Sunday 6 July 2014

షిరీడి సాయి

ఈ మధ్య షిరీడి సాయినాధుడి పై రేగిన వివాదం గురించి చాలామంది మిత్రులు నన్ను వివరణ అడిగారు. దానికి నేను చెప్పదలుచుకున్నది ఇదే

సనాతన హిందూ ధర్మంలో ఈ లోకమంతా దైవమే. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అని ఈశావాశ్యోపనిషద్ అంటుంది. ప్రతి అణువు కూడా దైవమే, దైవం లేని ప్రదేశమంటూ ఏదీ లేదు. అన్నీ తానై ఉన్నాడు పరమాత్మ. ఈశ్వరుడికి, జీవుడికి బేధం ఉపాధి మాత్రమేనని రమణ మహర్షి ఉపదేశం. ఉపాధి అంటే శరీరం, దానితో పాటు ఉన్న కామక్రోధాది అరిషడ్వర్గాలు, అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని తొలగిస్తే, జీవుడు ఈశ్వరుడినితో ఏకమవుతున్నాడు. ఆత్మానుభూతి పొందిన జ్ఞాని లోకంలో తిరిగే దైవం. దైవానికి, ఆత్మను తెలుసుకున్న జ్ఞానికి తేడా లేదు. అందరిలోనూ దైవం ఉన్నాడు. కనుక ఒక వ్యక్తి దేవుడా? కాదా? అన్న దానికి సమాధనం మన దగ్గరే ఉంది.

అయితే వేదం మనకు కొన్ని దైవరూపాలను నిర్దేశించింది. వారిని దైవాలుగా ఆరాధించాలి. ఆ దైవాన్ని చేరే మార్గాన్ని చూపించే వ్యక్తే గురువు. శ్రీ సాయిబాబా కూడా గురువే. గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, పరబ్రహ్మ కూడా. గురువు పాదాలపై మనసు లగ్నం కానీ వాడికి ఎన్ని సంపదలుంటే మాత్రం ఏం లాభం అంటారు ఆది శంకరులు. నాకు భగవంతుడు, గురువు ఇద్దరూ ఏకకాలంలో కనిపిస్తే, ముందు గురువుకే నమస్కరిస్తాను అన్నారు కబీర్. ఎందుకంటే భగవద్ దర్శనానికి తగిన మార్గం చూపించింది గురువే కనుక. అందువల్ల సాయిబాబాను గురువుగా పూజించడంలో తప్పులేదు. కానీ గురువు పూజల వల్ల సంతోషించడన్న విషయం ఎప్పుడు మరువకూడదు. అసలు గురువు ఎప్పుడు తనను పూజించమని కోరడు. గురువు శరీరంతో ఉన్నది పదిమందిని ఉద్దరించడానికే. ఆయనకు శరీరంతో పనేలేదు. కానీ తన జీవితంలో అనేక బోధనలు చేసి, తాను కొన్ని స్వయంగా ఆచరించి తన శిష్యులకు మార్గం చూపిస్తారు. ప్రతీ వ్యక్తికి తన జీవితంలో ఎదురయ్యే వేల ప్రశ్నలకు సమాధానాలన్నీ గురువు ముందే చెప్పి ఉంటారు. గురువును ఏ విధంగా పూజించాలనే సందేహం వస్తే, దానికి ఒక్కటే జవాబు. గురువు బోధనలను జీవితంలో ఆచరించడం, ఆయన చెప్పినట్టు జీవించడమే గురుపూజ. బాబా చెప్పినట్టుగా జీవించడమే బాబాకు చేసే మహోన్నతమైన పూజ.

బాబా మందిరంలో విగ్రహం క్రింది ప్రతిష్ట చేసేది దత్త యంత్రమే. సాయిబాబాకు ప్రత్యేకించి యంత్రం అంటూ ఏదీ లేదు. సాయిబాబాను దత్తాత్రేయ అవతారంగా, అబధూతగా పుజిస్తారు భక్తులు. ఇక బాబా మతం గురించి ప్రస్తావన తెచ్చారు. ఒక గురువుకు మతం అంటగట్టకూడదు కానీ, ఒకవేళ అలా చెప్పవల్సి వస్తే, బాబా శివపార్వతుల అంశతో, తెలంగాణాలో (అప్పటి హైద్రాబాదు సంస్థానంలో) బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారని సత్యసాయిబాబా చెప్పారు.

భక్తుడి భక్తి మెచ్చిన భగవంతుడే, గురువు రూపంలో దిగివచ్చి, భక్తుడిని అంతర్ముఖం చేసి, జ్ఞానం ప్రసాదిస్తారని రమణ మహర్షి చెప్పినమాటను మర్చిపోకూడదు. అయినా గురువుల విషయంలో ఇలాంటి చర్చలు అనవసరం. 

4 comments:

  1. అద్భుతంగా సెలవిచ్చారు సోదరా!! తల్లి,తండ్రి,గురువు,దైవం... ఈ ప్రక్రియలో మొదటి ముగ్గురు తర్వాతే దైవమైనా అనే సత్యాన్ని చక్కగా ఆవిష్కరించారు... ధన్యవాదములు!!

    ReplyDelete
  2. చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete