Saturday 18 November 2023

శ్రీ గరుడ పురాణము (8)

 


ఈ గరుడ మహాపురాణము సారభూతము. విష్ణుకథా పరిపూర్ణము. మహాత్ముడు, మహానుభావుడు, తన తపోబలంతో భాగ్యవిశేషంతో విష్ణు భగవానుని వాహనమై ఆయన సామీప్యాన్ని పొందినవాడైన గరుత్మంతుడు కశ్యపమహర్షికి ఈ పురాణాన్ని వినిపించాడు. మా గురుదేవులైన వ్యాసమహర్షి నాకు వినిపించి అనుగ్రహించారు.

దేవతా శ్రేష్ఠుడు శ్రీమన్నారాయణుడే. ఆయనే పరబ్రహ్మ, ఆయనే పరమాత్మ. ఆయన ద్వారానే ఈ జగత్తు ఉత్పత్తి, స్థితి, సంహారాలు జరుగుతున్నాయి. ఆయన జరామరణరహితుడు. భగవంతుడైన ఆ వాసుదేవుడు జన్మ అనగా పుట్టుకలేని వాడైనా జగద్రక్షకై సనత్కుమారాదిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తుంటాడు.

మునులారా! ఆ పరమాత్మ మొట్టమొదట కౌమార సర్గులుగా* (సనక, సనందన సనత్కుమార, సనత్సుజాతులు కౌమారసర్గులు) అవతరించాడు. అప్పుడే కఠోర బ్రహ్మచర్య వ్రతాన్నవలంబించి దాని గొప్పదనాన్ని వేదాలతో సహాలోకానికి చాటి చెప్పాడు. రెండవ అవతారంలో యజ్ఞేశ్వరుడైన ఆ శ్రీహరియే వరాహ శరీరాన్ని ధరించి హిరణ్యాక్షునిచే రసాతలంలో ముంచి వేయబడ్డ పృథ్విని ఉద్ధరించి స్థితి కారకుడైనాడు. మూడవ అవతారం ఋషి. నారదుడను పేరుతో జన్మించి 'సాత్వతతంత్ర' (నారద పాంచరాత్ర) బోధనను చేశాడు. ఇందులో నిష్కామకర్మను గూర్చి చెప్పబడింది. నాలుగవది 'నరనారాయణ' అవతారం. ఇందులో శ్రీహరి ధర్మరక్షకోసం కఠోరతపస్సు చేశాడు. దేవతలూ దానవులూ కూడా నరనారాయణ మహర్షులను ఆరాధించారు. అయిదవ అవతారంలో శ్రీహరి కపిలనామంతో సిద్ధులలో సర్వశ్రేష్ఠునిగా జనించి కాలగర్భంలో కలిసి పోయిందనుకున్న సంఖ్యాశాస్త్రాన్ని సముద్ధరించి ప్రపంచానికి ప్రసాదించాడు.

ఆరవ అవతారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు ఒకప్పుడిచ్చిన వరాన్ని పురస్కరించుకొని శ్రీహరి వారికి పుత్రునిగా జన్మించి కొన్నివందల మందికి జ్ఞానోపదేశాన్నిచ్చాడు. ముఖ్యంగా అలర్కమహారాజుకీ, ప్రహ్లాదునికీ బ్రహ్మ విద్యను పదేశించాడు. ఏడవ అవతారం యజ్ఞదేవనామకం. శ్రీమన్నారాయణుడు రుచి ప్రజాపతి ఆకూతి దంపతులకు మన స్వాయంభువ మన్వంతరంలోనే జన్మించి ఇంద్రాది దేవగణాలచే అద్భుతమైన యజ్ఞాలను చేయించి, అందరికీ వాటి పద్ధతిని బోధించి యజ్ఞదేవుడను పేర పూజలందుకున్నాడు. ఎనిమిదవ అవతారం బుషభదేవుడు. కేశవుడే నాభి, మేరుదేవి దంపతుల పుత్రునిగా జనించి స్త్రీలకు పరమాదర్శంగా గృహస్థాశ్రమాన్ని నిర్దేశించి, నియమాల నేర్పఱచి సర్వాశ్రమాలచేత నమస్కరింపబడేటంత శ్రేష్ఠంగా గృహస్థాశ్రమాన్ని సిద్ధముచేశాడు.

No comments:

Post a Comment