చి వినండి.


అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము- ఈ అయిదింటి ని'యమ' (సునియమ)ములంటారు. ప్రాణులను బాధింపకుండుట అహింస, ప్రాణుల హితమునకే వాడబడు వాక్కు (సత్యము), ఇతరుల వస్తువులను కోరకుండుట, వాడకుండుట అస్తేయము, లైంగిక సంబంధము లేకుండ జీవించుట బ్రహ్మచర్యము, తనకున్నదంతా త్యాగం చేయడం అపరిగ్రహం*.


(* ఈ పదాలకు ఈ అర్థాలున్నది శాస్త్ర పరిభాషలో మాత్రమే. వీటి రూఢ్యర్థాలు - అంటే - లోకంలో స్థిరపడిన అర్ధాలు వేరు.)


శౌచ, సంతోష, తప, స్వాధ్యాయ, ప్రణిధానములనబడు అయిదింటినీ నియమములంటారు. శౌచమనగా శరీరాన్నీ పరిసరాలనూ మనస్సునూ పరిశుభ్రంగా వుంచుకొనుట. సంతోషమనగా తుష్టి, ఇంద్రియ నిగ్రహమే తపము, మంత్రజపమే స్వాధ్యాయము. భగవత్ పూజ నాదికములు ప్రణిధానము.


పద్మాది ఆసనములను భక్తితో వేసి జపము చేయుట ఆసనసాధనము.


No comments:

Post a Comment