Wednesday, 16 September 2015

గణేశ చతుర్థీ నియమాలు

వినాయక చవితి గురించి చెప్తూ ప్రాతః శుక్లతిలైః స్నాత్వా మధ్యాహ్నే పూజయేన్నృప అని బ్రహ్మాండపురాణ అంటున్నది. అనగా వినాయక చవితి రోజున ప్రాతః కాలంలో తెల్ల నువ్వులతో స్నానం చేసి, మధ్యాహ్నం సమయంలో గణపతిని పూజించాలి అని. ప్రాతఃకాలం అంటే సూర్యోదయానికి గంటన్నర సమయం ముందు. ఆ సమయంలో తలపై తెల్లని నువ్వులు ధరించి స్నానం చేయాలి. మధ్యాహ్న సమయం వరకు ఉపవసించి, అటు తర్వాత గణపతిని పూజించాలి. మద్యాహ్నసమయం అంటే 12 అనుకోనవరసరంలేదు. 10 గంటల తర్వాతి నుంచి దాన్ని మద్యాహ్న సమయంగానే చెప్పడం కొన్ని గ్రంధాల్లో కనిపిస్తుంది. ఈ పూజలో భాగంగా గంధము, పువ్వులు, అక్షతలు  కలిసిన గరికపోచలు సమర్పించాలి. కుటుంబసభ్యులంతా కలిసి పూజించడం శ్రేష్టం. అది కుదరని పక్షంలో, ఎలా వీలైతే అలా పూజించాలి.

భాద్రపద శుక్ల చతుర్థీ అనగా వినాయకచవితి పూజా నియమాల గురించి ముద్గల పురాణంలో చెప్పబడింది. అందులో కణ్వమహర్షి భరతునికి గణపతి తత్వాన్ని, భాద్రశుక్ల చవితి వ్రత మహిమను వివరించారు. అందులో భాగంగా ప్రధానమైన నియమం గణపతి యొక్క మూర్తిని మట్టితో మాత్రమే చేసి పూజించడం. బంగారం, వెండి మొదలగు విగ్రహాల గురించి కూడా అందులో ప్రస్తావన లేదు. ఒకవేళ గణపతి ప్రతిమ అందుబాటులో లేకపోతే, మట్టిబెడ్డను పూజించినా, అది కూడా లేనిపక్షంలో చిన్న పసుపు ముద్దూలోకైనా గణపతి ఆవహన చేసి యధాశక్తి పూజించాలి. గణపతి శాపం కారణంగా ఈ రోజున చంద్ర దర్శనం చేసుకోకూడదు. గణపతి జన్మవృత్తాంతం, చంద్రునికి శాపం, శమంతకోపాఖ్యానం వినాలి, లేక చదివి, అక్షతలు తలపై ధరించాలి.

భాధ్రపద శుద్ధ చవితి నాడు పూజించే గణపతికి వరసిద్ధి గణపతి అని పేరు. వరములను సిద్ధిమజేసేవాడు ఈయన. కోరినవన్నీ ఇచ్చేస్తాడు. కావల్సింది గణపతి పట్ల భక్తి, ప్రేమ, ధర్మనిష్ఠ. ఈ రోజు గనక గణపతిని యధాశక్తి పూజించి, ఆయన అనుగ్రహం పొందితే, జీవితంలో సాధించలేనిదంటూ ఏదీ ఉండదు.

సాధ్యమైనంతవరకు ఓం శ్రీ గణేశాయ నమః అనే గణపతి మంత్రాన్ని జపించాలి.

ధృక్ పంచాంగం ప్రకారం రేపు మద్యాహ్న గణేశ పూజా సమయం - హైద్రాబాదు వారికి - ఉదయం 10.58 ని|| నుంచి 01.23 ని|| వరకు.
మీ ప్రాంతాల్లో గణపతి పూజా సమయం కోసం ఈ లింక్ లో తెలుసుకోవచ్చు.
http://www.drikpanchang.com/festivals/ganesh-chaturthi/ganesh-chaturthi-date-time.html

గతేడాది, అంతకముందు సంవత్సరాలు ప్రచురించిన అనేక విషయాలను ఈ లింక్ లో చూడవచ్చు లేదా వినాయక చవితి లేబుల్ లో చూడవచ్చు.
http://goo.gl/6ADYw6

No comments:

Post a Comment