Thursday, 24 September 2015

దయానంద సరస్వతీ శివైక్యం

స్వామి దయానంద సరస్వతీ నిన్న రాత్రి (23-09-2015) 10.40 నిమిషాల ప్రాంతంలో ఋషికేష్‌లో భౌతిక దేహాన్ని వదిలి, శివైక్యం చెందారు. స్వామి దయానంద వద్ద శిష్యరికం చేసిన దయానందులు, సమకాలీన సమాజంలో వేదాంతాన్ని అందరికి సులభంగా, వివరంగా, స్పష్టంగా అర్దమెయ్యేలా బోధ చేశారు. 130 దేశాల్లో వీరు పర్యటనలు చేసి, సనాతనధర్మాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ప్రపంచంలో అనేకదేశాల్లో ఆశ్రమాలను, ఆర్షవిద్యా గురుకులాలను స్థాపించి, జ్ఞానబోధ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి, పరిపూర్ణనంద స్వామీజికి ఈయనే గురువు. ఏ గురువైనా శిష్యులను తయారు చేస్తారు, కానీ దయానందులు తనలాంటి అనేక గురువులను తయారు చేశారు.

ప్రపంచంలో అత్యంత మేధావిగా గురువు గారిని కొనియాడవచ్చు. 2000 సంవత్సరంలో ఐక్యరాజ సమితి నిర్వహించిన అంతర్జాతీయ సభకు అన్ని మతాల తరఫున అనేక మత గురువులు హాజరు కాగా, హిందూ ధర్మం తరఫున దయానందులు హాజరయ్యారు. ప్రపంచ శాంతి కోసం అన్ని మతాలు సహనంతో జీవించాలి అని ఒక క్లాజ్‌తో ఉన్న ఒప్పందం మీద సంతకం చేయాల్సి వచ్చినప్పుడు, దాన్ని గురువు గారు తిరస్కరించారు. సహనం అనేది పాత శతాబ్దపు మాట. సహనంతో వ్యవహరించడమంటే అన్యమతాలు ధూషిస్తున్నా, వారిని ఎదురించక, ఓర్పు వహించి మౌనంగా ఉండడం. క్రైస్తవం, ఇస్లాం అన్యమతాల పట్ల దాడులు కొనసాగించినా, వారు మౌనం వహించాల్సి వస్తుందని, దానికి బదులుగా పరస్పర గౌరవం అనే నిబంధనను చేర్చాలని పట్టుబట్టి, అందరిని ఓప్పించినవారు దయానందులు. ఆ సమావేశానికి ఇప్పటి పోప్ కూడా హాజరు కాగా, దయానందులు చెప్పిన సవరణతో ఖంగు తిన్నారు. క్రైస్తవం, ఇస్లాం మొదలైన మతాలు అన్యమాతలను గౌరవించవు, వాటిని సత్యమని అంగీకరించవు. అటువంటప్పుడు అలా గౌరవిస్తామని ఒప్పుకోవడం ఆ మతస్థులకు ఇష్టంలేదు. అయినా దయానందుల వాదనే నెగ్గింది. అవతలివారు గౌరవిస్తేనే మనం కూడా గౌరవించాలి. అవతలివారి ప్రవర్తనను బట్టే మన ప్రవర్తనా ఉండాలి. అదే పరస్పర గౌరవం. అలా ఉన్నప్పుడు మాత్రమే సామరస్యంతో ప్రపంచం ముందుకు సాగగలదనేది దయానందులు వాదన.

అంతేకాక హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టడానికి 100 ఏళ్ళకు పైగా చరిత్ర ఉన్న మఠాలను, సంప్రదాయ పీఠాధిపతులను సనాతన ధర్మ ఆచార్య వేదిక అంటూ ఒకే వేదిక మీద తీసుకువచ్చి, ధర్మం కోసం అందరూ ఐక్యంగా ఉండాలంటూ పిలుపునిచ్చింది దయానందులే. అలా వచ్చిన ఆచార్య సభ అనేక విజయాలను సాధించింది. తిరుమల వెంకన్నవి 7 కొండలు కాదు, 2 కొండలే అని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద జీవో ని వెనక్కు తీసుకునేలా చేసింది ఈ ఆచార్యసభయే. రామసేతును కూల్చాలని చూసినప్పుడు కూడా ఆచార్యసభ గట్టి వాదనను వినిపించి, ప్రతిపాదనను ఆపింది. ఇలా దయానందులు సనాతనధర్మ రక్షణ కోసం అనే కార్యక్రమాలు చేసి, తమ జీవితాన్ని సనాతనధర్మానికి, వేదాంత ప్రచారానికి అంకితం చేశారు.

దయానంద చరణౌ మనాసా స్మరామి   

No comments:

Post a Comment