Monday 13 November 2023

శ్రీ గరుడ పురాణము (3)

 


ఇది వైష్ణవ పురాణమే గాని ఆ ఒక్క శాఖకే పూర్తిగా అంకితమై పోలేదు. ఇతర దైవాల పూజా విధానాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి. పరమశివునిగూర్చి గరుడ పురాణం ఎక్కువగానే చెప్పింది. అలాగే వినాయక, స్కంధ, విశాఖ, దుర్గ సప్తమాతృకల పూజావిధానము బోధింపబడినది. బ్రహ్మ, ఇంద్ర, సూర్య, అగ్ని, చంద్ర, వాయుదేవత పూజలెలా చేయాలో ఇందు పొందు పరుపబడింది. భైరవ, సూర్య, కృష్ణ, శివ, బ్రహ్మలే అంశాలుగా గల అమృతేశ్వరస్వామి అర్చన గరుడపురాణంలో ప్రతిపాదింపబడింది.


తత్త్వమసి, అహంబ్రహ్మస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మమున్నగు బ్రహ్మపదార్థ వాక్యాలు కూడా ఈ పురాణంలో వ్యాఖ్యానింపబడ్డాయి.


గరుత్మంతుని పేరనే ఒక పురాణముండాలని విష్ణువు అనుకున్నాడంటే ఆయన అనుగ్రహం మాత్రమే కాక ఈయన గొప్పతనం కూడా వుండాలి కదా! అది చాలా వఱకు పురాణంలోనే చెప్పబడింది. ఏవో రెండు మూడు విషయాలను మాత్రం యిక్కడ ప్రస్తావిస్తాను.


హిందూమతానికి మహాశ్రయం కోవెళ్ళు. అటు వున్నది ఇటు లేదు అన్నట్టుగా విష్ణు కోవెలలో వుండేవేవీ శివ కోవెలలో నుండవు. (ఒక్క క్షేత్రపాలకులైన త్రిమూర్తులు తప్ప) కాని గరుడుడు అన్ని కోవెళ్ళలోనూ వుంటాడు. శివాలయాలలోనే అధికంగా కనిపించే నవగ్రహ మంటపం గరుడచిహ్నంపైనే నిర్మింపబడుతుంది. అమ్మవారి గుడులలో కనిపించే పోతురాజు కూడా గరుత్మంతుడి అంశయేనని పెద్దలంటారు. కలియుగంలో హిందూమతానికి పరమాశ్రయమైన తిరుమల క్షేత్రంలో ఆయన పేరనొక కొండయే వుంది. (గరుడాద్రి). గరుడధ్వజం పరమపుణ్యప్రదం. సాగరమధ్యంలో, ఆకాశదేశాన ప్రయాణిస్తున్నవారికి గరుడధ్వజమొక ప్రాణాధారం. అంతవఱకెందుకు స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడవాహన సంబారానిదే అగ్రతాంబూలం. ఆ రోజు పంచభూతాలు పరవశిస్తాయి. ఇది యాత్రికులకు తెలుస్తుంది. ఆ రోజే ఆకాశంలో గరుడపక్షులు గిరికీలు, ఆకాశంలో సప్తవర్ణాలు గోచరిస్తాయి. ఇది అందరికీ కనిపిస్తుంది. ఇదీ గరుత్మంతుని మాహాత్మ్యం. ఇందుకే వైష్ణవులంతా ఆయనను 'గరుడాళ్వారు' అని మిక్కిలి భక్తితో కొలుస్తారు. అందుకే మహావిష్ణువు గరుడుని పేర ఒక మహాపురాణాన్ని సృష్టించి దానిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా మలచాడు.


కాబట్టే ఇదొక భారతీయ విజ్ఞాన సర్వస్వం. అక్షర జ్ఞానమున్నవారందరికీ ఆవశ్య పఠనీయం.


No comments:

Post a Comment