Wednesday 22 November 2023

శ్రీ గరుడ పురాణము (12)

 


కొలనులో చిన్న చిన్న చేపలు కదలాడుతున్నట్లు ఈ జగాలన్నీ మనతో సహా ఆ విశ్వరూపునిలోనే కదలాడుతుంటాయి. ముఖంలో అగ్ని, మస్తకంలో ద్యులోకం, నాభిలో ఆకాశం, చరణాలపై భూమి, కన్నులలో సూర్య చంద్రులూ గల విశ్వరూపం ఆయనది. ఉదరంలో స్వర్గం, మర్త్యలోకం, పాతాళం, భుజాలలో సమస్త దిశలు, ఉచ్ఛ్వాసంలో వాయువు, కేశవుంజంలో మేఘాలు, అంగ సంధులలో నదులు, కుక్షిలో సముద్రాలు ఎవరికైతే నిలచి వుంటాయో ఆ విశ్వరూపుడే నాకు దేవుడు. జగత్తునకు ఆదియైన అనాది తత్త్వమాయనది. అట్టి నారాయణునికి నమస్కారము. ఏ పురాణ పురుషుని నుండి సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర, వంశానుచరితలు ప్రవర్తితాలయినవో ఆ పరమాత్మ వద్దకేపోయి పరమ సారతత్త్వజ్ఞానమును పొందవలసివున్నది' అంటూ పరమశివుడు కూడా మాతో విష్ణువు వద్దకు బయలుదేరాడు.


వ్యాసమునీంద్రా! ఆ రోజు పరమశివునితో కలిసి మేమంతా శ్వేత ద్వీపం చేరుకొని అక్కడనున్న విష్ణు భగవానుని దర్శించి ప్రణామంచేసి స్తుతులొనర్చాం. పరమసారతత్త్వ స్వరూపుడగు విష్ణువు ద్వారానే ఆ పరమతత్త్వముయొక్క సారాన్ని వినడానికి మేమంతా వేచివుండగా పరమేశ్వరుడు మా అందరి తరఫునా మహా విష్ణువునిలా ప్రార్ధించాడు. హే దేవేశ్వరా! హరే! దేవాధిదేవుడెవరో పరమేశ్వరుడెవరో, ధ్యేయుడెవరో, పూజ్యుడెవరో, ఈ పరమతత్త్వాన్ని ఏ వ్రతాల ద్వారా సంతుష్టపఱచగలమో, ఏ ధర్మం ద్వారా ఏ నియమాన్ని పాటించి ఏ పూజలు చేసి ఏయే ఆచరణలను అనుసంధించి ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోగలమో తెలిస్తే అదే నిజమైన జ్ఞానం. ఆయన స్వరూపమెట్టిది, ఏ దేవుని ద్వారా ఈ జగత్తు సృష్టింపబడింది, దీనిని పాలించేదెవరు, ఆయన ఏయే అవతారాలనుధరించి ఈ పనిని చేస్తాడు, ప్రళయ కాలంలో ఈ విశ్వం ఎవరిలో కలసి పోతుంది, సర్గలు, ప్రతిసర్గలు, వంశాలు, మన్వంతరాలు ఏ దేవుని ద్వారా ప్రవర్తితమవుతాయి. ఈ దృశ్యమాన జగత్తంతా ఏ దేవునిలో ప్రతిష్ఠితమై వుంది. ఈ విషయాలన్నిటినీ తెలిపేదే నిజమైన జ్ఞానం, సత్యమైన సారతత్త్వం, నేను ఆ జ్ఞానానికి జిజ్ఞాసువుని, వీరంతా ఆ తత్త్వానికి అన్వేషకులు. మా అందరికీ పరమేశ్వర మాహాత్మ్యాన్నీ ధ్యానయోగాన్నీ కూడా విని తరించాలని వుంది. దయచేసి మమ్ము కృతార్ధులను చేయండి'.


అప్పుడు భగవానుడైన విష్ణువు శివునికి పరమాత్మ మాహాత్మ్యాన్నీ, ఆయన ప్రాప్తికి సాధనభూతమైన ధ్యానాన్నీ, యోగాదిక నియమాలనూ, అష్టాదశ విద్యలలో విరాజమానమైన జ్ఞానాన్నీ ఈ విధంగా ప్రసాదించాడు.


No comments:

Post a Comment