Thursday 7 March 2024

శ్రీ గరుడ పురాణము (112)

 



నిత్యకర్మలు - అశౌచాలు


శాస్త్రవిహితమైన ప్రతి దినకర్మలను శ్రద్ధగా చేయువారికి దివ్యజ్ఞానం ప్రాప్తిస్తుంది. కాబట్టి ప్రతి మానవుడూ బ్రాహ్మీ ముహూర్తంలోనే మేలుకొని ధర్మార్థ చింతన చేయాలి.


విద్వాంసుడైన పురుషుడు ఉషఃకాలం కాగానే సర్వప్రథమంగా తన హృదయ కమలం లోనే నెలకొనియున్న ఆనంద స్వరూపి, అజరామరుడు, సనాతన పురుషుడునగు విష్ణు భగవానుని ధ్యానించాలి. తరువాత యథావిధిగా శౌచాదిక్రియలను చేసుకొని పవిత్ర నదిలో స్నానం చేయాలి. ప్రాతఃకాలంలో పవిత్ర స్నానం చేసేవారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ స్నానము లౌకిక, పారలౌకిక ఫలాలు రెండింటినీ ప్రాప్తింపజేస్తుంది.


రాత్రి సుఖంగా నిద్రించేవారికి తెలియకుండానే కొన్ని అపవిత్రతలు, అశుచులూ కలుగుతాయి. అందుచేత పొద్దున్నే స్నానం చేశాకనే సంధ్యావందనాది ధార్మిక కృత్యాలను మొదలుపెట్టాలి.


స్నానం ప్రాతఃకాలంలోనే చేయడం వల్ల అలక్ష్మి, సమస్త విఘ్న, అనిష్టకారిణియైన కాలకర్ణియను శక్తి, దుఃస్వప్న కారణంగా కలిగే చింతలూ, పాపాలూ కడుక్కుపోతాయి. నిజానికి, స్నానం లేని కార్యమేదీ ప్రశస్తం కాదు. అశక్తులు తలపై నీరు పోసుకోకుండానే స్నానం చేయవచ్చు. లేదా తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవచ్చు. దీనిని కాయిక స్నానమంటారు.


బ్రాహ్మ, ఆగ్నేయ, వాయవ్య, దివ్య, వారుణ, యౌగిక భేదములతో స్నానములారు రకములు. ఏది చేయడానికి తన కధికారముందో దాన్ని మానవులుచేయాలి. మంత్ర సహితంగా చేసి కుశదర్భల ద్వారా నీటి బిందువులను తొలగించుకొనేది బ్రాహ్మస్నానము. శిరసు నుండి సిరిపాదము దాకా యథావిధానంగా భస్మంతో అన్ని అంగాలనూ మెత్తుకొనేది ఆగ్నేయస్నానం. ఇలాగే గోధూళిచే మొత్తం శరీరాన్ని పవిత్రం చేసుకొనేది వాయవ్య స్నానం. ఇది ఉత్తమ స్నానంగా పరిగణింపబడుతోంది. ఎండ వుండగానే వర్షం కురిస్తే ఆ నీటిలో చేయగలిగే అరుదైన స్నానం దివ్యస్నానం. సాధారణ జలాలతో చేసేది వారుణ స్నానం. యోగం ద్వారా హరి యొక్క చింతనం చేయడం యౌగిక స్నానం. దీనినే మానస - ఆత్మ వేదనమంటారు. బ్రహ్మాకార అఖండ చిత్త వృత్తి అని బ్రహ్మవాదులందరిచేతా సేవింప బడేది కావున దీనినే ఆత్మతీర్థమని కూడా అంటారు. (తీర్థమంటే స్నానమని అర్థముంది)


No comments:

Post a Comment