Sunday 21 July 2024

శ్రీ గరుడ పురాణము (241)

 


గోవధచేసిన పాపి పంచగవ్యాలను మాత్రమే స్వీకరిస్తూ ఒక నెలపాటు మునివలె ఏ వికారాలూ లేకుండా గోశాలలోనే జీవిస్తూ గోసేవ చేయాలి. మాసాంతంలో యథాశక్తిగా గోదానం చెయ్యాలి.


ఉపపాతక శుద్ది చాంద్రాయణ వ్రతం వల్ల సిద్ధిస్తుంది. ఒక మాసం దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ 'పరాక' నామక వ్రతం చేసినా అదే ఫలముంటుంది.


క్షత్రియవధను చేసినవాడు ఒక ఎద్దునూ వేయి ఆవులనూ దానంచేయాలి లేదా బ్రహ్మహత్యకు నిర్దేశింపబడిన ప్రాయశ్చిత్తాన్ని మూడేళ్ళ పాటు చేసుకోవాలి. వైశ్యుని వధించిన వాడు వంద గోవులను దానం చేయాలి లేదా బ్రహ్మ హత్యాపాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని ఒక యేడాది పాటు చేయాలి. శూద్రుని హత్యచేసినవాడు గాని స్త్రీ ని వధించిన వాడు గాని బ్రహ్మహత్యా పాతక ప్రాయశ్చిత్త వ్రతాన్ని ఆరునెలల పాటైనా ఆచరించాలి లేదా సత్పాత్రునికి పది సవత్సపయస్వినీ గోవులను దానమైనా ఇవ్వాలి. ఇవన్నీ తెలియకగాని అజ్ఞానవశనగాని అప్రయత్నంగా గాని, చేసిన హత్యలకు ప్రాయశ్చిత్తాలు.


పిల్లి, ముంగిస, ఉడుము, కప్ప, సాధారణ పశువులు- వీటిని చంపడం కూడా పాపమే. ఈ పాపము చేసినవాడు మూడు రాత్రులు గడిచే దాకా పాలను మాత్రమే స్వీకరిస్తూ పాదకృచ్ఛవ్రత పాలనము చేయాలి. ఏనుగును వధించినవాడు అయిదు నీలవృషభాలను పేరుగల విశిష్టలక్షణాలున్న ఎద్దులను సత్పాత్రునికి దానం చెయ్యాలి. చిలుకనుగాని రెండేళ్ళ వయసున్న దూడని గానీ క్రౌంచపక్షిని గాని వధించిన వాడు మూడేళ్ళ వయసున్న దూడను దానం చేయాలి. గాడిద, మేక, గొఱ్ఱ్లలో నొక దానిని చంపినవాడొక ఎద్దును దానంచేయాలి. వృక్ష, గుల్మ, లతాదులను నరికి వేసిన ద్విజుడు నూరుమార్లు గాయత్రిని జపించాలి. 


No comments:

Post a Comment