Tuesday 23 July 2024

శ్రీ గరుడ పురాణము (243)

 


శరణని వచ్చి ఆశ్రయించిన వానికి దక్షత వుండీ కూడా శరణివ్వని వాడి పాపానికీ ఇదే తగిన ప్రాయశ్చిత్తం.


గాడిదపైగాని ఒంటిపైగాని ప్రయాణించేవాడు మూడు ప్రాణాయామాలు చేయాలి. తెలియక, అనగా అవి పాపములని తెలియక, చేసిన నగ్నస్నానము, నగ్నశయనము, పగటిపూట రతి అనే పాపాలు కూడా మూడు ప్రాణాయామాల ద్వారా నశిస్తాయి. గురుజనులను 'నీవు' అని సంబోధించరాదు. అట్టి పాపము ఆ గురు జనుల ప్రసన్నతవల్ల పోతుంది. బ్రాహ్మణుని కొట్టడానికి వెళ్ళడమే పాపం. దానికి కృచ్ఛ వ్రతమే ప్రాయశ్చిత్తం. క్రోధంలో ఒళ్ళు మరచిపోయి బ్రాహ్మణుని కొట్టిన పెనుపాపము అతి కృచ్ఛవ్రతమున గాని తీరదు.


విఖ్యాతమైన పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని గురుజనులు అనగా పరిషత్తు నిర్ణయాన్ని బట్టి కూడా చేయవచ్చు.


విఖ్యాతం కాని పాపాలకు గుప్త రూపంలోనే ప్రాయశ్చిత్త నిర్ణయం చేయబడాలి. దీని భావమేమనగా ఒక వ్యక్తి బ్రహ్మహత్య చేసినట్లు అతనికే తరువాత తెలిసిందనుకుందాం. ఊరిలో ఇంకెవరికీ తెలియదనుకుందాం. అప్పుడా వ్యక్తి పరిషత్తులో నొకనిని కలుసుకొని తనకి తెలియకుండానే తనవల్ల జరిగిన బ్రహ్మహత్యకు పాపమంటకతప్పదు కాబట్టి ప్రాయశ్చిత్తాన్ని వేడితే ఆయన చెప్పేది గుప్త రూపంలో నున్న ప్రాయశ్చిత్త మనబడుతుంది. ఈ ప్రాయశ్చిత్తాలలో కొన్ని ఇలావుంటాయి.


బ్రహ్మహత్య చేసిన పాపి మూడు రాత్రులు గడిచేదాకా ఉపవాసం చేసి విశుద్ధ జలాల మధ్య అనగా నదీ సరోవరాదులలో పీకల దాకా మునిగి అఘమర్షణ మంత్రాన్ని జపించాలి. మూడు రాత్రులు దాటాక వచ్చే పగటిపూట ఒక పాలిచ్చే ఆవును సత్పాత్రునికి దానమివ్వాలి.


ఈ విధంగా తపించి, జపిస్తే అజ్ఞానవశాన తన చేత జరిగిన బ్రహ్మహత్యా పాతకం నశిస్తుంది. దీనికే మరొక ప్రాయశ్చిత్తం కూడా చెప్పబడింది. బ్రహ్మహత్య కర్త ఒక పగలూ ఒక రాత్రి వాయుభక్షణ మాత్రమే చేస్తూ శుద్ధ జల మధ్యంలో అలా నిలబడే వుండిపోయి తెల్లవారగానే బయటికి వచ్చి లోమభ్యస్వాహా మున్నగు ఎనిమిది మంత్రాలనూ ఘోషిస్తూ ఒక్కొక్క దానితో అయిదేసి ఆహుతులను యథావిధానంగా అగ్నిలో వ్రేల్చాలి*.


* ఈ మంత్రాలు యాజ్ఞవల్క్యస్మృతిలో 247వ శ్లోకంలో కనిపిస్తాయి.


No comments:

Post a Comment