Sunday 27 July 2014

హిందూ ధర్మం - 107 (భారతీయతకు తత్వార్ధం)

భగవంతుడు సచ్చిదానందుడు. ఆయనకు జననమరణాలు లేవు. భగవంతుని యందు రమించేవాడు, భగవంతుని తెలుసుకున్నవాడు భగవత్స్వరూపంగా మారుతున్నాడు. అందుకే శంకరులు వివేకచూడామణిలో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి - బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు అని అన్నారు. భగవంతుడు శాశ్వతమైనవాడు, సనాతనుడు. భగవంతుని యందు రమించడం అంటే అశాశ్వతమైన లౌకిక ప్రపంచం నుంచి శాశ్వతమైన తత్వాన్ని చేరుకోవడం. దీన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే 'అసతో సద్గమయా' - ఓ పరమేశ్వరా! మేము అసత్ నుంచి సత్‌కు వెళ్ళెదము గాకా అన్న ఉపనిషద్ వాక్యానికి అర్దం. ఇది భారతీయత, అలా వెళ్ళెవాడు భారతీయుడు, అలా భగవత్స్వరూపంగా మార్చే భూమికి భారత భూమి అని పేరు.

భాః అంటే వెలుగు. వెలుగునందు రమించేవాడు భారతీయుడు. ఈ ధర్మం, ఈ భూమి, మనిషికి ప్రశ్నించే స్వేచ్చను, ఆలోచించే అవకాశాన్ని ఇచ్చాయి. ప్రశ్నించడం ద్వారా,  'నైతి, నైతి' (ఇది కాదు, ఇది కాదు) అంటూ పరబ్రహ్మ తత్వాన్ని, ఆత్మ తత్వాన్ని విచారణ చేస్తూ వ్యక్తి తన సచ్చిదాంద స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు. తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకున్నవ్యక్తిలో అజ్ఞానమనే అంధకారం నశిస్తుంది. 'తమసోమా జ్యోతిర్గమయా' - ఓ పరబ్రహ్మ! మేము తమస్సు నుంచి వెలుతురునకు వెళ్ళెదము గాకా అన్న వాక్యానికి అర్దం. భారతీయత అంటే తమసోమా జ్యోతిర్గమయా.

భాః అంటే జ్ఞానం. జ్ఞానమునందు రమించేవాడు భారతీయుడు. ఆత్మజ్ఞానం మనిషికి అమృత తత్వాన్ని ఇస్తుంది. జననమరణ చక్రం నుంచి విడుదల చేస్తుంది. దానికి ధార్మికగ్రంధాలు సులువైన మార్గం చూపించాయి. అత్మను తెలుసుకున్నవాడు మృత్యును జయిస్తున్నాడు. 'మృత్యోర్మా అమృతంగమయా' - ఓ పరమాత్మ! మేము మృత్యును నుంచి అమృతత్వాన్ని చేరుకుందుము గాకా అని అర్దం. భారత అంటే మృత్యోర్మా అమృతంగమయా .

ఉపనిషద్ యొక్క మూడు వాక్యాలకు అర్దం భారత అనే పదంలో కనిపిస్తుంది. భారతదేశం అంటే పై మూడుంటిని ఇక్కడ జన్మించనంత మాత్రం చేతనే సులువుగా అర్దం చేసుకునే శక్తిని ఇచ్చే భూమి అని. మూడుగా చెప్పుకున్న తెలుసుకోవలసినది ఒక్కటే. అది తెలిస్తే, ఇంక రెండవది తెలుసుకోవడానికి ఏదీ ఉండదు. ఆ స్థితిలో జ్ఞానం, అజ్ఞానం అనే రెండు ఉండవు. ఎందుకంటే ఆ స్థితి ఈ రెండిటికి అతీతమైనది. ఆ స్థితిని చేరుకోగల సమర్ధులకు భారతీయులను పేరు. ఆ సమర్ధతను ఇచ్చే సంస్కృతికి భారతీయ సంస్కృతి అని, ఆ అర్హతను ప్రసాదించే భూమి భారతభూమి అని పేరు.      

To be continued ...........

2 comments:

  1. very unfortunate. no comments. people must learn to give their view. it gives greatest satisfaction and encouragement to writer.

    ReplyDelete
    Replies
    1. Thank you very much sir for your encouragement.

      Delete