Saturday, 5 September 2015

పరమపూజ్యుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి గురించి ఈ లోకంలో జరిగే దుష్ప్రచారంలో నిజంలేదు.

ఓం నమో భగవతే వాసుదేవాయ

పరమపూజ్యుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి గురించి ఈ లోకంలో జరిగే దుష్ప్రచారంలో నిజంలేదు.

కృష్ణుడిని దొంగా అంటున్నారు. శ్రీ కృష్ణుడి బాల్యం మొత్తం గోకులంలో, బృందావనంలో గడిచింది. యశోదానందుల ప్రేమానురాగల మధ్య ఆప్యాయంగా పెరిగాడు కృష్ణుడు. నందుడి ఇంట్లో 1000 ఆవులు ఉండేవి. ఇన్ని ఆవుల నుంచి ఎన్ని పాలు వస్తాయి, ఎంత పెరుగు వస్తుంది, ఎంత వెన్న ఇంట్లో ఉండాలి. ఇంత వెన్న ఇంట్లో ఉంటే ఇక బయటకు వెళ్ళి దొంగతనం చేయాల్సిన అవసరం కృష్ణుడికేంటి? ఒకవేళ అలా చేశాడే అనుకుందాం, నందుడు బృందావనానికి రాజు. మరి తన కుమారుడు మిగితా ప్రజల ఇళ్ళలో దొంగతనం చేస్తుంటే నందుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటాడు? చిన్నప్పుడు మనం అల్లరి చేసినట్టుగానే కృష్ణుడూ చేశాడు. కాలక్రమంలో కృష్ణ భక్తుల ఆయన చేసిన ఒకటి రెండు చిలిపి పనులను భక్తితో బాగా వర్ణించడం మొదలుపెట్టారు. భక్తితో చూసినప్పుడు అది భగవానుడి ఆడిన దివ్యలీల. అంతకుమించి ఆయన దొంగా కాదు, ఆయనకు దొంగతనం చేయవలసిన అవరసము లేదు.

కృష్ణుడు పసివాడిగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి ఆయన్ను చంపడానికి వచ్చి, కృష్ణుడెవరో తెలియక ఆయన వయసున్న మగపిల్లలందరిని చంపేసింది. ఇక ఆయన పెరిగి పెద్దవాడయ్యేసరికి బృందావనంలో ఆయన తప్ప ఆయన వయసు మగపిల్లలు ఎవరూ లేరు. ఉన్నది ఒక్కడే మగపిల్లవాడు, పైగా వాళ్ళ రాజైన నందుడి కొడుకు, మహా సౌందర్యవంతుడు, చిలిపివాడు, చలాకీవాడు. అందువల్ల అందరిచే ప్రేమించబడ్డాడు. అందరు ఆయన్ను ముద్దు చేశారు, గారాభంగా చూశారు. అదే చనువుతో కృష్ణుడు అందరి ఇళ్ళలోకి వెళ్ళి పాలు, పెరుగు తిన్నాడు. బృందావనంలో తన వయసు మగపిల్లలు ఎవరు లేకపోవడంతో ఆయన ఆడపిల్లలతోనే ఆడుకోవలసిన పరిస్థితి. అందుకే ఆయన గోపికలతో ఆడుకున్నాడు (రాసలీల కాదు). వాళ్ళతోనే కలిసి తిరిగాడు. స్నానం చేస్తున్న గోపికల చీరలను ఎత్తుకోపోయాడు, ఇదేనా మీ దేవుడి వ్యక్తిత్వం అంటూ విమర్శించే వారున్నారు. 7 ఏళ్ళు కూడా లేని పసిపిల్లవాడిని పట్టుకుని, అతనిలో అశ్లీలభావాలున్నాయని చెప్పడం ఎంతవరకు తార్కికంగా, సమంజసంగా  ఉంటుంది. అది ఆలోచించకుండా కృష్ణుడిని విమర్శించేవారు మూర్ఖులు మాత్రమే. రాసలీల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు అది అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థాయికి సంబంధించిన అంశం. అక్కడ శరీరాలు ఉండవు. జీవాత్మ, పరమాత్మ మాత్రమే ఉంటారు. జీవాత్మతో పరమాత్మ ఆడే దివ్యలీలనే రాసలీల. ఆ స్థాయిలో జీవుడిని స్త్రీగా, పరంధాముడిని పురుషుడిగా సంబోధిస్తారు.  ఇదంతా భౌతికస్థాయిలో బ్రతికేవారికి ఎప్పటికి అర్దం కాదు.

ఇదంతా కృష్ణుడికి 7 ఏళ్ళ వయసు వచ్చేవరకు మాత్రమే జరిగింది. ఆయన 7 ఏళ్ళ వయసు రాగానే సాందీపాని మహర్షి వద్ద చదువుకోవడానికి వెళ్ళాడు. ఆ కాలంలో విద్యాభ్యాసం కనీసం 12 సంవత్సరాలు. విద్యాభ్యాసం ముగియగానే మళ్ళీ బృందావనానికి రాకుండా నేరుగా మధురకు వెళ్ళిపోయాడు. తర్వాత రుక్మిణీ దేవితో వివాహం జరిగింది. వివాహం తర్వాత రుక్మిణి దేవితో కలిసి బధ్రీనాధ్ వెళ్ళి ఒక ఋషి దగ్గర 8 ఏళ్ళ పాటు ఆశ్రమవాసం చేశారు. కఠోరబ్రహంచర్య నియమాలతో, భూశయనం చేస్తూ గడిపారు. ఎలా చూసిన కృష్ణుడు గోపికలతో కలిసి ఆడుకున్నది ఆయనకు 8 ఏళ్ళు రాకముందు, పసిపిల్లవాడిగా. 8 ఏళ్ళ పిల్లవాడు ఆడిన ఆటను రాసలీల అని భక్తులు పవిత్రభావనతో అంటే, కొందరు ఇదే విషయాన్ని పెట్టుకుని ఆయనకు గోపికలతో శారీరిక సంబంధం ఉన్నదని దుష్ప్రచారం చేస్తున్నారు. హవ్వ!................. 8 ఏళ్ళ పిల్లవాడి మీద ఇన్ని అపనిందలా? పరమపురుషుడైన శ్రీ కృష్ణుడి శీలాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి ఇటువంటి విషయాలు. ఆఖరికి హిందువులు కూడా ఎవరైనా రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ఆడపిల్లల బ్రతుకును నాశనం చేస్తే, ఈయన కలియుగ కృష్ణుడంటారు.కృష్ణుడు పరమధర్మాత్ముడు, కృష్ణుడిని విమర్శించే స్థాయి మనకు లేదు. కృష్ణుడుని విమర్శించే ముందు ఇవి కాస్త గుర్తుంచుకోండి.

ఓం నమో భగవతే వాసుదేవాయ  

Originally Published: 27-Aug 2013
1st Edit: 5-sep 2015

1 comment:


  1. శ్రీ కృష్ణ స్వాముల వారు గ్లోబలైజ్ అయిపోయారు ఇక గ్లోబలైజేషన్ అంటే మజాకా ! అన్నిటికి, అన్ని అపవాదులని ఎదుర్కోడానికి స్వామి వారు రెడీ గా ఉండాలి.

    ఆయన కాలం లో నే ఆయన్ని ఎంత మంది దుర్భాషణలు ఆడ లేదూ ? అన్నిటికి జవాబిచ్చేడు . ఇక ఇప్పుడు వస్తన్న వన్నీ ఒక లెక్ఖా ?

    జిలేబి

    ReplyDelete