Sunday 5 July 2015

హిందూ ధర్మం - 165 (వేదాంగ పరిచయం)

వేదాంగాలు

వేదాలను అర్దం చేసుకోవటానికి, సరైన విధంగా వ్యాఖ్యానం (interpretation) చేయటానికి ఋషులు ఏర్పరిచినవే వేదాంగాలు. వేదాంగం, వేదాంత రెండు పర్యాయపదాలు కావు, అవి భిన్నపదాలు. వేదాంతం అంటే వేదం యొక్క అంత్యభాగం, అవే ఉపనిషత్తులు. ఇవి అనుభూతికి ప్రాధాన్యతనిస్తాయి. వేదాంగాలు వేదాన్ని అర్దం చేసుకోవటానికి ఉపయోగపడే భాగాలు. అయితే ముందు అసలు వీటి అవసరమేంటో తెలుసుకుందాం. వీటి అవసరం తెలిస్తే, వాటి గురించి చాలావరకు స్పష్టత వస్తుంది.

సమాధి స్థితిలో ఉన్న ఋషులు వేదాలను దర్శించారు. వారు మంత్రద్రష్టలు. సమాధి అంటే? ఇది యోగశాస్త్రం ఆధారంగా చెప్పవలసిన విషయం. భగవంతుడు/పరబ్రహ్మం సముద్రం వంటివాడు. ఆత్మ ఆ సముద్రం నుంచి ఆవిరై వచ్చిన చిన్న బింధువు. బింధువు సముద్రం నుంచి వేరుగా ఉన్నప్పుడు దానికి ప్రత్యేక అస్థిత్వం ఉంటుంది. కానీ ఆ బింధువు సముద్రంలో కలిసిపోతే, అది కూడా సముద్రంలో భాగం అయిపోతుంది. తన అస్థిత్వాన్ని కోల్పోతుంది. అట్లాగే సమాధి అనగా ఆత్మ, పరమాత్మలో ఐక్యం అయిన స్థితి, బింధువు సింధువులో కలిసిన స్థితి అది. అక్కడ వేరుగా నేను అనే చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అది మాటలకు, మనసుకు అందే స్థితి అసలే కాదు. అక్కడ కేవలం అనుభూతి మాత్రమే ఉంటుంది. ఆ అనుభూతి భాషకు, భావానికి అతీతమైనది. అటువంటి సమాధి స్థితిలో ఋషులు వేదాలను దర్శించారు. వాటికి వారే వ్యాఖ్యానాలు కూడా రాశారు, వాటిని బ్రాహ్మణాలు అంటారు.

అంతవరకు బాగానే ఉంది. వారి స్థాయి వేరు, మన స్థాయి వేరు. వారికి భగవంతుడు తప్ప వేరొకటి కనబడదు, తాము జడమైన శరీరం కాదు, శరీరం జీవించడానికి కారణమైన చైతన్యమే తామని నిశ్చయంగా అనుభవంలో తెలుసు. మరి మనకో? మాములు స్థాయిలో నేను ఈ శరీరం అనుకుంటున్నాం, లేక నేనీ దేహం కాదు, ఆత్మ అన్న భావన కలిగి ఉన్న, అది అనుభవంలో లేదు. ఋషుల మాటల మీద మనకు విశ్వాసం ఉన్నా, అనుభవంలో నిశ్చయంగా తెలియదు. కాబట్టి దేహంతో తాదాత్మ్యత కలుగుతూనే ఉంటుంది. అది కలిగినన్ని రోజులు వ్యక్తికి కొన్ని బంధాలు ఉంటాయి. కొన్ని పరిమితులు కూడా ఉంటాయి. వాటికి లోబడే అతను జీవనం సాగించాల్సి ఉంటుంది.

మన స్థాయికి, ఋషులు స్థాయికి అంత భేధం ఉన్నప్పుడు మనకు ఆ సర్వోత్కృష్ట జ్ఞానం ఎలా అర్దమవుతుంది? ఒకవేళ అర్ధం కాకపోతే ఎవరికి తగిన అర్దాలు వారు వెతుక్కుంటారు. వేదమే ధర్మానికి మూలం. దాన్ని తప్పుగా అర్దం చేసుకుంటే ధర్మాచరణంలో అయోమయం ఏర్పడుతుంది. ఫలితంగా లోకంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇది పెద్ద ప్రమాదం.

To be continued..............

No comments:

Post a Comment