Monday 20 November 2023

శ్రీ గరుడ పురాణము (10)

 


ఇవికాక ఇంకా అసంఖ్యాక సందర్భాలలో శ్రీమహా విష్ణువు భూమిపై అవతరించాడు. మనువులుగా జాతిచరిత్రగతిని మార్చగలిగే మహర్షులుగా ఆయనే ఉద్భవించాడు. విష్ణు విభూతులుగా పేరొందిన ఈ అంశాలనే మా గురువుగారు వేదవ్యాస భగవానులు మాతో గరుడ మహాపురాణమను పేరిట అధ్యయనం చేయించారు." (అధ్యాయం - 1)


గరుడ పురాణ వక్తృ - శ్రోతృ పరంపర విష్ణు స్వరూపవర్ణన, 

గరుడునికి పురాణసంహిత వరదానం


శౌనకాది మహామునులు ఈ గరుడ మహాపురాణమును ఆమూలాగ్రము వినాలని వుందని అత్యంత ఉత్సుకతతో వేడుకోగా పరమపౌరాణికుడైన సూతమహర్షి ఇలా ప్రవచించసాగాడు.


"బదరికాశ్రమంలో ఒకకనాడు వ్యాసమునీంద్రులు పరమాత్మ ధ్యానంలో వుండగా గమనించి నేనక్కడే ఆయన ఆసన సమీపంలోనే నేలపై కూర్చుండి పోయాను. ఆయన కనులు తెరువగానే ప్రణామం చేసి ఇలా ప్రార్థించాను.


'గురుదేవా! మీరు పరమేశ్వరుడు భగవానుడునైన శ్రీహరి స్వరూపాన్ని జగత్ సృష్ట్యాదులనీ నాకు బోధించండి. మీరింతసేపూ ఆ పరమపురుషుని ధ్యానంలోనే ఆయనను దర్శించగలిగారనీ కూడ నాకు అవగతమైనది అని అన్నాను. ఈలోగా మిగతా శిష్యులు కొందరు మునీంద్రులు అక్కడకు చేరారు. వ్యాసమహర్షి మాతో 'నాయనలారా' నాకు ధ్యానంలో గోచరించేది శ్రీమహావిష్ణువే. ఆయన గూర్చి చెప్పగలవాడు చతురాననుడు బ్రహ్మదేవుడే. ఆయన మాకు అనుగ్రహించిన గరుడమహాపురాణాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.


ఒకమారు నారదుడు, దక్షప్రజాపతి, భృగుమహర్షి, నేనూ సత్యలోకానికి వెళ్ళాము. ఆదిబ్రాహ్మణుడు, గురువులకే గురువు, సృష్టికర్తయైన ఆ దేవదేవునికి ప్రణామం చేసి హే దేవ దేవేశ! సర్వ వేదసారము, సర్వజ్ఞాన సారమూ మీరే! మాకు సారతత్త్వాన్ని అనుగ్రహించండి' అని ప్రార్థించాం.


'సర్వశాస్త్రసారభూతము గరుడ మహాపురాణము. ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు నాకూ, శివునికీ, అన్యదేవతలకూ దీనిని వినిపించాడు, అంటూ బ్రహ్మ ఆ సందర్భాన్ని ఇలా వివరించాడు.


No comments:

Post a Comment