Wednesday 15 November 2023

శ్రీ గరుడ పురాణము (5)

 


ముద్రణలో చాలా అరుదుగా కనిపించే అంజలిబద్ద, వందినీ, హృదయాసక్తాది ముద్రలనెలా ప్రదర్శించి ఆయా దేవతలను ఎలా వశం చేసుకోవాలో ఇందులో వుంది. (1-11)


భీష్ముడు చెప్పినది కాక స్వయంగా శ్రీ మహావిష్ణువు శివునికుపదేశించిన విష్ణుసహస్రనామం గరుడపురాణంలో కనిపిస్తుంది. (1-14). మన దురదృష్టం వల్ల ఈ మహా మంత్రం కూడా విష్ణు పంజరస్తోత్రం (1-13), మృత్యుంజయ మంత్ర జప మహిమ (1-16) వంటి మహా విషయాలతో సహా తెలుగువారికి తెలియకుండా పోయింది. ఓంజుంసః అనే మూడక్షరాలతో మృత్యువును జయించగలిగే గొప్ప మంత్రం మృత్యుంజయమంత్రం. ఇతరత్ర దుర్లభమైన అమ్మృతేశ్వరారాధన, షడంగ పూజా విధానం కలవు. ప్రాణేశ్వరీ విద్యా వుంది. విషానికి మంత్రః-ఔషధ విరుగుడు, గరుత్మంతుని మంత్రాలు ఉన్నాయి.


నిజానికి గరుడపురాణం ఒక మంత్రశాస్త్రం. అరుదైన మంత్రాల మంజూష పంచముఖ శివుని పూజా విధానం, త్రిపురేశ్వరీ సాధన, విషదూరక మంత్రలు కలవు. గోపాల మంత్రం దానితో బాటు సాంగోపాంగముగా మిక్కిలి కష్టసాధ్యమైన గోపాలదేవతారాధన విధి చెప్పబడింది. ఇలా వందలకొద్దీ మంత్రాలు, బీజాక్షరాలు, హయగ్రీవ మూలమంత్రం - పూజనావిధి. గాయత్రిమంత్రోపాసన, ఎక్కడా కనిపించని గాయత్రి మంత్ర చతుర్ధపాదం (1-35) వాస్తు నియమాలు, సాముద్రికం, నాడీ ప్రవాహం, శాలగ్రామ, రత్నశాస్త్రాలు మున్నగు ఎన్నో విషయాలు గరుడపురాణంలో సంపూర్ణంగా చర్చించబడ్డాయి. గారుడి విద్య గరుడపురాణానికి ప్రత్యేకం.


గరుడపురాణం వైష్ణవ పురాణమేయైనా ఇందులో శివరాత్రి మాహాత్మ్యముంది. (1-24) ఎవరికోగాని తెలియని శివుని అవతారాలున్నాయి. అనేక మంత్రయుక్త వైష్ణవ కవచం, సర్వకామప్రద విద్య, విష్ణు ధర్మాఖ్య విద్య గరుడపురాణంలో ఉపదేశింపబడ్డాయి. వీటిని ఉపాసించువారికి అపజయముండదు. గారుడీ విద్య (1-197) సకల శుభకారకము.


ఆయుర్వేద ప్రకరణంలో రోగాలకు మందులే కాక శృంగార సర్వస్వమే వుంది. మదనకేళిలో ఎంతమందినైనా సంతృప్తిపరచగలిగే మందులు (తయారీ, వినియోగ, అనుపాన విధానాలతో సహా) ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అదృశ్య రూపానికీ, ప్రకృతిని స్వల్పంగా జయించడానికి, నిత్యయవ్వనానికీ, పునర్వివాహానికి - ఇలా స్త్రీ, పురుషులు మనసారా కోరుకొనే మరియు చెప్పుకోలేని వాంఛలు తీర్చుకొనే సాధనాలెన్నో వున్నాయి.


దీనిని పురాణంగా పల్లెటూళ్ళలోగాని, పట్టణాలలో చెప్పి రక్తి కట్టించడం కష్టమనే ఒక దురభిప్రాయం ఈ పురాణ రావలసినంత ప్రాచుర్యం రాకపోవడానికి కారణం కావచ్చు. అందువల్ల ఈ పురాణమొకటుందనే విషయాన్నే ప్రజలు పట్టించుకోకపోవడం జరిగినపుడు వ్యాసమహర్షి వ్రాసిన పురాణం కనుమరుగైపోతుందనే భయంతో ప్రేతఖండాన్ని మాత్రమే బయటకు తెచ్చి దానిని అపరకర్మ జరిగే రోజులలో పఠించాలని విధించి వుండవచ్చు. కాలక్రమాన గరుడపురాణం గురించి ఎవరైనా "ఇది నాకు పూర్తిగా కావాలి" అని అడిగినా అలసత్వం కొద్దీగాని, దుర్వినియోగమవుతుందనే భయం కొద్దిగాని సంస్కృతంలో వున్న దానిని తెలుగులోకి మన పండితులు తీసుకొనిరాకపోయి వుండవచ్చు. అందుకే తెలుగులో సంపూర్ణ గరుడపురాణం కనబడుట లేదు. చివరికి ఈనాడు భగవంతుని పట్ల పూర్తి విశ్వాసం వున్నవాడు దేనికీ భయపడడు అనే ఋషి వాక్యాన్ని సార్థకం చేస్తూ ఒక పబ్లిషర్, ఒక అనువాదకుడు ఈ మహత్తరమైన పురాణాన్ని తెలుగువారికి అందింపచేసే ప్రయత్నం జరిగింది.


ఆశీర్వదించండి. నా ఊహ పొరపాటైతే, మిమ్మల్ని బాధిస్తే క్షమించండి. 


డా|| యిళ్ళాయి నారాయణరావు 

అనువాదకుడు


No comments:

Post a Comment