Friday 17 November 2023

శ్రీ గరుడ పురాణము (7)

 


అక్కడ లోకకళ్యాణం కోసం వేలాదిమునులు శౌనకుని ఆధ్వర్యంలో సత్రయాగం చేస్తుంటారు. ఇది వెయ్యేళ్ళ పాటు సాగే యజ్ఞం. విశ్వంలోని మునులందరూ, ఆచార్యులందరూ, రాజగురువులందరూ, వ్యాసశిష్యులందరూ తీర్థయాత్రలకు వెళ్ళినపుడల్లా ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. శౌనక మహర్షి అడగగానే కాదనకుండా తాము సంపాదించిన జ్ఞానాన్నంతటినీ మాట రూపంలో అక్కడ సమర్పించి వెళుతుంటారు. ఇతరుల ప్రసంగాలను కూడా వినడం వల్ల అక్కడి వారి, అక్కడికే తెంచిన వారిజ్ఞానం నిమిషనిమిషానికి పెరిగి పోతుంటుంది. అందుకే అది నైమిషారణ్యం?


ఒకనాడక్కడికి సర్వశాస్త్రపారంగతుడు, పురాణ విద్యాకుశలుడు, శాంత చిత్తుడు, వ్యాసమహర్షి శిష్యుడు, మహాత్ముడునైన సూతమహర్షి తీర్థ యాత్రలు చేసుకుంటూ వచ్చాడు. అక్కడ ఒక పవిత్రాసనంపై కూర్చుని విష్ణుధ్యానంలో మునిగిపోయాడు. క్రాంత దర్శియైన ఈ మహాపౌరాణికుడు తనపై కాలు మోపగానే నైమిషారణ్యమే పులకించిపోయింది. ఆ పులకింత శౌనకమహర్షికి చెప్పకనే చెప్పింది ఎవరో మహానుభావుడు వచ్చాడని. ఆయన వెంటనే కొందరు ఉత్తమ ఋషులను వెంటనిడుకొని సూతమహర్షిని కనుగొని ఆయన కనులు తెఱచునందాక అక్కడే వేచియుండి ఆయనను సగౌరవంగా యాగస్థలికి తోడ్కొని వచ్చాడు. మునులందరూ ఆయనను సేవించి ఆతిథ్యమిచ్చి తమ జన్మను చరితార్థం చేసుకున్నారు.


తగిన విశ్రాంతి ఆయనకు లభించినాక శౌనకుడు మరొకమారు ప్రణామం చేసి ఇలా ప్రార్ధించాడు: 'హే సూతదేవా! మీరు సర్వజ్ఞులు అందుకే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. మాకు ఈ విషయాన్ని బోధించండి. దేవతలందరిలోకీ శ్రేష్టుడెవరు? సర్వేశ్వరుడెవరు? పూజ్యుడు ధ్యానయోగ్యుడు నెవరు? ఈ జగత్తుకి స్రష్ట, పాలనకర్త, సంహర్త ఎవరు? ఎవరి ద్వారా ఈ సనాతన ధర్మం ప్రవర్తితమగుతున్నది? దుష్ట వినాశకుడెవరు? ఆ దేవ దేవుని యొక్క స్వరూపమెట్టిది? ఈ సంపూర్ణ జగత్తు యొక్క సృష్టి ఏ విధంగా జరిగింది? ఆ దేవదేవుడు ఏ వ్రతాలకు సంతుష్టుడౌతాడు? ఏ యోగం ద్వారా మనిషి ఆయనను పొందగలడు? ఆయన అవతారాలెన్ని? వాటికి వంశపరంపర వుంటే ఎలా వుంటుంది? వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించి రక్షించేవాడెవరు? హే మహామతీ! వీటినీ, అవసరమైన చోట అన్య విషయాలనూ బోధించి మమ్ము ధన్యులను, జ్ఞానులను చేసి మా జీవితాలను సార్థకాలను చేయండి."


ఒక్క నిముషంపాటు కనులు మూసుకొని ధ్యానం చేసి కనులుతెఱచి చెప్పసాగాడు. సూతమహర్షి :


"శౌనకదేవా! ఇతర మునీంద్రులారా! మీరడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా గరుడ పురాణాన్ని వినిపించి నేనూ ధన్యుడనౌతాను.


No comments:

Post a Comment