Monday 22 July 2024

శ్రీ గరుడ పురాణము (242)




తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టంలేకున్నా మధు, మాంసాలను సేవించినవాడు కృచ్ఛవ్రతాన్నీ అన్యశేష వ్రతాల్నీ ఆచరిస్తే ఆ పాపం శాంతిస్తుంది. గురువుగారు చెప్పిన పనిని చేస్తూ గాని మార్గంలోగాని శిష్యుడు మృతి చెందితే ఆ పాపం గురువును ముట్టుకుంటుంది. గురువు దానికి ప్రాయశ్చిత్తంగా మూడు కృచ్ఛవ్రతాలనాచరించాలి. గురువు గారిని అసంతృప్తికి గురిచేసిన శిష్యునికి మాత్రం ఆ గురువుగారిని ప్రసన్నుని, సంతృప్తుని (సంతుష్టుని) చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. గురువుగారిని బాధించిన పాపం పోవాలంటే ఆ గురు ప్రసన్నతే తప్ప మరో దారిలేదు.


నిర్దోషులనూ, అమాయకులనూ పాపులని దూషించి దొంగఋజువులతో నిరూపించే ప్రయత్నం చేసేవాడు మహాపాపి. వీనికి ప్రాయశ్చిత్తం జితేంద్రియుడై, ఒక నెలపాటు మంచి నీళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ పాపమోచన మంత్రమును జపించుట.


అసత్ ప్రతి గ్రహం అనగా అపసవ్య దానమును పుచ్చుకొనుట కూడా పాపమే. దీనికి ఒక మాస పర్యంతం బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పయోవ్రతం అనగా పాలనే ఆహారంగా తీసుకొనే వ్రతమును చేస్తూ పశువులసాలలో నివాసముంటూ సదా గాయత్రిమంత్రాన్ని జపిస్తూ గడపడం ప్రాయశ్చిత్తంగా చెప్పబడింది.


వ్రాత్యుని కుపనయనం చేసి యజ్ఞం చేయించిన వాని కంటుకొనే పాపం మూడు కృచ్ఛ వ్రతాలను ఆచరించడం వల్ల నశిస్తుంది. అభిచారకహోమం (మంత్రం ద్వారా అపకారం) వల్ల వచ్చే పాపానికీ ఇదే ప్రాయశ్చిత్తం*. *వేదప్లావి ఒక సంవత్సరం పాటు యవలనే తిని బతకాలి.


* యాజ్ఞవల్క్య స్మృతిలోని 288వ శ్లోకానికి చేయబడిన మితాక్షర వ్యాఖ్యలో ప్రకృతంలో విప్లవ శబ్దానికి మూడర్దాలు చెప్పబడ్డాయి 1. వేదాన్ని రక్షించవలసిన బాధ్యత గలవాడు దానికి తగ్గ సామర్థ్యముండి కూడా ఆ పనిని చేయకపోవడం వేద విప్లవం. 2. అనధ్యయన లేదా అనధ్యాయ కాలంలో వేదాన్ని అధ్యయనం చేయడం అధ్యయన విప్లవం 3. వేదాధ్యయన సమర్థుడూ, వేదాధ్యయనం చేసి గొప్ప స్థాయికి తానుపోయి వేదాన్నిగొని పోగలిగే దక్షుడూ అయినవానికి సరిగ్గా చదువు చెప్పకుండా నిరుత్సాహానికి వానిని గురిచేయడం విప్లవం. ఈ మూడు దోషాల్లో దేనికి పాల్పడినా ఆ దోషి వేదప్లావి అనబడతాడు.


* * వేదమూ ధర్మము క్షుణ్ణంగా తెలిసిన ముగ్గురు లేదా నలుగురు బ్రాహ్మణులతో ఎక్కడిక్కడ ప్రాయశ్చిత్త పరిషత్తులను ఏర్పాటు చేసుకోవచ్చు. మరీ చిన్న గ్రామాలలో నైతే వేదమూ, ధర్మ శాస్త్రమూ బాగా తెలిసిన బ్రహ్మవేత్తయగు ఒక బ్రాహ్మణునే పరిషత్తుగా నిర్ణయించుకొని ఆయనకే సర్వాధికారాలనూ సమర్పించవచ్చు. ఈ విషయం యాజ్ఞవల్క్యస్మృతి, ఆచారాధ్యాయం, 9వ శ్లోకంలో నిర్దేశింపబడింది.


No comments:

Post a Comment