Monday 12 January 2015

స్వామి వివేకానంద

ఉత్తిష్టత, జాగ్రత, ప్రాప్యవరాన్నిభోద్యత - లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి అంటూ ఉపనిషత్ వ్యాక్యాలను అందరికి అర్దమయ్యే రీతిలో చెప్పి, భారతీయుల్లో ఆత్మ విశ్వాసాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేశారు స్వామి వివేకానంద. భారతమాత కన్న మహామననీయుల్లో ఒకరు స్వామి వివేకానంద. 80 పైగా మతాలు, జైన, భౌద్ధాలు హిందూధర్మాన్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, 2000 ఏళ్ళకు పూర్వం హిందూజాతి చూసిన మహాపురుషుడు ఆదిశంకరాచార్యులవారు. ఆదిశంకరులే లేకపోతే అసలు హిందూ సంస్కృతి, భారతదేశం ఈనాటికి మిగిలి ఉండేవికావు. తన జీవతం మొత్తాన్ని ధర్మరక్షణకు అంకితం చేసి, భౌద్ధ, జైన మతాల్లోకి మారిన అనేక వేలమంది హిందువులను తిరిగి హిందూ ధర్మంలోకి తీసుకువచ్చారు శంకరాచార్యులు. సరిగ్గా అలాంటివారే స్వామి వివేకానంద.

1863 జనవరి 12న జన్మించారు స్వామి వివేకానంద. వివేకనందుడికి పూర్వాశ్రమ నామం నరేంద్రనాధ్ దత్తు. హిందూ ధర్మంలో ఏముందిలే? అసలు మన సంస్కృతిలో గొప్పతనేమేమి లేదు అని భావిస్తూ, అంధకారంలో మగ్గుతున్న హిందువుల ముందు ఉదయించిన సూర్యుడు స్వామి వివేకానంద. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శిష్య గణం, పేరు ప్రఖ్యాతులతో తాను ఒక కొత్త మతం స్థాపించి, కొత్త ప్రవక్తగా గొప్పగా స్థిరపడచ్చని తెలిసి కూడా, తన జీవితాన్ని హిందూ ధర్మ పునరుద్ధరణకు, ధర్మ సంస్కరణకు అంకితం చేశారు స్వామి. విదేశి కుట్రలతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోయిన హిందువుల్లో ఆత్మ విశ్వాశాన్ని రగిల్చే ప్రయత్నం చేశారు. అప్పటివరకు భారతదేశానికే పరిమితమైన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన తొలి వ్యక్తి వివేకానందుడే. సాధువైనా అపారమైన దేశభక్తి కలిగి, ఎందరో దేశభక్తులకు స్పూర్తినిచ్చారు స్వామి వివేకానంద.

నా దేశంలో కుక్క కూడా ఆకలితో చచ్చిపోవడం నేను సహించలేను అన్నారు. మీకు భారతదేశం కోసం ఏదైనా చేయలనిపిస్తే, హిందూ ధర్మ పునఃస్థాపనకు, ధర్మ జాగరణకు కృషి చేయండి. ఈ దేశమూ, ధర్మమూ రెండూ ఒక్కటే, రెండిటి మధ్య ఉన్న సంబంధం శరీరము ఆత్మ సంబంధం వంటిది, హిందూత్వమే భారతీయ ఆత్మ అన్నారు. మీరు నా పిల్లలు, నేను మీకు అండగా ఉంటాను, మీరు దేనికి భయపడకండి అంటూ యువతలో ధైర్యం నింపినా, అది వివేకానందుడికే చెల్లింది. ఈ ప్రపంచంలో ఆఖరి వ్యక్తి ముక్తి పొందెవారకు నేను నా ముక్తిని వాయిదా వేసుకుని, మళ్ళీ మళ్ళీ జన్మించడానికి సిద్ధంగా ఉన్నా అంటూ చెప్పిన వివేకానందుడి మాటలు చిరస్మరణీయాలు. వివేకానందుడి రచనలు చదవని వారి జీవితం వ్యర్ధమనే చెప్పాలి.

నా రచనలు చదివేవారికి పక్కన నేనుండి చెప్పినట్టే ఉంటాయి అన్న స్వామిజీ మాటలు అక్షరసత్యాలు. స్వామిజీ రచనలు చదివినా చాలామందిలో భావావేశంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి.

ఉత్తిష్టత, జాగ్రత, ప్రాప్యవరాన్నిభోద్యత - లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి 

No comments:

Post a Comment