Saturday 20 July 2024

శ్రీ గరుడ పురాణము (240)

 


ప్రాయశ్చిత్త కర్మలో మరొక విశేషమేమనగా హత్యాప్రయత్నం చేయడమే తప్పు అవతలి వ్యక్తి మరణించినా, ఏదో చావు తప్పి కన్ను లొట్టపోయి బతికి బయటపడినా హత్యకి చెప్పబడిన ప్రాయశ్చిత్త కర్మను చేసుకోకతప్పదు. అంటే అవతలి వాడు చావకపోయినా హత్యా ప్రయత్నంచేసిన వానికి హత్యాపాపమే అంటుకుంటుంది.


మదిరాపానానికి ప్రాయశ్చిత్తం అగ్నివలె వేడెక్కి పొగలు గ్రక్కుతున్న మద్యాన్ని గానీ, సలసలమరుగుతున్న గోమూత్ర, గోదుగ్ధ, గోఘృతాలలో నొకదానిని గాని ఆపకుండా ఆగకుండా భగవన్నామస్మరణ చేస్తూ త్రాగుట. నీరనుకొని మద్యం పొరపాటున తాగేసినవారు జడలు పెంచుకొని మలిన వస్త్రాలను కట్టుకొని మరుగుతున్న నేతిని త్రాగుతూ బ్రహ్మహత్యకు గల ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాలి. తరువాత తన వర్ణానికి తగిన సంస్కారాన్ని చేసుకోవాలి.


వీర్య పానం, సురాపానం, మూత్రపానం, చేసే బ్రాహ్మణి సద్గతి నందకపోగా క్రమంగా గద్ద, కుక్క, పంది యోనుల్లో పుడుతుంది. బ్రాహ్మణుని బంగారాన్ని అపహరించిన వానికి ప్రాయశ్చిత్త కర్మ మేమనగా వాడొక రోకలిని మోసుకొని రాజ సభలోకి (న్యాయస్థానం అప్పట్లో అదే) పోయి తాను చేసిన పాపాన్ని ప్రకటించి రాజు విధించినన్ని దెబ్బలు ఆ రోకటి తోనే తినాలి. ఈ శిక్షాక్రమంలో వాడు మరణించినా, శిక్షానంతరం జీవించినా పవిత్రుడే అవుతాడు. (తెలుగిళ్ళలో ఒక మాటుంది. రాజదండనవుంటే ఇక యమదండన వుండదని.) ఇలా చేయనివారు తమ తప్పునొప్పుకొని తమయెత్తు బంగారాన్ని ఆ బ్రాహ్మణునికి సమర్పించుకున్నా ఆ పాపం పోతుంది.


గురుపత్నితో గమించినవాడు ఎఱ్ఱగా కాలుతున్న ఇనుప స్త్రీ విగ్రహాన్ని కౌగలించుకొని ప్రాణత్యాగం చేయాలి లేదా తన లింగాన్నీ, అండకోశాల్ని తానే కత్తిరించుకొని నైరృత్య దిశవైపు విసిరేయాలి). ఈ మహా పాపానికి ఇంకా రెండు రకాల ప్రాయశ్చిత్తాలు చెప్పబడ్డాయి. పశ్చాత్తపించిన వాడు మూడు సంవత్సరాల పాటు ప్రాజాపాత్య, కృచ్ఛవ్రత పాలనను చేయాలి లేదా మూడు మాసాల పాటు చాంద్రాయణ వ్రతం చేస్తూ ఏకదీక్షగా వేదసంహితను పఠిస్తూ వుండాలి. దీక్షపూర్తయితే పాపం పోతుంది.


No comments:

Post a Comment