Friday 18 September 2015

సార్వజనీన గణపతి

ఒక్క హిందూ ధర్మమే కాక, భౌద్ధం, జైనం వంటి అనేకమతాలు, భిన్న సంస్కృతులు, ప్రపంచ నలుమూలల అనేమంది ప్రజలచే ఆరాధించవడే దైవం గణనాధుడు. గణపతి ఆరాధన ప్రజలలో ఐక్యతను పెంచుతుంది. సనాతనధర్మంలో అనేకమంది దేవతామూర్తులను చెప్పబడ్డాయి. ఒక్కో దేవతను అనుసరించి, ఆ శక్తిని అనుసరించి, ఆ దేవతార్చనకు అనేకానేక నియమాలు ఉంటాయి. అవి అందరికి సాధ్యమయ్యేవి కావు. కానీ వినాయకుడికి విషయానికి వచ్చేసరికి మాత్రం, ఆయన ఆరాధనకు ప్రత్యేక నియమాలను స్మృతికారులు చెప్పలేదు. ఆయన ఆరాధన అందరు సులభంగా చేయవచ్చని చెప్పారు.

వినాయకుడి ఆరాధన యుగయుగాల నుంచి ఉంది. శివపార్వతుల కల్యాణంలో కూడా ముందు గణపతిని పూజించాకే వివాహక్రతువు మొదలుపెట్టారు. సృష్టిపూర్వం బ్రహ్మదేవుడు కూడా గణపతి పూజించి, విఘ్నాలను తొలగించుకున్నాడు. కానీ అప్పటికి గణపతి నిరాకారుడు. పార్వతీదేవి వరం కోరగా, దాన్ని తీర్చడం కోసం శ్వేతవరాహకల్పంలో గజముఖుడిగా గణపతి రూపాన్ని స్వీకరించారు. ఏనుగుతల ఉన్న గణపతి రూపం ఈ కల్ప ప్రారభంలో జరిగిన చరిత్రకు గుర్తు.

ఈ వినాయకుడే హిందూసామ్రాజ్య స్థాపన చేసిని మరాఠాలకు ఇలవేల్పు. అందుకే ఇప్పటికి మహారాష్ట్రలో వినాయక భక్తులు ఎక్కువ. మరాఠీ ప్రాంతంలో గణాపత్యం అధికంగా ఉంది. గణపతి ఆరాధాన ఏమి చేస్తుంది అని ప్రశ్న వేసుకుంటే అది జనం మధ్య ఐక్య్తను తీసుకువస్తుందని చెప్పాల్సి ఉంటుంది. గణపతి ఆరాధాన వలన కుటుంబసభ్యులలో మైత్రి, స్నేహభావం పెరుగుతాయి. అదే దేశమంతా చేస్తే? అక్కడా అదే ఫలితం కనిపిస్తుంది. అందుకే గణపతి ఆరాధకులైన మరాఠాలు తన వీరత్వంతో భారతదేశ సరిహద్దుల్ని ఆఫ్ఘనిస్థాన్ వరకు విస్తరించి, అఖండభారతం కోల్పోయిన అనేక ప్రాంతాలను అందులో తిరిగి చేర్చగలిగారు. కానీ అటు తర్వాత కూడా ఆంగ్లేయుల కుట్ర కారణంగా భారతీయ సమాజం విఛ్ఛినం అయ్యింది. హిందువుల్లో ఏర్పడిన బేధభావాలు కూడా స్వాతంత్రపోరాటానికి అడ్డంకిగా మారాయి. దాన్ని గమనించిన బాలగంగాధర్ తిలక్ గారు కూడా హిందువుల్లో ఐక్యత కోసం వినాయకుడినే ప్రాతిపదిక చేసుకున్నారు. గణపతి ఉత్సవాలను సాముహికంగా నిర్వహించడం ప్రారంభించింది వారే. వారి ఆలోచన ఫలించింది. ఒక పక్క భక్తిభావం పెరిగింది, ధర్మజాగరణ జరిగింది, ప్రజల మధ్య బేధభావలు తగ్గాయి. వినాయక ఉత్సవాల్లో కోసం బయటకు వచ్చిన ప్రజలకు నాయకులు దేశభక్తిని ప్రసంగాల ద్వారా అందించారు. అది స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించింది.

అయితే ఈ తర్వాత కూడా ఇది అవసరమా అని కొందరి సందేహం. కొందరేమో ఇప్పుడు పోటీ పెరిగి ఎక్కడపడితే అక్కడ గణేశ విగ్రహాలను ప్రతిష్ఠ చేసి నవరాత్రులు చేస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజం లేదు. గణేశరాత్రి ఉత్సవాలు స్వామి అనుగ్రహం లేకపోతే జరగవు. అందరికి భక్తి లేకపోవచ్చు, కానీ కేవలం పోటీ వల్లనే జరుగుతున్నాయనడం తప్పు. పోతులూరి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు కాలజ్ఞానం చెప్తూ 'కులమతాలకు అతీతంగా సకల జనుల చేత వేదమంత్రాలు చదివించుటకు గణపతి వీధుల్లోకి వస్తాడు' అని అన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ధనికపేద, కులమత బేధాలకు తావు లేకుండా ఈ ఉత్సవాల పేరిట గణపతి అందరిని ఒక చోటుకు తీసుకువస్తున్నాడు. అందరి చేత పూజలు చేయించుకుంటూ, అందరికి విద్యాబుద్ధులను ప్రసాదిస్తున్నాడు. ఎంతో నియమనిష్ఠలతో ఆలాయాల్లో పూజలు చేస్తుంటే, వీధుల్లోకొచ్చిన గణపయ్య, మాములు నియమాలకే సంతసించి వరాలు కురిపిస్తున్నాడు. ఏ కారణంతో గణపతిని పూజించినా, వారిపై అనుగ్రహాన్ని వర్షించి, క్రమంగా భక్తి భావన కలిగిస్తున్నాడు. గణపతిని వీధుల్లోకి లాగడం కాదు, సనాతనధర్మాన్ని రక్షించడానికి గణపతే వీధుల్లోకి వస్తున్నాడు. అందుకే ఈయన కేవలం వరసిద్ధి గణపతే కాదు, సార్వజనీనగణపతి కూడా. గణపతి అందరివాడని నిరూపించుకుంటున్నాడు. వీధుల వెంట అనేక మండపాలను ఏర్పరిచి గణపతి పూజించినా, ఈ సంప్రదాయం దేశనలుమూలల వ్యాపించినా, అది ధర్మక్షేమం, లోకక్షేమం కోసమే.

No comments:

Post a Comment