Friday 4 September 2015

శ్రీ కృష్ణాష్టమి

5-9-2015, శనివారం, శ్రావణ బహుళ అష్టమి, శ్రీ కృష్ణాష్టమి.

5242 ఏళ్ళ క్రితం, కారుమబ్బులు కమ్ముకునే వర్షఋతువులో శ్రావణమాస బహుళ ఆష్టమి వేళ రాత్రి 12 గంటల సమయంలో దేవకీవసుదేవుల 8 సంతానంగా మధురలో కారాగారంలో అవతరించారు శ్రీ కృష్ణ పరమాత్మ. శ్రీ కృష్ణ పరమాత్మ జాతక చక్రంలోని గ్రహగతులని ఆధారంగా చేసుకుని ఈనాటి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్పుకోవలసి వస్తే క్రీస్తు పూర్వం 3228, 21 జూలైన అవతరించారు. ద్వాపరయుగాంతంలో ఈ భూమి పైన నడయాడిన యుగ పురుషుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి జీవితమే ఒక సందేశం.

నారయణుడు, నారాయణి(పార్వతీ దేవి) అన్నాచెళ్లెలు. ఇద్దరు ఎప్పుడూ కలిసే జన్మిస్తారు. కృష్ణుడు ఇక్కడ మధురలో దేవకివసుదేవులకు జన్మిస్తే, పార్వతీదేవి యోగమాయగా యశోదా నందులకు అదే సమయంలో జన్మించింది. తాత్వికంగా అర్దం చేసుకుంటే మధుర అంటే మంచి ఆలోచనలున్న మనసు. అటువంటి మంచి, పవిత్ర ఆలోచనలున్న మనసులు కలవారికి మాత్రమే పరమాత్మ దర్శనమిస్తాడని అర్దం. ఆయన పుట్టగానే వసుదేవుడి కాళ్ళకు, చేతులకున్న సంకెళ్ళు తెగిపొయాయి. పరమాత్మ దర్శనం కలిగితే కర్మబంధాలు వాటంతట అవే తొలగిపోతాయని చెప్తుంది ఈ సంఘటన. కంసుడి కోటలో ఉన్న అందరిని మాయ కమ్మి స్పృహ కోల్పోయారు.

ఆయన్ను వసుదేవుడు యమున దాటించి రేపల్లెకు చేర్చాలి, కాని యమున ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహం ఆగదు.ఆగకూడదు. అందులోనా యమున యముడి చెల్లెలు.యముడు కాలానికి సంకేతం.యమున కూడా అంతే. అటువంటి యమున, వసుదేవుడు పసి కందైన శ్రీ కృష్ణునితో పాటు దాటడానికి మార్గం ఇచ్చింది, తన ప్రవహాన్ని ఆపివేసింది, అంటే కాలం కూడా ఆ పరమాత్మకు లోబడి ఉంటుందని,ఆయన కనుసన్నల్లో కాలం కూడా ఉంటుందని అర్దం చేసుకోవాలి. అంతేకాదు, నదిని సంసారానికి సంకేతంగా భావిస్తే, ఎవరు తమ నిత్య జీవితంలో పరమాత్ముడిని గుండేల్లో పెట్టుకుంటారో, వారు ఈ సంసారమనే మహాప్రవాహాన్ని సులువుగా దాటగలరని అర్దం. భగవంతుని నమ్మకుని ముందుకు నడిచేవారి జీవితం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది చెప్తుందీ ఘటన. కృష్ణుడు రేపల్లెకు చేరాడు. రేపల్లేలో జనం అమాయకులు, భగవద్భక్తి కలవారు, శాంతస్వభావులు. ఎక్కడ ప్రజలు ధర్మ మార్గంలో జీవిస్తూ పరోపకార బుద్ధితో బ్రతుకుంతుంటారో అక్కడికి పరమాత్మ తానే వెళతాడని అందులో అంతరార్ధం. ఈ విధంగా కృష్ణకధలో ప్రతి సంఘటనలో ఎంతో తత్వం దాగి ఉంది.

ఓం నమో భగవతే వాసుదేవాయ

Originally Published: Sri Krishnasthami
1st Edit: 16-08-2014
2nd Edit: 05-09-2015

No comments:

Post a Comment