Tuesday 28 July 2015

అబ్దుల్ కలాం గారికి ప్రేరణ శివానంద సరస్వతీ



అబ్దుల్ కలాం గారికి ప్రేరణ ఇచ్చిన స్వామి శివానంద సరస్వతీ

కలాంగారు యుక్తవయసులో ఉన్నప్పుడు వారికి పైలట్ ఆశ ఉండేది. అందుకని ఆయన భారతీయ వాయుసేనలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. కాని అందులో రాకపోవడంతో బాధపడిన కలాం గారు రిషికేష్‌కు వెళ్ళారు. అక్కడే వారు జీవన్ముక్తులు, కొన్ని కోట్లమంది జీవితాల్లో వెలుగులు నింపిన సాధుపురుషులు, స్వామి చిన్మయానందకు సన్యాసం ఇచ్చిన గురువులైన స్వామి శివానంద సరస్వతీ గారిని కలిసారు. ఆ ఘటన వారి జీవితాన్ని మలుపు తిప్పింది. వారి 'వింగ్స్ ఆఫ్ ఫైర్' 19 పేజీ లో వారు ఇలా చెప్పారు.

'గంగానదిలో స్నానం చేసి, ఆ పవిత్రజలాల వల్ల మంచి అనుభూతిని పొందాను. అప్పుడు అక్కడే చిన్న కొండ మీదనున్న స్వామి శివానంద ఆశ్రమానికి నడక సాగించాను. అక్కడికి ప్రవేశించడంతోనే చాలా బలమైన భావ తరంగాల ప్రభావానికి లోనయ్యాను. తమను తాము మైమరిచిన స్థితిలో అనేకమంది సాధువులు అక్కడ కూర్చుని ఉండడం చూశాను. సాధువులకు వ్యక్తులు మానసిక స్థితిని తెలుసుకోగల శక్తి ఉంటుందని చదివాను. అందువలన వారినుంచి నా పరిస్థితికి, నన్ను ఇబ్బంది పెడుతున్న సందేహాలకు సమాధానాలు ఆశించాను.

మంచి వంటి తెల్లటి వస్త్రాలు, చెక్క పాదుకలు ధరించి, బుద్ధుడుని పోలి ఉన్న స్వామి శివానందగారిని కలిసాను. నల్లటి కన్నులతో తీక్షణమైన చూపులతో మంచి శరీరఛ్ఛాయతో ఉన్నారు. వారి యొక్క కరుణను, పసిపిల్లలవంటి చిరునవ్వును చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యాను. నన్ను నేను స్వామిజికి పరిచయం చేసుకున్నాను. నా ముస్లిం పేరు వారిలో కాసింత వ్యతిరేక ప్రతిస్పందన కూడా కలగలేదు. నేను మరింత మాట్లాడేబోటుంటే, స్వామి నా దుఃఖానికి గల కారణమడిగారు. నేను దుఃఖంతో ఉన్నానని వారికి ఎలా తెలుసో, వారు చెప్పలేదు, నేను కూడా అడగలేదు.

భారతీయ వాయుసేనలో చేరటానికి చేసిన విఫలయత్నం గురించి చెప్పి, పైలట్ కావలనే నా చిరకాల వాంఛ గురించి చెప్పాను. అప్పుడు వారు నవ్విన చిరునవ్వు నాలోని ఆందోళనను తుడిచివేసింది.

కోరిక, బలమైనది, తీవ్రమైనది అయినప్పుడు, అది ఆత్మ మరియు హృదయం నుంచి ఉద్భవించినప్పుడు గొప్ప విద్యుత్ అయస్కాంతశక్తి కలిగి ఉంటుంది. ప్రతి రాత్రి నిద్రాస్థితిలో ఈ శక్తి మనసు నుంచి ఆకాశంలోకి విడుదలవుతుంది. ప్రతి ఉదయం చేతనలోకి రాగానే విశ్వప్రవాహల చేత మరింత బలం పుంజుకుని తిరిగి ప్రవేశిస్తుంది. అది ఖఛ్ఛితంగా నెరవేరుతుంది. ప్రతి ఉదయం సూర్యోదయమవ్వడం ఎంత నిజమో, కాలతీతమైన ఈ వాగ్దానం కూడా అంతే నిజమని నువ్వు విశ్వసించు.

శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షమవుతాడు. ఎంత సత్యమైన మాట ఇది. దారితప్పిన విద్యర్ధికి దిశానిర్దేశం చేసే గురువు ఇక్కడే ఉన్నాడు. 'నీ విధిని అంగీకరిచి జీవితంలో ముందు సాగిపో. వాయుసేన పైలట్ అవ్వడం నీ గమ్యం కాదు. నీవు ఏమవుతావనేది ఇప్పుడు వెల్లడి కాలేదు, కానీ అది ముందుగానే నిర్ణయించబడింది. ఈ వైఫల్యం మర్చిపో, ఇది నీ గమ్యస్థానానికి చేర్చే మార్గం అయ్యింది. దానికి బదులుగా, నీ అస్థిత్వం/ఉనికి యొక్క నిజమైన ప్రయోజనం కోసం శోధించు. నీ ఆత్మతో ఏకమవ్వు. నా తండ్రి! భగవంతుని ఇఛ్ఛకు శరాణగతుడవు అవ్వు' అన్నారు స్వామిజీ.

ఈ సంఘటన కలాం గారి జీవితాన్ని మార్చేసింది. సాధూనాం దర్శనే పుణ్యం, సమాగమే సర్వం లభతి అన్నారు సుభాషితకారులు. సాధువుల దర్శనమే పుణ్యమని, వారితో కలిసి మాట్లాడటం వలన పొందలేనిది లేదని అర్దం. దానికి ఇదే కదా ప్రత్యక్ష ఉదాహరణ.  స్వామి శివానందగారి దర్శనం, ఉపదేశం, భారతదేశం గర్వించదగ్గ ఓ పురుషుడిని  ఇచ్చింది. వారి ద్వారా భరతమాత అణురంగంలో స్వాలంబన సాధించగలిగింది. 

No comments:

Post a Comment