Saturday 21 May 2016

బుద్ధుడిని కమ్యూనిష్టులు, దేశద్రోహుల నుంచి రక్షించుకోవాలి

ఇప్పుడు హిందువులను, హిందూ ధర్మాన్ని తులనాడటానికి ధర్మద్వేషులు తగిలించుకున్న ముసుగు బౌద్ధం. బుద్ధుడి గురించి, ఆయన చేసినవాటి కంటే చేయని ఎన్నో విషయాలను కల్పించి, బుద్ధుడు సనాతనధర్మాన్ని వ్యతిరేకించాడని ఆయన్నూ ధర్మవ్యతిరేకిగా చిత్రీకరిస్తున్నారు. భారతదేశంలో బౌద్ధం గురించి చదివిన వారు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, చైనా, జపాన్ దేశాల్లో బౌద్ధం మూల గ్రంధాలు చదివిన వారు భారతదేశం పట్ల, హైందవ సంస్కృతి పట్ల అపారమైన గౌరవం ప్రదర్శిస్తున్నారు. అసలు బుద్ధుడు ఎప్పుడూ హైందవ ధర్మాన్ని వ్యతిరేకించలేదని వాళ్ళు నిర్ధారిసున్నారు. ఈ సమయంలో అసలు బుద్ధుడు చేసిందేమిటో మనం తప్పక తెలుసుకోవాలి.

జీవితంలో ఎదురైన సంఘటనల వలన తనలో కలిగిన అంతర్మధనానికి సమాధానంగా ఆయనకు వటవృక్షం క్రింద జ్ఞానోదయం అయింది. దానికి ముందు ఆయన సమాజాన్ని త్యజించాడు కానీ వైదిక ధర్మాన్ని కాదు. వేదంలో జ్ఞానకాండ, కర్మ కాండ అని రెండు విభాగాలున్నాయి. ఒకటి ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. సమాజం ముందుకు వెళ్ళడానికి, వ్యక్తి మోక్షాన్ని పొందడానికి రెండు అవసరం. బుద్ధుడి కాలం వచ్చేనాటికి సమాజంలో జ్ఞానకాండ కంటే కర్మ కాండకు అధికప్రాధాన్యం ఏర్పడింది. ఇది మానవ స్వభావానికి సహజం. బుద్ధితో విచారణ చేసే ప్రక్రియ కంటే పనులు చేసి మౌనంగా ఉండడానికే చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. తనకు జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధుడు ఈ పరిస్థితిని గమనించాడు. సమాజానికి జ్ఞాన బోధ జరగాలి. కానీ ఆత్మజ్ఞానం ఇంద్రియాలకు అతీతమైనది. దానికి ఎంతో సూక్ష్మమైన బుద్ధి, విచారణ శక్తి కావాలి. భగవంతుని విషయం కూడా అంతే. అందుకని బుద్ధుడు అంత లోతైన బోధనలు చెప్పదల్చుకోలేదు. తన దగ్గరకు వచ్చిన వారికి తక్షణం (instant) శాంతిని ఇచ్చి, భాధలు, దుఃఖాలను అధిగమించే భోధనలు సులభ శైలిలో అందించాడు. ఎక్కడా ఆత్మసాక్షాత్కారం వంటి ప్రక్రియల గురించి చెప్పలేదు. భగవంతుడున్నాడా? అని ఆయన్ను ప్రశ్నించగా, దానికి ఆయన లేడు అని చెప్పలేదు. 'పవిత్రమైన మౌనం' వహించాడు. ఈశ్వరసాక్షాత్కారానికి అతీయింద్రియ జ్ఞానం కావాలి. దానికి పాటించాల్సిన విధులు కూడా అనేకం ఉంటాయి. అవన్నీ మాములు స్థాయిలో ఉన్నవారికి చెప్తే, అర్దంకాక పోగా గందరగోళానికి దారి తీస్తుంది. ఈ విషయాన్ని తర్వాతి కాలంలో బౌద్ధులు వేరేగా అర్దం చేసుకున్నారు. బుద్ధుడు ఆత్మ గురించి మాట్లాడలేదు కనుక ఆత్మలేదని, అనాత్మవాదాన్ని తీసుకువచ్చారు. ఈశ్వరుడి విషయంలో మౌనం వహించగా, దాన్ని తప్పుగా అర్దం చేసుకుని నిరీశ్వరవాదాన్ని ప్రచారం చేశారు.

బుద్ధుడు సమాజంలో ఎక్కడ వైదిక క్రతువులను ఖండించలేదు. అప్పటికే కర్మకాండ బాగా ప్రచారంలో ఉంది. ఇక దాని గురించి ప్రత్యేకించి చెప్పవలసిందేమీ లేదు. కనుక ఆ విషయాన్ని విడిచి తక్షణ ఫలితాలనిచ్చే జ్ఞానాన్ని ప్రచారం చేశాడు. సమాజానికి బలం చేకూర్చే 7 అంశాలను బుద్ధుడు చెప్తూ, ప్రాచీన సంస్కృతికి, ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండటం మరియు పుణ్యక్షేత్రాలను నిలుపుకోవడం, ప్రాచీన క్రతువులను గౌరవించడం [Dīgha Nikāya 2:73] వంటివి అందులో చేర్చారు. ఈ క్రతువులు ఒట్టికర్మలు కాదని, సమాజంలో ఐక్యతను తీసుకువచ్చేవేనని అభిప్రాయపడ్డాడు.ఇక బుద్ధుడు వేదాన్ని ఖండించడమేంటి? బుద్ధుడు వాటి గురించి మాట్లాడలేదని, ఆయన తర్వాత చాలాకాలానికి ఏర్పడ్డ బౌద్ధం వైదిక క్రతువులను ఖండించింది.

వేదంలో చెప్పిన మార్గం కాక, కొత్తమార్గాలను జనం పట్టుకున్నారు. అందువల్లే జంతుబలి వచ్చింది. దాన్ని ఖండిస్తూ, అహింసను ప్రభోధించాడు. జీవుల పట్ల కారుణ్యం కలిగి ఉండమన్నాడు. ధర్మంలో ఇలాంటి హింస లేదని, బుద్ధిని ఉపయోగించమని హితవు పలికాడు. బుద్ధుడు చెప్పిన అహింస వేదం మొదలు ఉపనిషత్తులు, స్మృతులు, పురాణాల్లో చెప్పబడి ఉన్న అంశమే కానీ కొత్త విషయం కాదు. బుద్ధుడు తాను మొదటి వాడిని కానని, ఇంతకముందు అనేక మంది బుద్ధులు (అతీయింద్రియ జ్ఞానం ద్వారా కలిగిన బుద్ధిని ఉపయోగించేవారు, ఋషులు) వచ్చారని వెళ్ళడించాడు. సనాతన ఋషి పరంపరను ఎక్కడా ఖండించలేదు.

తాను శ్రీ రాముడి అంశ అని, అందువల్లే సూర్యవంశంలో జన్మించానని చెప్పుకున్నాడు. బౌద్ధుల జాతక కధలలో రామాయణం కూడా ఉంది. ఇంకో చోట తాను విష్ణువు అంశ అని చెప్పుకున్నాడు. అలాంటి బుద్ధుడు శ్రీ రామ, శ్రీ కృష్ణులను ఇచ్చిన సంస్కృతిని ఖండిస్తాడా?

బుద్ధుడు కుల వ్యవస్థను వ్యతిరేకించాడని ఈ రోజు అనేకులు చెప్తున్నారు. అసలు బుద్ధుడి కాలానికి అంటరానితనం కానీ, కుల వ్యవస్థ కానీ లేదు. బుద్ధుడు అందరిని ఆర్యులుగా బ్రతకమన్నారు. వేదంలో ఆర్య అంటే శ్రేష్టమైన అనే అర్దం ఉంది. 'చత్వారి ఆర్య సత్యాని', 'ఆర్య అష్టాంగిక మార్గం' అనేవి బౌద్ధంలో ఉన్నాయి. తన తర్వాత వచ్చే బుద్ధుడు పేరు మైత్రేయుడని, అతడు బ్రాహ్మణ వంశంలో జన్మిస్తాడని స్వయంగా బుద్ధుడే చెప్పాడు. అనేక బౌద్ధ గ్రంధాల్లో కూడా బోధిసత్త్వుడు బ్రాహ్మణ, క్షత్రియ వంశాల నుంచే మాత్రమే వస్తారని చెప్పబడింది.

బుద్ధుడు ఆనాటి కాలానికి తగ్గట్టుగా బోధనలు అందించాడు. కానీ కాలక్రమంలో ఆయన శిష్యులు పొరబడి, వేదం నుంచే ధర్మం, కర్మసిద్ధాంతం, అహింస వంటి అంశాలను స్వీకరించి, చివరకు వేదాన్నే ఖండిస్తూ బౌద్ధం అనే మతాన్ని ఏర్పరిచారు. వైదిక మతం నుంచి ఆయుర్వేద, యోగ రహస్యాలను తీసుకుని, వారు కూడా అనేక స్వస్థత ప్రక్రియలను రూపొందించుకున్నారు. ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్యాలను స్వీకరించి, వాటి మీద వారు కూడా పరిశోధించి, మనసుకు సంబంధించిన అనేక విషయాలను అందించారు.

పాశ్చాత్య దేశాల్లో ఎందరో చిన్న వయసులోనే సత్యాన్వేషణకు పూనుకుని, క్రైస్తవం నుంచి ఇస్లాంకు, అక్కడి నుంచి టోయిజం మొదలైన మతాలకు వచ్చి, బౌద్ధం స్వీకరిస్తున్నారు. కమ్యూనిష్టులు రాసిన బౌద్ధ రచనలు కాక, మూలగ్రంధాలు నిజాయతీగా చదివి, బౌద్ధం కంటే సనాతనధర్మమే పరిపూర్ణమని, బుద్ధుడిని ఇచ్చింది హైందవమేనని, ఇదే మోక్షానికి మార్గమని బౌద్ధం నుంచి ఇందులో ప్రవేశిస్తున్నారు. అటువంటి బౌద్ధం నుంచి హైందవంలోకి వచ్చిన పాశ్చాత్యులు అనేకమంది, కొన్రాడ్ లెస్ట్ వంటి చరిత్ర పరిశోధకుల అనుభవాల ఆధారంగా ఇది రాయడం జరిగింది. నిజమైన బౌద్ధం అర్దమవ్వాలంటే కమ్యూనిష్టులు, హైందవ వ్యతిరేకులు రాసిన రచనలు కాక, బౌద్ధ దేశాల్లో లభ్యమయ్యే గ్రంధాలు చదివితే తెలుస్తుంది. భారతదేశంలో బౌద్ధులు బుద్ధుడిని కమ్యూనిష్టులు, దేశద్రోహుల నుంచి రక్షించుకోవాలి.

http://koenraadelst.blogspot.in/2012/05/buddha-and-caste.html

సత్యాన్వేషకులకు, నిజమైన బౌద్ధులకు, హిందువులకు బుద్ధపూర్ణిమ శుభాకాంక్షలు.

2 comments:

  1. చాలా సంతోషమండి... అందరూ తప్పుదోవ పెడుతున్న విషయాన్ని సరిగ్గా వివరించారు. అసలు బుద్దుడు జ్ఞానోదయం పొందినది ధ్యాన మార్గంలోనే కదా. ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. అది కూడా మోక్ష హేతువు. ఈ విషయాన్ని అర్ధం చేసుకోకుండా వితండ వాదం చేసేవారితోనే అసలు ముప్పు ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. అవునండి, సనతానధర్మంపై దాడి చేయడానీ ఇప్పుడు ధర్మద్వేషులు ఎదురుకున్న మార్గం బౌద్ధం.

      Delete