Sunday 26 July 2015

27-7-2015, సోమవారం, తొలి ఏకాదశి

ఆషాఢ శుద్ద ఏకాదశికి శయన ఏకాదశి, దేవశయన ఏకాదశి, తొలి ఏకాదశి అని పేర్లు. విష్ణువు ఆరాధనకు అత్యంత విశిష్టవంతమైన రోజు. సమస్త సృష్టికి స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచే వైకుంఠంలో పాలసముద్రంలో ఆదిశేషుని పడుకుని  మీద యోగనిద్రలోకి వెళతాడు. నాలుగు నెలల పాటు నిద్రించి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు. ఆషాఢ శుద్ద ఏకాదశి నుంచే విష్ణువు శయనిస్తాడు కనుక దీనికి శయన ఏకాదశి అని పేరు.

అసలు విష్ణువుకు నిద్ర అనేది ఉంటుందా? స్వామి నిద్రపోతే, బ్రహ్మాండం ఏమైపోతుంది? ఆర్తుజనులను రక్షించేందుకు ఎవరు ఉంటారు? విష్ణుమూర్తి నిద్రపోవడమేంటని చాలా మంది అనుమానం రావచ్చు. అందరిని కాపాడే ఆ పరమాత్ముడికి నిద్ర ఏంటని అనిపిస్తుంది. విష్ణువు అంటే వ్యాపకత్వం కలిగినవాడని అర్దం. విష్ణువు స్థితి కర్త. అందరిని, అన్నిటిని నడిపించేవాడు, విష్ణువే సమస్త జీవరాశిలో ఉన్న ప్రాణశక్తి. మనలో ఆ శ్రీ మహావిష్ణువు ప్రాణశక్తి రూపంలో స్థితమై ఉండి నడిపిస్తున్నాడు.

దక్షిణాయనంలో, ముఖ్యంగా భారతదేశంలో వానాకాలం, చలికాలం ఉంటాయి. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమి పూర్తిగా చేరకుండా మేఘాలు, మంచు మొదలైనవి అడ్డుపడతాయి. అందువల్ల శరీరంలో ఉన్న జీవక్రియలు మందగిస్తాయి, ప్రాణశక్తి తగ్గిపోతుంది. అదే మన అందరిలో ఉన్న విష్ణువు యొక్క నిద్ర, ఆఖిల జగత్తును ఏలే విష్ణువు యొక్క యోగ నిద్ర.        

ఇదే కాదు, దక్షిణాయనం ఉపాసనా కాలం. ఈ 6 నెలలు భగవదుపాసన చేయాలి. ఎవరైతే ఈ సమయంలో శాస్త్రనియమాలను పాటిస్తూ, ఉపాసన చేస్తారో వారిని యెడల అపారమైన అనుగ్రహాన్ని వర్షించడం కోసం విష్ణుమూర్తి బాహ్యనేత్రాలను మూసి, అంతఃనేత్రాల ద్వారా చూస్తుంటాడు. ధర్మాన్ని అనుషిటించేవారికి సకల శుభాలు చేకూరుస్తాడు.

దక్షిణాయనం గురించి ఈ లింక్ లో చూడండి.
http://ecoganesha.blogspot.in/2013/07/blog-post_17.html

ఈ ఏకాదశి నుంచి అనేక పండుగుల, పర్వటి రోజులు ఉంటాయి. ఇది అన్నిటికంటే ముందు వస్తుంది కనుక తొలి ఏకాదశి అని పేరు. ఈ తొలి ఏకాదశి రోజున అందరు తప్పకుండా పేలాల పిండిని విష్ణువుకు సమర్పించి నైవేధ్యంగా తినాలి. ఈరోజున చేసే శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం, శ్రీ విష్ణుసహస్రనామ పారయణం, ఏకాదశి వ్రతం విశిష్టఫలాన్ని, విష్ణు సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాయి.

నమోస్తు అనంతాయ సహస్ర మూర్తయే, సహస్రపాదాక్షి శిరోరుబాహవే,
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే, సహస్రకోటి యుగధారిణే నమః

అంతటా వ్యాపించినవాడు, అంతము లేనివాడు, అనంతుడు, అనేక రూపాలలో దర్శనమిచ్చేవాడు, అనంతమైన బాహువులు, కన్నులు, పాదాలు కలిగిన విరాట్ పురుషుడు, లెక్కలేనన్ని పేర్లతో పిలువబడేవాడు, శాశ్వతమైనవాడు, సహస్రకోటి బ్రహ్మాండాలను ధరించి, రక్షించి, పోషిస్తున్న శ్రీ మహావిష్ణువుకు నమస్కరిస్తున్నాను.

ఈ రోజున తప్పక దగ్గరలో ఉన్న శ్రీ మహా విష్ణువు ఆలాయన్ని, శ్రీ మహా విష్ణు అవతారం కొలువై ఉన్న ఆలయాన్ని సందర్శించండి.

ఓం నమో నారాయణాయ        

Originally Posted: Deva Sayana Ekadasi 2013
1st Edit: 07-July-2014
2nd Edit: 26-July-2015

No comments:

Post a Comment