Saturday 7 May 2016

నాస్తికత్వం నుంచి ఆస్తికత్వానికి నా ప్రయాణం - స్వామి చిన్మయానంద

8 మే 2016 స్వామి చిన్మయానంద శతజయంతి. ఆ సంధర్భంగా వారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన గురించి తెలుసుకుందాం.

చిన్మయా మిషన్ స్థాపకులు స్వామి చిన్మయానంద యవ్వనంలో నాస్తికులు. వారు ఆస్తికులుగా మారిన విషయాన్ని, భగవాన్ రమణ మహర్షి గురించి స్వయంగా తామే రాసుకున్నారు.

'నేను (స్వామి చిన్మయానంద, పూర్వాశ్రమంలో బాలకృష్ణ మీనన్), అప్పుడే హైస్కూల్ విద్య నుంచి బయటకు వస్తున్నాను, పరీక్షలు ముగిసాయి. రైల్యే పాకేజీ టికెట్ మీద దక్షిణభారతాన్ని సందర్శిస్తున్నాను. రైలు ఆగాలని నెమ్మదిగా వెళుతూ ఒక ఊరి వద్దకు రాగానే, హఠాత్తుగా నా బోగిలో ఉన్న ప్రయాణికులందరూ ఎంతో కుతుహలంతో కిటికీల్లోంచి చూస్తూ, భక్తితో ఒక ఆలయానికి మొక్కుతున్నారు. దాని గురించి అడుగగా, అది తిరువణ్ణామలై (అరుణాచలం) దేవాలయమని తెలిసింది.

అటు తర్వాత నాతోటి ప్రయాణికుల సంవాదం భగవాన్ రమణమహర్షి వైపు తిరిగింది. మహర్షి అన్న పదమే నా మనసుకు పురాతన కాలంలో వనాల్లో ఉంటూ, దివ్య ప్రకాశం గల మాహపురుషులను గుర్తుకు తెచ్చింది. అప్పటికి నేను నాస్తికుడినే అయినా, మహర్షి ఆశ్రమం నన్ను ఎందుకో తనవైపు లాగింది. దాన్ని సందర్శించాలని అనిపించింది. తదుపరి రైలులో తిరువణ్ణామలైకు చేరాను.

మహర్షి హాలులో ఉన్నారని, లోపలకి వెళ్ళి స్వేచ్చగా మాట్లాడవచ్చని,  అందరికి ఆ అవకాశం ఉందని, ఆశ్రమంలో చెప్పారు. నేను ప్రవేశించగానే, సోఫా మీద, కౌపీనం ధరించి, గుండ్రని దిండుపై వాలిన ఒక పెద్దవయసు వ్యక్తిని చూశాను. ఆ సోఫా పక్కనే నేను కూర్చున్నాను. ఉన్నట్టుండి మహర్షి కళ్ళు తెరిచి నేరుగా నా కళ్ళలోకి చూశారు. నేను ఆయన కాళ్ళలోకి చూశాను. కేవలం చూశారు, అంతే. మహర్షి క్షణంలోనే నా అంతరం లోతుల్లోకి చూస్తున్నారనిపించింది. ఆయన నాలోని డొల్లతనాన్ని, గందరగోళాన్ని, అవిశ్వాసాన్ని, అసంపూర్ణతలను, భయాలను చూశారన్నది నిశ్చయం.

ఆ క్షణంలో ఏమి జరిగిందో నేను చెప్పలేను. నేను వికశించాను, శుద్ధమయ్యాను, స్వస్థతను పొందాను. (పాతభావల నుంచి) ఖాళీ చేయబడ్డాను. గందరగోళాల సుడిగుండాలు మొదలయ్యాయి. నా నాస్తికత్వం నశించసాగింది. అదే సమయంలో సంశయవాదం వరదలా ప్రశ్నలుగా, ఆశ్చర్యంగా, అన్వేషణగా మారిపోయింది. నా తర్కం నాకు బలాన్నిచింది. ఇదంతా ఇంద్రజాలమని, నా మూర్ఖత్వమని నాకు నేనే చెప్పుకున్నాను. ఆ హామీతోనే లేచి, వెళ్ళిపోయాను.

కానీ ఆ హాలు నుండి బయటకు వెళ్ళినవాడు ఆ హాలులోనికి పది నిమిషాల ముందు వెళ్ళినవాడు కాడు. నా కాలేజీ రోజుల తర్వాత, రాజకీయాల తర్వాత, సంవత్సరాలుగా ఉత్తరకాశీలో నా గురువు తపోవనం వద్ద నివసించిన తర్వాత, గంగా తీరంలో నేను ఏదైతే పొందానో, అదే కేవలం తన దృష్టి చేత అరుణాచల మహర్షి ఆ ఎండాకాలపు రోజున నాకిచ్చారు.

ఇది స్వామి చిన్మయానందులు 1982 లో ఒక ప్రసంగంలో చెప్పారు.
'శ్రీ రమణుడు' చర్చించే అంశం కాదు. ఆయన ఒక అనుభూతి. ఆయనోక చైతన్య స్థితి. శ్రీ రమణుడే ఉత్కృష్టమైన సత్యం, అన్ని గ్రంధాల యొక్క సారం. బంధరహితంగా ఒక గురువు ఎలా జీవించగలడో, ఆయన అందరికి చూపారు. మానవరూపంలో ఉన్నా, సుందరంగా, శుద్ధమైన పరబ్రహ్మతత్వంగా జీవించారు.

బాలకృష్ణ మీనన్ కాలక్రమంలో స్వామి చిన్మయాందులై వేదంతసారాన్ని ప్రపంచం దశదిశల వ్యాపింపజేశారు. అతి క్రిందస్థాయి ప్రజలకు కూడా వేదాంతాన్ని అందించిన ఘతన స్వామి వారిదే.

ఇద్దరి పాదాలకు నా ప్రణామాలు

No comments:

Post a Comment