Wednesday 29 July 2015

నీటి కరువు గురించి అబ్దుల్ కలాం గారి ప్రెజంటేషన్



ఈ రోజు ప్రపంచం ఎదురుకుంటున్న అనేక సమస్యల్లో ఒకటి నీటిఎద్దడి. అబ్దుల్ కలాం గారు నీటి కరువు గురించి ఒక ప్రెజంటేషన్ ఇచ్చారు. అది 2002 లో ఓ విదేశి మేగజైన్‌లో ప్రచురితమైంది. వారు భవిష్యత్తు ఎంత దారుణంగా ఉంటుందో ఊహించి, ఒక వ్యక్తి 2070 లో లేఖ రాస్తున్నట్టుగా చిత్రీకరించారు.

'ఇది 2070. నేను ఇప్పుడే 50 ఏళ్ళు దాటాను. కానీ నా రూపం చూడటనికి 85 ఏళ్ళుగా అనిపిస్తుంది. నేను తీవ్రమైన మూత్రపిండ సమస్యలను ఎదురుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా నీరు త్రాగను..... త్రాగలేను, అంత నీరు ఇప్పుడు అంబాటులో లేదు.

నేను ఇక ఎక్కువ కాలం బ్రతకను, అదే నాకున్న పెద్ద భయం. ఇప్పుడున సమాజంలో అతి ఎక్కువ వయసున్న వ్యక్తులలో నేను కూడా ఒకడిని.

నాకు గుర్తుంది, అప్పుడు నాకు 5 ఏళ్ళు, అప్పడంతా పరిస్థితి వేరుగా ఉండేది. ఉద్యానవనాల్లో ఎన్నో చెట్లు ఉండేవి, ఇళ్ళలో చక్కని తోటలు ఉండేవి, దాదాపు అరగంట పాటు షవర్ స్నానం చేసి ఆనందించేవాడిని. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు అంత నీరెక్కడుంది కనుక. అందుకే మేమిప్పుడు రసాయనపూత పూసిన టవల్స్‌తో శరీరాన్ని శుభ్రపరుచుకుంటున్నాము. స్నానం చేయడమనేది అసలు లేనేలేదు. రసాయనాలతో శరీరం తుడుచుకోవడమే అందరూ చేస్తున్నారు.

ఇంతకముందు ఆడవాళ్ళకు అందమైన జుట్టు ఉండేది. కానీ ఇప్పుడు నీటి వాడకం తగ్గించడనికి అందరూ రోజు తల మొత్తం నున్నగా షేవ్ చేసుకుంటున్నారు. అప్పట్లో మా నాన్నగారు కారుని పైప్‌తో కడిగేవారు. ఇప్పుడా విషయం మా అబ్బాయికి చెప్తే, అంత నీరెలా వృధా చేస్తారంటూ నమ్మడంలేదు.

నాకు గుర్తుంది, నీటిని కాపాడండి, సేవ్ వాటర్ అంటూ హెచ్చరికలు, వాల్ పోస్టర్లు ఉండేవి, రేడియో, టి.వీ.ల్లో కూడా ప్రచారం చేసేవారు. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. నీరనేది ఎప్పటి తరగని వనరని మాకు భావన ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే, నదులు, చెరువులు, బోర్లు, డ్యాములన్నీ పూర్తిగా ఎండిపోయాయి, లేదా పూర్తిగా కలుషితమయ్యాయి.

పరిశ్రమలు కూడా నిలిచిపోయాయి, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోయింది. నీటి నుంచి ఉప్పును వేరు చేసే ప్లాంట్లు మాత్రమే అధికశాతం ఉద్యోగ అవసరాలు తీరుస్తున్నాయి. వాటిలో పని చేసే కార్మీకులు డబ్బులకు బదులుగా నీటిని జీతం రూపంలో తీసుకుంటున్నారు. నీరు కొనుక్కోవడమే గగనం అయ్యింది.

రోడ్డు మీద నీటి బాటిళ్ళు తీసుకువెళ్ళేవారిని చంపి, ఆ నీటిని దోచుకోవడం కోసం చేసే నేరాలు పెరిగిపోయాయి. నీటిబాటిల్ కోసం అగంతకులు గన్‌తో భయపెడుతున్నారు. 80% ఆహారం అంతా కృతిమమే. నీరు లేకపోతే ఏం పండుతుంది?

గత రోజులలో కాస్త వయసున్న వ్యక్తి రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని సిపార్సు చేసేవారు. ఇప్పుడు కేవలం అరగ్లాసు నీరు త్రాగే 'అవకాశం' మాత్రమే ఇస్తున్నారు. అంతకంటే ఎక్కువ నీరు త్రాగనివ్వరు.

ఇప్పుడు మేము వాడి పడేసే బట్టలు ఉపయోగిస్తున్నాము. ఇంతకముందు వలే నేసిన బట్టలు వాడే రోజులు ఎప్పుడో పోయాయి. అటువంటి బట్టలు ధరించినా, వాటిని శుభ్రపరచడానికి నీరుంటే కదా.

ఇప్పుడు మేము డ్రైనేజి వ్యవస్థకు బదులుగా సెప్టిక్ ట్యాంకు వాడుతున్నాము. ఎందుకంటే డ్రైనేజి వ్యవస్థకు కూడా నీరు అవసరం.

జనాల యొక్క బాహ్యరూపం చాలా భయంకరంగా ఉంది. ముడతలు పడి, డిహైడ్రేషన్ కారణంగా కృశించి, అతినీలలోహిత కిరణాల కారణంగా శరీరం మొత్తం కురుపులు పడి, ఓజోన్ పొర లేని కారణంగా చాలా దారుణమైన చర్మవ్యాధులతో జనం తారసపడుతున్నారు. చర్మక్యాన్సర్, వాతప్రకోపిత రోగాలు, మూత్రపిండ సంబంధిత వ్యాధులే మరణాలకు ముఖ్యకారణాలు.

చర్మం అధికంగా పొడిబారడం వలన 20 ఏళ్ళ యువకులు 40 ఏళ్ళ వారిలా కనిపిస్తున్నారు. శాస్త్రవేత్తలు పరిశోధించినా, ఎటువంటి మార్గం కనుగొనలేకపోతున్నారు. నీటిని ఉత్పత్తి చేయలేము, చెట్లు, పచ్చదనం తగ్గిన కారణంగా ప్రాణవాయువు నాణ్యత తగ్గిపోయింది. ఆధునికతరాల వారి మేధాశక్తి దారుణంగా క్షీణించిపోయింది.
పురుషుల వీర్యకణాల్లో కూడా తేడాలు సంక్రమించాయి. ఆ కారణంగా కొత్తగా పుట్టే పిల్లలు అనేక అవయవ లోపాలతో, రోగాలతో పుడుతున్నారు.

గాలి పీలుస్తున్నందుకు గానూ ప్రభుత్వం ఇప్పుడు మా దగ్గరి నుంచి డబ్బులు వసూల్ చేస్తోంది. 137 కూబిక్ మీటర్ల గాలి మాత్రమే తీసుకునే అవకాశం ఇస్తోంది. ప్రజల ఊపిరి తిత్తులు ఎప్పుడో చెడిపోయాయి, అందుకే ఇప్పుడు సౌరశక్తితో నడిచే యాంత్రికమైన ఊపిరి తిత్తులు కనుగొన్నారు, వాటిని వెంటిలేటేడ్ జోన్స్ అనే ప్రత్యేక స్థలాల్లో అమరుస్తారు. డబ్బులు కట్టలేని వాళ్ళని వెంటిలేటేడ్ జోన్స్ నుండి వెళ్ళగొడతారు. అక్కడ కూడా ప్రజలు పీల్చే గాలి మంచిదేమీ కాదు, కానీ ఏదో పూటగడుస్తుందంతే.

కొన్ని దేశాల్లో ఇప్పటికి నదుల పక్కన పచ్చని మైదానాలు ఉన్నాయి. కానీ వాటిని రక్షించడం కోసం దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన సైన్యం అక్కడ ఉంది. నీరు ఎంతో ప్రియమైనదిగా మారిపోయింది, బంగారం, వజ్రాలకంటే విలువైనదిగా అయిపోయింది.

నేనుడే చోట వృక్షాలు అసలే లేవు, ఎందుకంటే అక్కడ వర్షాలు అస్సలుకే పడవు. ఎప్పుడైన వర్షం పడినా, అది యాసిడ్ వర్షమే అవుతుంది. 20 వ శత్బాదంలో పరిశ్రమలు చేసిన కాలుష్యం, అణు ప్రయోగాల కారణంగా ఋతువుల క్రమం దెబ్బతిన్నది. అప్పట్లో ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడమని ఎందరో మొత్తుకున్నారు, కానీ ఎవరూ వినలేదు, విన్నా పట్టించుకోలేదు.

నా కొడుకు, నా యవ్వనం గురించి మాట్లాడమన్నప్పుడు పచ్చని బైళ్ళ గురించి, అందమైన పువ్వుల గురించి, వానల గురించి, నదులు, డ్యాముల్లో ఈత కొట్టడం గురించి, చేపలు పట్టడం గురించి, కడుపు నిండుగా నీరు త్రాగడం గురించి, ప్రజల ఆరోగ్యం గురించే మాట్లాడుతాను.

అప్పుడు వాడు 'నాన్నా! ఇప్పుడు నీళ్ళెందుకు లేవు?' అని అడగ్గానే నా గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది. నాకు కలిగే అపరాధభావం నుంచి బయటపడలేను. ఎందుకంటే నా తరమే పర్యావరణవినాశనానికి దోహదపడింది, ఎన్ని హెచ్చరికలు చేసిన బేఖాతరు చేసింది. ఇప్పుడు నా పిల్లలు దానికి భారీ మూల్యం చెల్లిస్తున్నారు. నిజాయతీగా చెప్పాలంటే ఈ భూమి మీద జీవం ఇక ఎంతో కాలం ఉండదు. పర్యావరణ విధ్వంసం దారుణమైన స్థితికి చేరుకుంది, ఇప్పుడేమి చేసినా ఫలితం ఉండదు.

కాలంలో వెనక్కు వెళ్ళి మానవాళికి ఎలా చెప్పాలని ఉంది. ఈ భూమాతను కాపాడటానికి ఇంకా మనకు సమయం మిగిలే ఉందని. కానీ అదెలా సాధ్యం.

మీ అబ్దుల్ కలాం
ఇంకా సమయం మిగిలే ఉంది, భూమాతను, ప్రకృతిని కాపాడటానికి. రండి చేయి, చేయి కలుపుదాం. 

No comments:

Post a Comment